Mahesh - Rajamouli Movie: వార్నర్ బ్రదర్స్ కు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:30 PM
ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వార్నర్ బ్రదర్స్ ను మేకర్స్ లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
మహేశ్ బాబు (Mahesh babu) నటించిన 'గుంటూరు కారం' (Guntur Karam) లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. 'గుంటూరు కారం' తర్వాత జనం ముందుకు రాబోతున్న మహేశ్ - రాజమౌళి కాంబో మూవీ అంచనాలు వింటే... ఒక్క క్షణం ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది! ఈ సినిమా ద్వారా వరల్డ్ వైడ్ పది వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలనే టార్గెట్ ను రాజమౌళి టీమ్ పెట్టుకుందట. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ అధినేత కె. ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. రాజమౌళి గత చిత్రం 'ట్రిపుల్ ఆర్' (RRR) టోటల్ కలెక్షన్స్ దాదాపు 1200 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. అంటే ఇప్పుడు మహేశ్ బాబు సినిమాకు ఆ కలెక్షన్స్ స్థాయి బడ్జెట్ పెడుతున్నారు. 'బాహుబలి -2' (Bahubali -2) కలెక్షన్స్ ను ఆ తర్వాత వచ్చిన 'ట్రిపుల్ ఆర్' అధిగమించకపోయినా... ఈ సినిమాలోని పాట ఆస్కార్ ను అందుకోవడంతో రాజమౌళి సినిమా అంటే 'ట్రిపుల్ ఆర్' అనే పరిస్థితి వరల్డ్ వైడ్ వచ్చింది.
వరల్డ్ మార్కెట్ ను కాంకర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో 'బాహుబలి' (Bahubali) సినిమాతో వరల్డ్ వైడ్ గా మన సత్తా చాటాలని రాజమౌళి (Rajamouli) ప్రయత్నించారు. ఆ సినిమా నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సహకారంలో 'బాహుబలి' సినిమా రిలీజ్ టైమ్ లో ప్రపంచ మార్కెట్ ను మేకర్స్ అంచనా వేశారు. ఆ అనుభవంతో 'బాహుబలి' సీక్వెల్ కు వాటిని అమలు చేసి, కలెక్షన్స్ పరంగా కాంకర్ చేయగలిగారు. అందుకే ఆ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అయితే... ఈసారి రాజమౌళి అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. మహేశ్ బాబు మూవీని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సుమారు 120 దేశాలలో విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ వార్నర్ బ్రదర్స్ తో రాజమళి టీమ్ టై అప్ కాబోతోందట. భారతదేశం మినహా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ను వార్నర్ బ్రదర్స్ కు ఇవ్వాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఆ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరిందని అంటున్నారు. అదే జరిగితే... ఖచ్చితంగా 'బాహుబలి -2' రికార్డులనే కాదు... హాలీవుడ్ లోని సూపర్ హిట్ చిత్రాల రికార్డులను సైతం మహేశ్ - రాజమౌళి మూవీ క్రాస్ చేయడం ఖాయం.
మహేశ్ బాబు - రాజమౌళి సినిమా షూటింగ్ ఇటీవల కెన్యాలో జరిగింది. అక్కడ నుండి మహేశ్ బాబు వచ్చిన తర్వాత కూడా కొన్ని సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పుడీ టీమ్ హైదరాబాద్ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇక్కడ వేసిన కాశీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 10 వరకూ ప్రధాన తారాగణంపై ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తీస్తారట. మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం సైతం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. గతంలో ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరిగినప్పుడు లీకేజీలు జరిగాయి. ఇప్పుడు మాత్రం అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఫారెస్ట్ అడ్వంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి డివోషనల్ టచ్ కూడా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. మరి మేకర్స్ కోరుకుంటున్న విధంగా ఈ సినిమా పది వేల కోట్ల గ్రాస్ ను వసూలు చేస్తుందో లేదో చూడాలి.
Also Read: Tribute to ANR: ఒకేరోజు పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎన్టీఆర్, ఎఎన్ఆర్...
Also Read: Hridayapoorvam: హృదయపూర్వం ఓటీటీలో ఎక్కడంటే..