Anaswara Rajan: మరో మలయాళ బ్యూటీ ఆగమనం
ABN , Publish Date - May 16 , 2025 | 04:16 PM
మలయాళీ ముద్దుగుమ్మలు వరుసగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అనస్వర రాజన్ సైతం చేరుతోంది.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A M Ratnam) తనయుడు రవికృష్ణ (Ravi Krishna) '7జి బృందావన్ కాలనీ' (7G Brundavan Colony) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలలో నటించాడు. అయితే తొలి చిత్రం స్థాయి విజయాన్ని మరే సినిమా కూడా పొందలేకపోయింది. దాంతో సినిమా రంగానికి దూరమయ్యాడు. పుష్కరకాలం తర్వాత ఇప్పుడు '7జీ బృందావన్ కలానీ' సీక్వెల్ తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ (Selva Raghavan) దర్శకత్వంలోనే సీక్వెల్ నూ ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) దీనికి స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయి ఎవరనే విషయంలో కొంతకాలంగా సస్పెన్స్ సాగింది. రకరకాల పేర్లు వినిపించాయి. 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా (Ivaana) ఇందులో హీరోయిన్ గా నటిస్తోందనే పుకార్లు వచ్చాయి. తాజాగా శ్రీవిష్ణు (Sreevishnu) '#సింగిల్'తో ఇవానా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అలానే ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ కుమార్తె అదితి (Adithi) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని వార్తలొచ్చాయి. చిత్రం ఏమంటే... ఇవానా మాదిరిగానే ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి చేరువైన అదితి శంకర్... ఈ నెల 30న రాబోతున్న 'భైరవం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే... ఇప్పుడు '7జీ బృందావన్ కాలనీ' సీక్వెల్ లో నటించే హీరోయిన్ విషయమై వివరాలు బయటకు వచ్చాయి.
బాలనటిగా 'ఉదాహరణం సుజాత'తో మల్లూవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ (Anaswara Rajan) ... ఇప్పుడు హీరోయిన్ గా మలయాళ, తమిళ చిత్రాలలో నటిస్తోంది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం 'థగ్' తెలుగులోనూ డబ్ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద డైరెక్ట్ చేసింది. విశేషం ఏమంటే మలయాళ, తమిళ భాషలతో పాటు అనస్వర రాజన్ హిందీలోనే సినిమా చేసింది. ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న '7జీ బృందావన్ కాలనీ'లోనే అనస్వర రాజనే హీరోయిన్ అట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా చెప్పకపోయినా... కోలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ యేడాది జనవరి లో వచ్చిన 'రేఖా చిత్రం'లోనూ అనస్వర రాజన్ చక్కటి నటన కనబర్చి అందరి ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ కావాలనుకుని చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి జీవితం ఎలా అర్థాంతరంగా ముగిసిపోయిందనే కథాంశంతో 'రేఖాచిత్రమ్' సినిమా రూపుదిద్దుకుంది. ఓటీటీలోనూ చక్కని ఆదరణ పొందిన ఈ సినిమా అనస్వర రాజన్ కు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళీ ముద్దుగుమ్మల హవా ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో బలంగా వీస్తున్న సమయంలో ఇటు వైపు వస్తున్న అనస్వర రాజన్ కు ఎలాంటి విజయం లభిస్తుందో చూద్దాం.
Also Read: Sobhan Babu: 50 ఏళ్ళ జీవనజ్యోతి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి