Oscar Winner: ఎమ్.ఎమ్. కీరవాణి బర్త్ డే
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:50 PM
తెలుగు సినిమా సంగీతానికి అంతర్జాతీయంగా పట్టాభిషేకం జరిగేలా చేసిన ఘనుడు ఎమ్.ఎమ్.కీరవాణి. జూలై 4న కీరవాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా కీరవాణి బాణీని గుర్తు చేసుకుందాం.
కీరవాణి (Keeravani) సంగీతం పండితపామరభేదం లేకుండా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకోగలదు. నాటు పాటలనే కాదు నీటైన గీతాలకూ తనదైన రూటులో సాగుతూ కీరవాణి పలికించిన మధురామృతం అన్ని తరాల వారిని విశేషంగా అలరిస్తోంది. తెలుగు చిత్రాల ద్వారా అనేక అవార్డులూ, రివార్డులూ అందుకున్న కీరవాణి 'ట్రిపుల్ ఆర్' (RRR) లోని "నాటు నాటు." పాటతో అమెరికా జనానికి సైతం ఘాటెక్కేలా చేసి ఓ ఊపు ఊపేశారు. సదరు గీతంతోనే తెలుగువారికి తొలి ఆస్కార్ అవార్డు (Oscar Awards) ను అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు కీరవాణి. ఆయన స్వరకల్పనలో త్వరలోనే 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జనం ముందుకు రానుంది. ఈ చిత్రానికి సైతం కథానుసారంగా బాణీలు పలికించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు కీరవాణి. ప్రస్తుతం జనం మాత్రం కీరవాణి పేరు వినిపించగానే "నాటు నాటు." పాటనే గుర్తు చేసుకుంటున్నారు.
కీరవాణి నేడు అంతర్జాతీయ గుర్తింపు సంపాదించడం వల్ల ఆయన ఫేమ్ కాలేదు. తొలి నుంచీ తనదైన పంథాలో పదనిసలు పలికిస్తూ సాగారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ కు కీరవాణి బాణీలు దన్నుగా నిలిచాయి. మాతృభాష తెలుగులోనే కాదు పరభాషల్లోనూ కీరవాణి సంగీతం విశేషాదరణ చూరగొంది. తొలి తెలుగు పదకవితా పితామహుడుగా నిలచిన అన్నమాచార్య జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన 'అన్నమయ్య'కు స్వరకల్పనచేసి సంగీతాభిమానులను పులకింప చేశారు కీరవాణి. ఈ నాటికీ ఆ మధురామృతం మననం చేసుకొని పులకించిపోయేవారెందరో ఉన్నారు.
కీరవాణి పాటలకు జనం పట్టాభిషేకం చేయడానికి కారకులు ఎందరో ఉన్నారు. వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్థానం ప్రత్యేకమైనది. కీరవాణి స్వరాలతో రాఘవేంద్రరావు సాగిన తీరు పరిశీలిస్తే అది అర్థమవుతుంది. 'అన్నమయ్య' పాటలను అజరామరంగా మలచిన కీరవాణి, అంతకు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరకెక్కిన 'మేజర్ చంద్రకాంత్'కు సైతం వినసొంపైన స్వరాలు పేర్చారు. అందులో నిత్యనూతనంగా వెలుగుతున్న దేశభక్తి గీతం భావితరాలను సైతం పులకింప చేస్తూనే ఉంటుందని చెప్పవచ్చు. అందులో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. రాబోయే రోజుల్లోనూ కీరవాణి అందరినీ అలరించే సంగీతంతో సాగుతూ ఉంటారని ఆశిద్దాం.
Also Read: Thammudu: తమ్ముడు సినిమా రివ్యూ
Also Read: NTR: ఐదు దశాబ్దాల అన్నదమ్ముల అనుబంధం