Manchu Family: సోదరుల బాటలో మంచు లక్ష్మీ...
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:03 PM
కుటుంబ కలహాలతో మొదలైన మంచు ఫ్యామిలీ వార్ ఇప్పుడు నిదానంగా చల్లబడుతోంది. మంచు విష్ణు, మనోజ్ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. విష్ణు నటించిన 'కన్నప్ప'కు పాజిటివ్ టాక్ రాగా... మనోజ్ 'మిరాయ్' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మిగిలి ఉంది మంచు లక్ష్మీ మాత్రమే! ఆమె నటిస్తున్న 'దక్ష' హిట్ అయితే... ఇక ఆల్ హ్యాపీస్!
ఒక్కో సంవత్సరం సినిమా రంగంలోకి ఒక్కో ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుంటుంది. వారసులకు పట్టం కట్టే సినిమా రంగంలో నిజానికి వారసుల జీవితాలేమీ వడ్డించిన విస్తర్లు కావు. మొదటి రెండు మూడు సినిమాల వరకూ వారసత్వమనే ట్యాగ్ పనిచేస్తుంది కానీ ఆ తర్వాత ఎవరి ప్రతిభను బట్టి వారు రాణించాల్సిందే. అందుకే ఎంతోమంది వారసులు ఇలా సినిమా రంగంలో అడుగు పెట్టి... అలా మాయమై పోయారు. కానీ దీనినే నమ్ముకుని, కష్టపడి ఇక్కడే రాణించాలనే పట్టుదలతో ప్రయత్నించి వారే తమ ప్రతిభ కారణంగా కొనసాగుతూ ఉంటారు. అలా ఎన్నో ఎత్తుపల్లాలను చూసి కూడా మడమ తిప్పకుండా ముందుకు సాగుతున్న వాటిలో 'మంచు ఫ్యామిలీ' (Manchu Family) కూడా ఉంది. కొన్నేళ్ళు విజయం అనే మాటనే వీళ్ళు వినలేదు. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఎట్టకేలకు... ఈ యేడాదిలో మంచు ఫ్యామిలీకి కాస్తంత మంచి ఫలితాలు దక్కుతున్నాయి. మొన్నటి వరకూ అన్నదమ్ములైన మంచు విష్ణు, మనోజ్ రకరకాలుగా గొడవలు పడ్డారు. రోడ్డుకెక్కారు, పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని గొడవలు సద్దుమణిగినట్టుగా అనిపిస్తోంది. మంచు విష్ణు (Manchu Vishnu) తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' (Kannappa) తో గొప్పగా లాభాలు సంపాదించకపోయినా... ఉన్న నెగెటివిటీని తుడిచేసుకున్నాడు. భక్తి రస ప్రధాన పాత్రలను అతను కూడా చేయగలడని ప్రేక్షకులు విశ్వసించేలా 'కన్నప్ప'లో నటించాడు. ఆ చిత్ర నిర్మాతగానే కాకుండా, నటుడిగానూ మోహన్ బాబు (Mohanbabu) ఓ పాజిటివ్ వైబ్ ను అందుకున్నారు. 'కన్నప్ప' సినిమాకు పెట్టిన పెట్టుబడి రాకపోయినా... భారీ నష్టాలనైతే తెప్పించలేదు. పైగా ఇది పాన్ ఇండియా రిలీజ్ కావడం, ఓటీటీలో సినిమాకు మంచి ఆదరణే లభిస్తుండటం మంచు విష్ణుకు అదనంగా అచ్చివచ్చిన అంశాలే! ఆ రకంగా 'కన్నప్ప' కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా... వచ్చిన టాక్ కు మంచు అండ్ ఫ్యామిలీ హ్యాపీ. పైగా అప్పటి వరకూ అన్నపై కయ్యానికి కత్తులు దూసిన మనోజ్ సైతం తన వైరాన్ని పక్కన పెట్టి విష్ణును అభినందించాడు.
ఇక తాజాగా విడుదలైన 'మిరాయ్' (Mirai) సినిమా హీరోగా తేజ సజ్జా (Teja Sajja) కు ఎంత పేరు తెచ్చిపెట్టిందో అందులో విలన్ గా నటించిన మంచు మనోజ్ (Manchu Manoj) కు అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. సరైన సమయంలో మంచు మనోజ్ కు లభించిన సరైన హిట్ ఇది. 'మిరాయ్' చూసిన వారంతా మంచు మనోజ్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. విష్ణు సైతం తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ రకంగా ఇద్దరి వైపు నుండి ఓ పాజిటివ్ నోట్ అభిమానులకు చేరింది. అలా మంచు మోహన్ బాబు తనయుడు విష్ణు, మనోజ్ ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఇక మిగిలింది... వీరిద్దరి అక్క మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నే! తమ్ముడు మనోజ్ అంటే ప్రాణం పెట్టే లక్ష్మీ... కుటుంబ వ్యవహారంలో జరిగిన రచ్చకు వీలైనంత వరకూ దూరంగానే, ప్రేక్షకురాలి పాత్రనే పోషించింది. అయితే... ఇప్పుడు సోదరులిద్దరి మధ్య అగాథం నిదానంగా పుడుతూ ఉండటంతో లక్ష్మీ ఆనందంగా ఉన్నట్టు సమాచారం. ఇక పనిలో పనిగా మనోజ్ కు దక్కినట్టే ఆమెకూ ఓ విజయం లభిస్తే... ఇక ఆల్ హ్యాపీస్.
మంచు లక్ష్మీ మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న 'దక్ష' చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి 'ది డెడ్లీ కాన్స్పిరసీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. మోహన్ బాబు సైతం ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. విశేషం ఏమంటే... తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సో... మరి లక్ష్మీ మంచు 'దక్ష' మూవీ కూడా హిట్ అయిపోతే... అన్నీ 'మంచు' శకునములే అని కాస్తంత మార్చుకుని పాట పాడేసుకోవచ్చు.
Also Read: Kishkindhapuri: రెండో రోజుకు ఊపందుకున్న కిష్కింధపురి..
Also Read: RGV: మంచు మనోజ్ నటన చూసి చెంపదెబ్బ కొట్టుకున్నాను