Upasana Konidela: ఢిల్లీ సీఎంతో క‌లిసి.. బ‌తుక‌మ్మ ఆడిన ఉపాస‌న

ABN , Publish Date - Sep 29 , 2025 | 09:12 AM

తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుక‌ల‌ను రాజధాని ఢిల్లీలోనూ ఘనంగా నిర్వహించారు.

Upasana Konidela

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుక‌ల‌ను (Bathukamma celebrations) ఈసారి ది తెలుగు స్టూడెంట్స్ అసోసియేష‌న్ (The Telugu Students' Association (TSA) ఆధ్వర్యంలో రాజధాని ఢిల్లీలోనూ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) కొణిదెల హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

అంతేగాక ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌వ‌డ‌మే గాక అక్క‌డ ఉన్న వారితో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడారు. అంతేగాక ప్ర‌ముఖ‌ రామ్‌జాస్ కళాశాల (Ramjas College) గ్రౌండ్‌లో జ‌రిగిన ఈ ఉత్స‌వంలో విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి, తెలంగాణ పాటలు పాడి సందడి చేశారు.

తెలుగు సంస్కృతిని ఢిల్లీలోనూ కొనసాగించడం చాలా గర్వకారణమని ఉపాసన ఈ సందర్భంగా తెలిపారు. మహిళలతో కలిసి పాడుతూ, బతుకమ్మ చుట్టూ ఆడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అపోలో హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. కుటుంబ, సామాజిక కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించే ఉపాసన ఈసారి బతుకమ్మ వేడుకల్లో భాగమవడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక సందేశం పంచుకున్నారు. “Thank you, @gupta_rekha Ji and the students of Ramjas College, Delhi, for embracing & celebrating Telangana culture with such love & respect. This festive season, let’s honor the Devi within each of us & celebrate our strength together. బతుకమ్మ శుభాకాంక్షలు, नवरात्रि की शुभकामनाएँ.” (“ధన్యవాదాలు @gupta_rekha జీ మరియు ఢిల్లీ రామ్‌జాస్ కళాశాల విద్యార్థులకు. ఇంత ప్రేమతో, గౌరవంతో తెలంగాణ సంస్కృతిని ఓన్‌ చేసుకుని బతుకమ్మను జరుపుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ పండుగ సీజన్‌లో మనలోని దేవిని గుర్తించి, మన బలాన్ని స్మరించుకుందాం. బతుకమ్మ శుభాకాంక్షలు.. నవరాత్రి శుభాకాంక్షలు”) అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బ‌తుక‌మ్మ‌ను దేశ రాజధానిలో అంత వైభ‌వంగా నిర్వ‌హించ‌డం ఈ సంబురాలకు ప్రత్యేక ఆకర్షణగా మానిలిచింద‌ని, ఢిల్లీలోని తెలుగు ప్రజలకు స్వంత రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఫీల్ వ‌చ్చేలా చేశ‌ర‌ని అక్కడ పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఉపాసనను ప్ర‌శంస‌లతో ముంచెత్తుతున్నారు.

Updated Date - Sep 29 , 2025 | 09:15 AM