Tollywood Movies: కన్నీళ్ళు, చెప్పుదెబ్బలు గిమ్మిక్కులేనా...
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:48 PM
'పరదా' విడుదలకు ముందు అనుపమా పరమేశ్వరన్ కన్నీళ్ళు పెట్టుకుంది. 'త్రిబాణధారి బార్బరిక్' మూవీ విడుదల తర్వాత దర్శకుడు మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తాను కొట్టుకున్నాడు. ఈ విపరీత ప్రవర్తనలతో సినిమాలు ఆడతాయనుకోవడం భ్రమే అంటున్నారు విశ్లేషకులు.
ఇవాళ సినిమా థియేటర్లకు జనాలను తీసుకురావడం చాలా కష్టంగా ఉంది. కరోనా (Corona) తర్వాత ఓటీటీ (OTT) ప్లాట్ ఫార్మ్స్ కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. ఎంత పెద్ద సినిమా అయినా ఐదారు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుందనే నమ్మకం ప్రేక్షకులకు వచ్చేసింది. దాంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్లకు ఎందుకు వెళ్ళాలనే భావన వారికి కలుగుతోంది. దాంతో కొందరు దర్శక నిర్మాతలు... ఎంతో కష్టపడి తీసిన తమ సినిమాలు జనాలు చూడాలంటే... ఏదో విధంగా వాళ్ళను తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి కాస్తా శ్రుతి మించి రాగాన పడుతున్నాయి.
ఈ మధ్య అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన 'పరదా' (Parada) సినిమా విడుదలైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సెన్సార్ కార్యక్రమాలను సైతం చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకుంది. కానీ విడుదల మాత్రం పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. దానికి కారణం... ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కావడం, లేడీ ఓరియంటెడ్ సినిమా కావడం! ఈ మధ్య కాలంలో తెలుగులో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కు బాగానే ఆదరణ లభించింది. అందులో హీరోలు, హీరోయిన్లు ఎవరనేది చూడకుండానే జనాలు థియేటర్లకు వెళ్ళారు. నాని (Nani) నిర్మించిన 'కోర్టు' (Court), సమంత (Samantha) నిర్మించిన 'శుభం' (Subham) సినిమాలను జనాలు ఆదరించారు. కానీ కొన్ని సినిమాల టైటిల్స్, మేకర్స్ ఎంచుకున్న స్టోరీ సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకోని సందర్భంలో ఎలాంటి గిమ్మికులు, ప్రచారాలు చేసినా థియేటర్లకు జనాలు వెళ్ళలేదు.
చిత్రం ఏమంటే... ఎంతో కష్టపడి తాము తీసిన సినిమాకు తగిన స్థాయిలో పబ్లిసిటీ జరగడం లేదని, అలానే సినిమా రంగానికి చెందిన వారి నుండి ప్రోత్సాహం లభించడం లేదని అందులో నటించిన నటీనటులు, సినిమాను తీసిన దర్శక నిర్మాతలు వాపోవడం సహజమే. 'పరదా' సినిమా విడుదలకు ముందు ఒకటికి రెండు సార్లు అనుపమా పరమేశ్వరన్ ఇటు సినిమా వాళ్ళను, అటు ప్రేక్షకులను తప్పు పడుతూ ప్రెస్ మీట్స్ లో మాట్లాడింది. విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో అయితే ఏకంగా కన్నీటి పర్యంతమైంది. అయినా... ఆమె కన్నీళ్ళకు విలువ లేకుండా పోయింది. 'పరదా' సినిమాలోని కథాంశం ఎక్కువమందిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా పరాజయం పాలైంది. నటీనటుల కష్టం, దర్శక నిర్మాతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
తాజాగా 'త్రిబాణధారి బార్బరిక్' (Tribanadhari Barbarik) మూవీ పరిస్థితీ అలాంటిదే. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు. సత్యరాజ్ టైటిల్ రోల్ ప్లే చేశారు. నిర్మాత భారీగా ఈ సినిమాను నిర్మించాడు. కానీ ఈ మూవీకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. దానికి కారణం... సినిమా టైటిలే అర్థం కాకుండా ఉండటం. ఈ టైటిల్ ద్వారా దర్శకుడు ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు కానీ రెగ్యులర్ మూవీ గోయర్ కు ఈ టైటిల్ ఎక్కలేదు. దాంతో సినిమాకు దూరంగా ఉన్నాడు. యూట్యూబ్ లో వచ్చిన పాటలకు బాగానే స్పందన లభించింది కానీ థియేటర్ కు వెళ్ళి టిక్కెట్ కొని దీన్ని చూడాలని ప్రేక్షకులు అనుకోలేదు. దాంతో విడుదలైన రెండో రోజు థియేటర్లలో కేవలం పది పన్నెండు మంది ప్రేక్షకులు ఉండటం చూసి దర్శకుడు మోహన్ శ్రీవత్స తన చెప్పుతో తాను కొట్టుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈసారి మలయాళ సినిమా రంగంలోకి వెళ్ళి అక్కడ సినిమా తీసి, తెలుగుకు వస్తానని, ఎందుకంటే తెలుగువాళ్ళు మలయాళ సినిమాలను ఇష్టపడినట్టుగా తెలుగు సినిమాలను ఆదరించడం లేదని ఆ వీడియోలో వాపోయాడు. అతని చర్యపై మిశ్రమ స్పందన లభించింది.
కొందరు దర్శకుడి తపనను, బాధను అర్థం చేసుకుని మోహన్ శ్రీవత్స ను ఓదార్చే ప్రయత్నం చేస్తే, మరికొందరు దీన్ని పిల్ల చేష్టలుగా పరిగణించారు. ఏడాదికి రెండు వందల స్ట్రయిట్ తెలుగు సినిమాలు విడుదలైతే... అందులో కేవలం పది శాతం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతమాత్రాన ప్రేక్షకులను తప్పుపట్టడం సరికాదని విమర్శలు చేశారు. మంచి కంటెంట్ తో, ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయాలి తప్పితే... ఇలా వారిని తప్పుపట్టడం కరెక్ట్ కాదని, తనను తాను చెప్పుతో కొట్టుకోవడం కూడా సమర్థనీయం కాదని తెలిపారు.
ఈ మధ్య కాలంలో స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ హీరోస్ కూడా శపథాలు చేస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) వంటి వారు.... కాస్త తీవ్ర స్థాయిలో శపథాలు చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో జరిగాయి. అయితే... అలాంటి సందర్భంలోనూ ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సో... కన్నీళ్ళు పెట్టుకుంటేనో, చెప్పుతో కొట్టుకుంటేనో, శపథాలు చేస్తేనో జనాలు థియేటర్లకు వస్తారనుకోవడం, సినిమాలు ఆడతాయని అనుకోవడం ఓ భ్రమ. పైగా ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని ప్రజలు భావించే ఆస్కారం కూడా ఉంది. గతంలో ఇలానే ఏదో రకంగా సినిమాకు సంబంధించిన కాంట్రవర్సీని క్రియేట్ చేసి.... తద్వారా పబ్లిసిటీని పొంది సక్సెస్ సాధించాలనుకున్న నిర్మాతల ప్రయత్నాలూ విఫలం అయ్యాయి.
Also Read: Havish: నేను రెడీ.. తాజా షెడ్యూల్ ఎక్కడంటే..
Also Read: Venky -Vinayak: వెంకటేశ్.. వి.వి.వినాయక్.. వినోదానికి యాక్షన్ మేళవించి..