Kannappa Review: కన్నప్ప మూవీ రివ్యూ

ABN , Publish Date - Jun 27 , 2025 | 10:40 AM

ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు జనం ముందుకొచ్చింది. సినిమా ప్రకటన దగ్గర నుండి విడుదల వరకూ కన్నప్ప రకరకాల ట్రోలింగ్స్ కు గురైంది. అయితే చిత్రంగా రిలీజ్ టైమ్ కు ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి దానికి తగ్గట్టుగా కన్నప్ప ఉందా? ఈ భక్తిరస ప్రధాన చిత్రానికి మంచు విష్ణు న్యాయం చేశాడా? అనేది తెలుసుకుందాం.

కన్నప్ప (Kannappa) అనగానే సినీ ప్రియులకు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన 1955 నాటి 'కాళహస్తి మహత్యం' (Kalahasti Mahatyam) చిత్రం జ్ఞప్తికి వస్తుంది. మరి కొందరికి 1976లో బాపు తెరకెక్కించిన 'భక్త కన్నప్ప' (Bhaktha Kannappa) గుర్తొస్తుంది. సహజంగానే ఈ రెండు సినిమాలతో తాజా 'కన్నప్ప'ను పోల్చేవారూ ఉంటారు. అయితే... ఇవాళ్టి టెక్నాలజీని ఉపయోగించుకుని, భారీ స్థాయిలో మోహన్ బాబు (Mohanbabu) ఈ సినిమాను నిర్మించారు. హిందీలో 'మహా భారత్' తో పాటు పలు డివోషనల్ సీరియల్స్ ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దీన్ని డైరెక్ట్ చేశారు.

కన్నప్ప కథ అందరికీ సుపరిచితమే. కోయ వాడైన తిన్నడు (మంచు విష్ణు Manchu Vishnu) చిన్నప్పటి చేదు సంఘటనల కారణంగా నాస్తికుడిగా మారతాడు. తమ గూడెం బాగు కోసం నరబలి ఇవ్వాలని చెప్పే మారమ్మ (ఐశ్వర్య భాస్కరన్) అంటే అతనికి పడదు. అయినా తండ్రి నాథనాధుడు (శరత్ కుమార్ Sarath Kumar) మాట కాదనలేక కోపాన్ని నిగ్రహించుకుంటాడు. వీరితో పాటు ఆ ఆటవీ ప్రాంతంలో మరో మూడు కొండ జాతులు నివసిస్తుంటాయి. అందులో భద్రగణం ఉండే గూడెంలో దివ్య శక్తులు కలిగిన వాయులింగం ఉంటుంది. దాన్ని ఇతరుల కంట పడుకుండా మహదేవ శాస్త్రి (మోహన్ బాబు) పూజిస్తుంటాడు. పరమ శక్తివంతమైన ఆ వాయులింగాన్ని కొల్లగొట్టాలని అతి కిరాకుడైన కాలముఖుడు (అర్పిత్ రాంకా) ప్రయత్నిస్తాడు. అతన్ని ఎదుర్కొనడానికి నాలుగు గూడేల ప్రజలు ఒక్కటవ్వాలని నాథనాధుడు చెబుతాడు. మరి నాధనాధుడి కోరికను మన్నించి, వీరంత ఒక్కటి అయ్యారా? కాలముఖుడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారా? నాస్తికుడైన తిన్నడు... ఆస్తికుడిగా ఎలా మారాడు? వాయులింగాన్ని దర్శించుకోవాలని కలలు కన్న తిన్నడి భార్య నెమలి (ప్రీతి ముకుందన్) కోరిక తీరిందా? తిన్నడిని భక్తి మార్గం పట్టించడానికి పరమ శివుడు (అక్షయ్ కుమార్ Akshay Kumar)... రుద్ర (ప్రభాస్ Prabhas)ను ఎలా పావుగా ఉపయోగించాడు? అనేది మిగతా కథ.


ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గ్రంధంతో పాటు మరి కొన్ని పురాణాల్లోని అంశాలు తీసుకుని తిన్నడి కథను రూపొందించారు. అలా చూసినప్పుడు ద్వాపర యుగంలోని అర్జునుడే ఆ తర్వాత తిన్నడిగా జన్మించాడని అంటారు. అందుకు కిరాతార్జునీయంను ఆధారంగా చూపుతారు. పరమ శివుడు కిరాతుడిగా వచ్చి అర్జునుడి శక్తిని పరీక్షించి పాశు పతాస్త్రం ఇచ్చాడని చెబుతారు. అదే సమయంలో తనకు మోక్షం ప్రసాదించమని అర్జునుడు కోరగా తిన్నడిగా పుట్టినప్పుడు మోక్షం ప్రసాదిస్తానని శివుడు చెప్పినట్టుగా ఉంది. ఇందులో ఆ ఎపిపోడ్ నూ చూపించారు.

