Manchu Vishnu: కన్నప్పకెన్ని కష్టాలో...
ABN, Publish Date - May 27 , 2025 | 10:19 AM
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' చిత్రం జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యిందట!
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) కు కష్టాలు ఇంకా తీరడం లేదు. జూన్ 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా... తాజాగా ఆ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్సయ్యింది. ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత మోహన్ బాబు (Mohan Babu) ఈ విషయాన్ని అధికారికంగా తెలియ చేయకపోయినా... ఫిల్మ్ నగర్ లో ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం.
ఫిల్మ్ నగర్ లోని 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు ఇటీవల ముంబైలోని హెచ్.ఐ.వి.ఈ. స్టూడియోస్ నుండి డీటీడీసీ కొరియర్ ద్వారా విఎఫ్ఎక్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ వచ్చిందట. దాన్ని ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకుని, చరిత అనే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుండి వారిద్దరూ కనిపించడం లేదని తెలుస్తోంది. దీనిపై సంబంధింత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారట. 'కన్నప్ప' సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో గత యేడాది ద్విగిజయంగా జరిగింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైన దగ్గర నుండి ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. గత యేడాది విడుదల కావాల్సిన 'కన్నప్ప' సినిమాను బెటర్ వి.ఎఫ్.ఎక్స్. కోసం పలు మార్లు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 25న విడుదల చేయాల్సిన సినిమాను సంతృప్తికరంగా గ్రాఫిక్ వర్క్ జరగలేదని, జూన్ 27కి పోస్ట్ పోన్ చేశారు.
ఇదిలా ఉంటే... ఈ నెల 28న ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పై చిత్రీకరించిన 'శ్రీ కాళ హస్తి' గీతాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఈ లోగా ఈ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో 'కన్నప్ప'ను జూన్ 27న విడుదల చేస్తారా? లేకపోతే మరోసారి వాయిదా వేస్తారా? అనేది చూడాలి.
మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. చిత్రం ఏమంటే... కొంతకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పరంగానే కాకుండా ఇంటిపోరు సైతం 'కన్నప్ప'కు తప్పలేదు. ఈ సినిమాపై మంచు విష్ణు సొంత తమ్ముడు మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే తాజాగా తన 'భైరవం' సినిమా విడుదల నేపథ్యంలో మాట్లాడుతూ, 'తమ చిత్రంతో పాటు 'కన్నప్ప' కూడా మంచి విజయాన్ని సాధించాల'ని కోరుకుంటున్నట్టు మనోజ్ తెలిపాడు. అయితే 'కన్నప్ప' హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ కు ఇంటి దొంగలే పాల్పడటం వెనుక ఏదో తెలియని మిస్టరీ దాగుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి