Champion: రోషన్ కోసం.. చంద్రకళగా తెలుగులోకి వస్తున్న అనస్వర
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:48 AM
'రేఖాచిత్రమ్' మలయాళ చిత్రంతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్' మూవీలో ఆమే హీరోయిన్!
యంగ్ హీరో రోషన్ (Roshan) ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ 'ఛాంపియన్' (Champion) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'ఛాంపియన్' ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ ఇప్పటికే విడుదల కాగా, వాటికి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఇప్పుడు సినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు.
స్వప్న సినిమాస్ కొత్త ట్యాలెంట్ ని వెలుగులోకి తీసుకురావడంలో ముందువరుసలో వుంటుంది. బ్లాక్‌బస్టర్ 'సీతా రామం' (Sitharamam) తో తెలుగులోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆమె పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తూ, 'ఛాంపియన్'లో ట్యాలెంటెడ్ మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) ను పరిచయం చేస్తోందీ సంస్థ. సెప్టెంబర్ 8వ తేదీ అనస్వర పుట్టినరోజు సందర్భంగా, చంద్రకళగా అనస్వర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ రెట్రో-స్టైల్ దుస్తులలో గాజులు, సిందూరంతో అందంగా కనిపించింది అనస్వర. కథలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రను ఆమె పోషించబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్. మాధీ కాగా సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత. తోట తరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు..
ఇదిలా ఉంటే... మలయాళీ మద్దుగుమ్మ అనస్వర రాజన్ తన యాక్టింగ్ కెరీర్ ను 2017లో 'ఉదాహరణం సుజాత' సినిమాతో ప్రారంభించింది. మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనస్వర ఓ రెబల్ డాటర్ పాత్రను పోషించింది. ఆ తర్వాత రెండేళ్ళకే 'తన్నీర్ మాతన్ దినన్గళ్' లో లీడ్ క్యారెక్టర్ చేసింది. విశేషం ఏమంటే అదే ఏడాది వచ్చిన 'అర్థరాత్రి' సినిమాలో తల్లీకూతుళ్ళుగా డ్యుయల్ రోల్ ప్లే చేసింది అనస్వర. ఇక 2022లో అనస్వర నటించిన 'సూపర్ శరణ్య' మలయాళ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అదే యేడాది త్రిష తమిళ చిత్రం' రాన్గీ'తో అనస్వర కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే అనస్వర నటించిన కొన్ని మలయాళ చిత్రాలు తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అందులోని 'రేఖాచిత్రమ్' అనస్వరకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తెలుగు వర్షన్ కు కూడా వ్యూవర్స్ నుండి ఆదరణ లభించింది. ఇప్పుడు ఆమె డైరెక్ట్ తెలుగు సినిమాలోనే నటిస్తుండటం విశేషం. అలానే... ఎ.ఎం.రత్నం తన కొడుకు రవికృష్ణ హీరోగా నిర్మిస్తున్న '7జీ బృందావన్ కాలనీ 2' సినిమాలోనూ అనస్వర హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: Manoj Vs Srinivas: కిష్కింధపురికి పోటీగా మిరాయ్...
Also Read: Allu Arjun: అల్లు అర్జున్.. ఫ్యామిలీకి బల్దియా షాక్!