Ustad: నిర్మాతగా రామ్ పోతినేని...
ABN, Publish Date - Jun 21 , 2025 | 02:42 PM
హీరో రామ్ పోతినేని సైతం నిర్మాతగా మారిపోతున్నాడు. పెద్దనాన్న రవికిశోర్ కు స్రవంతి మూవీస్ అనే బ్యానర్ ఉన్నా.... తనకంటూ ఓ కొత్త బ్యానర్ పెట్టుకోవాలని రామ్ భావిస్తున్నాడట.
హీరోలు నిర్మాతలు అయినంత తేలికగా నిర్మాతలు హీరోలు కాలేరు. కానీ అప్పుడప్పుడు టెక్నీషియన్స్ కూడా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు. నిజానికి దర్శకులు చాలామంది తమకు నచ్చిన కథను నిర్మాతగా మారితేనే చేయగలమనే నమ్మకంతో ప్రొడ్యూసర్స్ అవుతుంటారు. హీరోలు కూడా తమకు నచ్చిన దర్శకుడిని, నచ్చిన కథను తెర మీద చూసుకోవడానికి నిర్మాతలుగా మారుతుంటారు. అయితే కొందరు కేవలం తామే హీరోలుగా నటించడం కాకుండా కథానుగుణంగా యంగ్ టాలెంట్ నూ ప్రోత్సహిస్తూ ఉంటారు. నాని అలా 'అ', 'హిట్' చిత్రాలను నిర్మించాడు. 'హిట్ -3'లో తానే హీరోగా చేశాడు. విజయ్ దేవరకొండ కూడా తనతో 'పెళ్ళిచూపులు' సినిమా తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెబుతా' మూవీని తీశాడు.
తాజాగా యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) సైతం నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ కు గడ్డు కాలం నడుస్తోంది. అతని చిత్రాలన్నీ బాక్సాఫీస్ బరిలో వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. 'స్కంద, డబుల్ ఇస్మార్ట్' పరాజయాల నుండి కాస్తంత కోలుకున్న రామ్ ఇప్పుడు 'ఆంధ్రా కింగ్ తాలుకా' సినిమాలో నటిస్తున్నాడు. ఆంధ్రా కింగ్ గా ఉపేంద్ర (Upendra) నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేశ్ బాబు దీనికి దర్శకుడు. ఈ సినిమా కోసం రామ్ గీత రచయితగానూ మారాడు. అలానే త్వరలో నిర్మాత అవుతున్నాడని సమాచారం.
విశేషం ఏమంటే... ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో రామ్ పెద్దనాన్న రవికిశోర్ 'స్రవంతి మూవీస్' పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్ తోనే కాకుండా ఆయన బయటి హీరోలతోనూ సినిమాలు తీస్తున్నారు. అయితే... పెదనాన్న నీడలో కాకుండా తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు నిర్మించాలని రామ్ భావించాడట. అందుకే ఓన్ బ్యానర్ పెట్టబోతున్నాడని తెలిసింది. తొలి చిత్రం ద్వారా ఓ కొత్త దర్శకుడిని రామ్ పరిచయం బోతున్నాడట. అయితే ఈ సినిమాలో రామ్ నటిస్తాడా? వేరే వాళ్ళతో కేవలం మూవీ మాత్రం నిర్మిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ విడుదలైన తర్వాత ఓన్ బ్యానర్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
Also Read: Mega 157: వెంకీ రాకకు వేళాయె...
Also Read: Tollywood: తెలుగు నిర్మాతలకు పరభాషల్లో చేదు అనుభవం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి