Mega 157: లీక్‌ వీడియోలపై స్పందించిన మేకర్స్‌..

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:26 PM

'మెగా 157' చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అయితే, ఇందులోని ఓ సన్నివేశం షూటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చిరంజీవి (Chiranjeevi), అనిల్‌ రావిపూడి (Anil ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మెగా 157 (mega157) వర్కింగ్‌ టైటిల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అయితే, ఇందులోని ఓ సన్నివేశం షూటింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్‌ స్పందించారు.  అనధికారికంగా ఇలా సినిమాలో సన్నివేశాలను షూట్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీమ్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఓ నోట్‌ రిలీజ్‌ చేశారు నిర్మాతలు.


‘ఈ మెగా 157 సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు అనధికారికంగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవ్వడం మా దృష్టికి వచ్చింది. మా అనుమతి లేకుండా సెట్స్‌ నుంచి కంటెంట్‌ రికార్డు చేయొద్దని కోరుతున్నాం. అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల మా షూటింగ్‌కు అంతరాయం కలుగుతుంది. సినిమా కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న టీమ్‌ అందరినీ బాధ పెట్టినట్లే అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎవరూ షేర్‌ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయాలని అభిమానులను కోరుతున్నాం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.  

Mega-157.jpg

చిరు స్టైల్‌ మాస్‌, అనిల్‌ రావిపూడి స్టైల్‌ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి ఇందులో తన అసలు పేరుతో (శంకర్‌ వరప్రసాద్‌) నటించనున్నారు. ఆయన సరసన నయనతార నటిస్తున్నారు. వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.   

Updated Date - Jul 19 , 2025 | 04:48 PM