Tribute to ANR: ఒకేరోజు పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎన్టీఆర్, ఎఎన్ఆర్...
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:32 PM
పద్మశ్రీ పురస్కారాన్ని ఒకేసారి అందుకున్నారు ఎన్టీఆర్, ఎఎన్నార్. ఆ సందర్భంగా నందమూరి తారక రామారావు హావభావాలను అక్కినేని నాగేశ్వరరావు అనుకరించి చూపించారని దర్శకుడు, నటుడు దేవీప్రసాద్ తెలిపారు. అక్కినేని జయంతి సందర్భంగా తన అనుభవాలను వివరించారాయన.
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ శిష్యుడు దేవీప్రసాద్. గురువు బాటలో సాగుతూ దేవీప్రసాద్ పలు చిత్రాలను రూపొందించారు. అయితే కొంతకాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి, నటుడిగా బిజీ అయిపోయారు. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తెలుగు సినిమాలలో తనదైన ముద్రను వేస్తున్నారు. విశేషం ఏమంటే దేవీప్రసాద్ మంచి రచయిత కూడా. తన సినిమా అనుభవాలను ఆయన సందర్భానుసారంగా సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. సెప్టెంబర్ 20 అక్కినేని 101వ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని దేవీప్రసాద్ తెలియచేశారు. తెలుగు చిత్రసీమ అక్కినేనిని ఎందుకు గురుస్థానంలో నిలబెట్టి గౌరవిస్తుందనేది దేవీప్రసాద్ అనుభవాన్ని తెలుసుకుంటే అర్థమౌతుంది. మంచి చిత్రకారుడు కూడా అయిన దేవీప్రసాద్ చిత్రీకరించిన అక్కినేని చిత్రాలనూ ఈ వ్యాసంతో పాటు చూడొచ్చు.
దేవీప్రసాద్ అనుభూతుల్ని ఆయన మాటల్లోనే చదివేయండి.
'నేను దర్శకత్వం వహించిన 'లీలామహల్‌సెంటర్' 'కెవ్వుకేక' చిత్రాలకు తొలిక్లాప్ కొట్టి ఆశీర్వదించారు నటసమ్రాట్ అక్కినేని. ముఖ్యంగా 'కెవ్వుకేక' ప్రారంభోత్సవానికి ఆహ్వానించటానికి నన్ను, నిర్మాత చందు గారిని మిత్రుడు కాదంబరి కిరణ్.. అక్కినేని గారింటికి తీసుకెళ్ళినప్పుడు ఆయనతో గడిపిన సమయం నాకెంతో విలువైనది.
ఆయన చెప్పిన మాటలు ఓ జీవితకాలానికి సరిపడే పాఠాలు. తన చిన్ననాటినుండీ తన ఉన్నతికి సహకరించిన ఎందరినో పేరుపేరునా 90 ఏళ్ళ వయసులో గుర్తు చేసుకున్న ఆయన మహోన్నత సంస్కారం నుండి నాబోటివాడు నేర్చుకోవలసింది ఎంతోవుందని గ్రహించాను ఆరోజు. ఓ మహావృక్షం తానెలా మొక్కగా మొలిచి ఆకాశాన్ని తాకే ఎత్తుకు ఎలా ఎదగగలిగిందో, అందుకు భూమి, నీరు, ఆకాశం ఎండా, వాన అన్నీ ఎలా తోడ్పడ్డాయో తానే స్వయంగా చెబుతుంటే దాని నీడన కూర్చుని వినగలిగే భాగ్యం ఎందరికి దొరుకుతుంది. బహుశా మరెవ్వరికీ దక్కని మరో వరం కూడా మాకు దక్కిందారోజు. ఓ మహానటుడు మరొక మహానటుడిని హావభావాలు, వాచకంతో సహా అనుకరించి చూపితే.....!
మహానటులు ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్. ఇద్దరికీ ఒకేరోజు పద్మశ్రీ పురస్కారం అందజేయబడిందట. ఆ సభలో ఎన్టీఆర్ గారి హావభావాలు, మాటలు, చేతలు ఎలావున్నాయో స్వయంగా ఎఎన్ఆర్ గారు అనుకరించి చూపుతుంటే మా ఆనందానికి అవధులుంటాయా! వృత్తిలో తన పోటీదారుడైన ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రల గొప్పతనం గురించి, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శితమైన ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించీ స్వయంగా ఎ.ఎన్.ఆర్. గారు ఏ దాపరికాలు లేకుండా చెబుతుంటే, ఓ మహాశిఖరం అద్దంలా మారి తనలో మరో మహాశిఖరాన్ని మాకు చూపుతున్నట్టనిపించదూ!
'కెవ్వుకేక' ప్రారంభోత్సవానికొచ్చిన ఆయన కధాంశం గురించి తెలుసుకొన్నాక చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. 'శారీరక మానసిక ఆరోగ్యాలకు శృంగారం,హాస్యం తప్పనిసరి. సినిమాలో అయినా, జీవితంలోనైనా ఆ రెంటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే అవెప్పుడూ బోరుకొట్టవు' అని అన్నారు.
మళ్ళీ అదే సినిమా ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానించటానికి వెళ్ళినప్పుడు మాత్రం 'నేను రాలేను. ఎందుకంటే ఈమధ్య ఎందుకో కాసేపు నిల్చొంటే కూర్చోవాలనిపిస్తుంది. కూర్చొంటే పడుకోవాలనిపిస్తుంది. ఇప్పటివరకూ తిరిగింది చాల్లే అని వయస్సు నాకు చెబుతోంది. ఒకవేళ కష్టపడి నేను వొచ్చినా చూసే జనానికి అర్ధమైపోతుంది. నాగేశ్వర్రావు పనైపోయిందిరోయ్ అంటారు. అయినా 90 ఏళ్ళు వొస్తుంటే ఇంకా చలాకీగానే ఉంటామా? కానీ నటీనటులు మాత్రం పబ్లిక్‌లో ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా హుషారుగా కనిపించాలి తప్ప నీరసంగా కనిపించకూడదు. అలా కనిపించేటప్పుడు బైటికి వెళ్ళకపోవటమే మంచిది' అని అన్నారు.
ఆ మహనీయుని 101వ జయంతి (సెప్టెంబర్20) సందర్భంగా నా నివాళులు.
అంతటి నటసామ్రాట్టుని కన్న మహాతల్లి 'పున్నమ్మ' గారికి శతకోటి నమస్సులు.
- దేవీప్రసాద్