Happy Birthday Rajendra Prasad: తెలుగుతెరపై నవ్వుల పువ్వులు
ABN, Publish Date - Jul 19 , 2025 | 04:49 PM
నటకిరీటి రాజేంద్రప్రసాద్ పంచిన నవ్వులు తెలుగువారికి నిత్యం కితకితలు పెడుతూనే ఉంటాయి. నేడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజేంద్రుని నవ్వుల పువ్వులు కొన్నిటిని ఏరుకుందాం.
తెలుగుతెరపై కథానాయకులుగా రాణించిన హాస్యనటులు ఎందరున్నా, వారిలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) స్థానం ప్రత్యేకమైనది. అంతకుముందు ఆ తరువాత కూడా ఏ కామెడీ హీరో రాజేంద్రుని రేంజ్ లో అలరించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తన కామెడీ టైమింగ్ తోనూ, సెంటిమెంట్ యాక్టింగ్ తోనూ రాజేంద్రుడు అలరిస్తూ సాగుతున్నారు. ఈ నాటికీ బిజీగా తనదైన పంథాలో పయనిస్తున్నారు రాజేంద్రప్రసాద్.
ఆరంభంలో బిట్ రోల్స్ లోనూ అలరించిన రాజేంద్రప్రసాద్ తరువాతి రోజుల్లో కామెడీతో కట్టిపడేశారు. 'లేడీస్ టైలర్' (ladies Tailor) సక్సెస్ తో హీరోగానూ సక్సెస్ రూటులో సాగారు. రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలు గిలిగింతలు పెడుతూ బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేశాయి. ఒకానొకప్పుడు తెలుగు సినిమా రంగంలో 'స్లంప్' తలెత్తినప్పుడు దానికి చిక్కుండా వరుస చిత్రాలతో అలరించారు రాజేంద్రప్రసాద్. ఆయన హీరోగా రూపొందిన చిత్రాలలో 'మాయలోడు' (Maayalodu) స్వర్ణోత్సవం చూసింది. ఇక పలు చిత్రాలు రజతోత్సవాలు, శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఈ స్థాయిలో అలరించిన కామెడీ హీరో రాజేంద్రుడనే చెప్పాలి.
కేవలం నవ్వులు పూయించి కితకితలు పెట్టడమే కాదు, సెంటిమెంట్ ను కూడా రంగరించి రాజేంద్రుడు సాగిన వైనం అబ్బుర పరుస్తుంది. 'ఎర్రమందారం', 'ఆ నలుగురు' చిత్రాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఓ నాటి అందాల తార జయప్రదతో కలసి రాజేంద్రప్రసాద్ నటించిన 'లవ్ ఎట్ 65' ఇంకా విడుదలకు నోచుకోలేదు.. ఏది ఏమైనా ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయప్రవేశం చేసి అలరిస్తోన్న రాజేంద్రప్రసాద్ మునుముందు కూడా ఇదే తీరున మురిపిస్తారని ఆశిద్దాం.
Also Read: Mega 157: లీక్ వీడియోలపై స్పందించిన మేకర్స్..
Also Read: Athadu Movie OST:ఊపేస్తోన్న 'అతడు' ఒరిజినల్ ట్రాక్స్