Telugu Cinema: సినీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం...

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:18 AM

తెలుగు సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దిల్ రాజు, కె.ఎల్. దామోదర ప్రసాద్, సుప్రియ, వల్లభనేని అనిల్ కుమార్, అమ్మిరాజు ఇందులో సభ్యులుగా ఉంటారు.

Telugu film Industry

తెలుగు సినిమా కార్మికుల వేతనాల పెంపు కోరుతూ చేసిన సమ్మె విరమణ జరిగినా... సమస్య మాత్రం నివురుగప్పిన నిప్పు మాదిరిగానే ఉంది. సినిమా షూటింగ్స్ కు అంతరాయం కలగకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్న చొరవతో కార్మికులు సమ్మెను విరమించారు కానీ వారికి తగిన న్యాయం పూర్తి స్థాయిలో దక్కలేదు. సమ్మె విరమణ తర్వాత రేవంత్ రెడ్డి సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో మాట్లాడారు. అలానే ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులనూ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వీటి పరిష్కారం కోసం తాజాగా లేబర్ కమీషనర్ (Labour Commissioner) నేతృత్వంలో ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని వేసింది.


సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమీషనర్ సెప్టెంబర్ 21న సినిమా రంగానికి చెందిన నిర్మాతలు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలను అనుసరించి, సెప్టెంబర్ 25న లేబర్ కమీషనర్ ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన లేఖను ఈ నెల 26న విడుదల చేశారు. ఈ కమిటీకి తెలంగాణ లేబర్ కమీషనర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో లేబర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ కమీషనర్ సభ్యుడిగా, కన్వినర్ ఉంటారు. అలానే సభ్యులుగా తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుండి సెక్రటరి కె.ఎల్. దామోదర ప్రసాద్ (KL Damodara Prasad) , నిర్మాతల తరఫున సుప్రియా యార్లగడ్డ (Supriya Yarlagadda) , ఫిల్మ్ ఫెడరేషన్ నుండి అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ (Vallabhaneni Anil Kumar), కార్యదర్శి కానుమిల్లి అమ్మిరాజు (Kanumilli Ammiraju) ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ఈ కమిటీ సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించబోతోంది.

Also Read: NTR Pragathi Shetty: ఎన్టీఆర్ మా అన్నయ్య.. స్పీచ్ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య

Also Read: Upasana Konidela: ఢిల్లీ సీఎంతో క‌లిసి.. బ‌తుక‌మ్మ ఆడిన ఉపాస‌న

Updated Date - Sep 29 , 2025 | 10:18 AM