ఎలా ఉందంటే...

మూడు గంటల నిడివి ఉన్న 'కన్నప్ప' చిత్రంలో మొదటి రెండు గంటలు వీర కన్నప్ప గాధను చెప్పిన దర్శకుడు ముకేశ్‌ కుమార్ సింగ్... చివరి గంటను భక్త కన్నప్పగా మలిచారు. దాంతో ఒకే టిక్కెట్ మీద రెండు చిత్రాలు చూసిన భావన కలుగుతుంది. మొదటి రెండు గంటలు కన్నప్ప ప్రేమాయాణం, అతని వీరత్వంకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలముఖుడి మరణం తర్వాత ప్రభాస్... రుద్రగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కు మోహన్ బాబుకు, ప్రభాస్ కు తిన్నడికి, ప్రభాస్ కు నెమలికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. అలానే తనువు చాలించే ముందు నాథనాధుడికి, అతని కొడుకు తిన్నడికి మధ్య సాగే సంభాషణలు ఆర్ద్రతతో కూడుకుని ఆకట్టుకుంటాయి.

సినిమా శివపార్వతుల (అక్షయ్ కుమార్, కాజల్) సంభాషణతో మొదలవుతుంది. అక్కడ నుండి విష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా పాడే పాటతో దారిలో పడుతుంది. బాల తిన్నడిగా విష్ణు కుమారుడు అవ్రామ్ నటించాడు. అతను తెర మీద చూడటానికి బాగానే ఉన్నా... కోయ బాలుడిగా అతని సంభాషణలు సెట్ కాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది. ఇక ప్రారంభంలో శివపార్వతులకు సంబంధించిన సంభాషణలు విన్నప్పుడు ఆదివారం టీవీలో వచ్చే హిందీ డివోషనల్ డబ్బింగ్ సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది. అయితే అది కాసేపు మాత్రమే! తర్వాత సినిమా గాడిలో పడిపోతోంది.


నటీనటుల గురించి...

నటీనటుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు గురించి. మహదేవశాస్త్రిగా ఆయన బాగా నటించారు. తిన్నడిగా మంచు విష్ణు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేశాడు. సినిమా క్లయిమాక్స్ కు చేరేసరికీ శివ భక్తుడిగా మారిన వైనం అందరినీ ఆకట్టుకుంటుంది. నటుడిగా విష్ణులో పరిణతి కనిపిస్తుంది. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ గ్లామరస్ గా కనిపించింది. కుర్రకారును ఉత్తేజ పరిచే విధంగా ఆమెపై చిత్రీకరించిన రెండు పాటలు ఉన్నాయి. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు గూస్ బంప్స్ రావడం ఖాయం. అతని ఆహార్యానికి తగినట్టుగానే మంచి సంభాషణలు పడ్డాయి. పనిలో పనిగా ఆ పాత్ర పెళ్ళి గురించి చేసిన ప్రస్తావన... థియేటర్ లో విజిల్స్ వేయిస్తుంది. సినిమా ప్రారంభం అక్షయ్, కాజల్ తో సినిమా మొదలై, మోహన్ లాల్ ఎంట్రీతో ఇంటర్వెట్ బ్యాంగ్ పడుతుంది. ఇక మూవీ ప్రీ క్లయిమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రత్యేక పాత్రధారులను చక్కగా దర్శకుడు వాడుకున్నారు. విష్ణు తండ్రిగా శరత్ కుమార్ చక్కని నటన ప్రదర్శించారు. ఇతర కీలక పాత్రలను మధుబాల, ముఖేష్‌ రిషి, కౌశిక్, శివబాలాజీ, రఘుబాబు, ఐశ్వర్య, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మాజీ, సురేఖవాణి, దేవరాజ్, అర్పిత్ రాంకా తదితరులు పోషించారు. స్టిఫెన్ దేవస్సి సమకూర్చిన సంగీతం, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, ఆకెళ్ళ శివప్రసాద్ సంభాషణలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి పాటలను రాశారు. సినిమా నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

బయట ప్రచారం జరిగినట్టుగా ఎవరినీ కించపరిచే సన్నివేశాలు కానీ, ఎవరినీ తక్కువ చేసి చూపే సీన్స్ కానీ ఇందులో లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కు మోహన్ బాబు పెద్ద పీట వేశారు. భారీగానే ఖర్చు పెట్టారు. కానీ గ్రాఫిక్స్ మాత్రం కొన్ని చోట్ల ఆ స్థాయిలో లేవు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కు వచ్చి 'కన్నప్ప'ను చూస్తే... ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అయితే కమర్షియల్ గా వారికి ఈ పాజిటివిటీ ఏమేరకు ఉపకరిస్తుందనేది వేచి చూడాలి.

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్: సర్ ప్రైజింగ్ కన్నప్ప!

Updated Date - Jun 27 , 2025 | 11:03 AM