Allu Arjun: తొలి చిత్ర దర్శకుడిని ఫోటో పెట్టుకున్న బన్నీ...
ABN, Publish Date - May 23 , 2025 | 02:52 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఎంత ఎత్తుకు ఎదిగినా, తను నడిచి వచ్చిన దారులను మర్చిపోయే వ్యక్తి కాదు. దానికి ఆయన ఆఫీస్ గది ప్రారంభంలో ఉన్న దర్శకేంద్రుడి ఫోటోనే ఉదాహరణ!
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్యనటుడు, స్వర్గీయ అల్లు రామలింగయ్య (Allu Ramalingah) మనవడు, అరవింద్ (Aravind) తనయుడు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరంగేట్రమ్ చేసిన చిత్రం 'గంగోత్రి' (Gangotri). దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో అల్లు అర్జున్ తెర మీద కనిపించినా... హీరోగా నటించిన మొదటి చిత్రం ఇదే. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. కె. రాఘవేంద్రరావు కెరీర్ మొదలైన దగ్గర నుండి ఆయన పలు చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి మెప్పించారు అల్లు రామలింగయ్య. అలానే అల్లు అరవింద్ కూ రాఘవేంద్రరావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనతో కలిసి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు అరవింద్. ఆ అనుబంధంతోనే తన కొడుకును హీరోగా లాంచ్ చేసే బాధ్యతను కె. రాఘవేంద్రరావుకు అప్పగించారు. అప్పటికే కె. రాఘవేంద్రరావు అగ్ర నిర్మాత డి. రామానాయుడు తనయుడు వెంకటేశ్ నూ 'మనవూరి పాండవులు'తో హీరోగా తెలుగు తెరకు పరిచయం చేశారు. బహుశా ఆ సెంటిమెంట్ తో కావచ్చు... బన్నీని కె. రాఘవేంద్రరావు చేతుల్లో పెట్టారు అరవింద్.
మే 23 కె. రాఘవేంద్రరరావు పుట్టిన రోజు... ఈ శతాధిక చిత్రాల దర్శకుడికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆయన పరిచయం చేసి నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా కూడా పెద్దదే. వారంతా కె. రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ సైతం తన తొలి చిత్ర దర్శకుడికి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపాడు. అంతేకాకుండా తన ఆఫీస్ ఎంట్రన్స్ లోని హాలులో పెట్టుకున్న కె. రాఘవేంద్రరావు ఫోటోనూ కృతజ్ఞతాపూర్వకంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తొలి చిత్రం 'గంగోత్రి' నుండి 'పుష్ప-2' వరకూ అల్లు అర్జున్ కెరీర్ లోని పురోగతి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అంటూ నటరత్న ఎన్టీఆర్ (NTR) 'అడవి రాముడు' (Adavi Ramudu) సినిమా కోసం వేటూరితో కె. రాఘవేంద్రరావు రాయించుకున్న పాట బన్నీ విషయంలో నిజం అయ్యింది. 'ఇతను హీరోనా?' అని కెరీర్ ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్... 'హీరో అంటే ఇతను కదా!' అనిపించుకునే స్థాయికి చేరడమే కాదు... తెలుగులో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పురస్కారాన్నీ అందుకున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా... నడిచి వచ్చిన మార్గాన్ని మర్చిపోకూడదన్నట్టుగా తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఫోటోను ఆఫీస్ ఎంట్రన్స్ లో బన్నీ పెట్టుకోవడం అభినందించదగ్గదని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gamblers: సంగీత్ శోభన్ వర్సెస్ నార్నే నితిన్... ఏం జరుగబోతోంది...
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్.. బరిలోకి దిగుతున్నాడు
Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 లక్షలు... చిక్కుల్లో డ్రాగన్ బ్యూటీ... లిక్కర్ స్కాంలో పేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి