Thammudu: తమ్ముడు సినిమా రివ్యూ
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:57 PM
నితిన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'తమ్ముడు'. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించారు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈ యేడాది 'దిల్' రాజు బ్యానర్ నుండి వచ్చిన మూడో సినిమా 'తమ్ముడు'! దీనికి ముందు వచ్చిన 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ కాగా, 'సంక్రాంతికి వస్తున్నాం' సూపర్ హిట్ అయ్యింది. హీరో నితిన్ కు ఎస్వీసీ బ్యానర్ లో ఇది మూడో సినిమా. మొదటి సినిమా 'దిల్' హిట్ అయినా... ఆ తర్వాత వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' పరాజయం పాలైంది. ఇప్పటికే 'దిల్' రాజు బ్యానర్ లో మూడు చిత్రాలు చేసిన శ్రీరామ్ వేణు అదే సంస్థలో చేసిన నాలుగో సినిమా 'తమ్ముడు'. మరో విశేషం ఏమంటే... నటి లయ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కూ 'తమ్ముడు' ఫలితం కీలకంగా మారింది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'తమ్ముడు' ఎలా ఉందో చూద్దాం...
కథ ఏమిటంటే...
స్నేహలత (లయ), జై (నితిన్) అక్కాతమ్ముళ్ళు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో జై కు ఆ లోటు లేకుండా పెంచుతుంది స్నేహలత. అయితే ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమె, వివాహానంతరం తన తండ్రికి, తమ్ముడికి దూరం అవుతుంది. అక్కడ నుండి జై ఒంటరి జీవితాన్నే గడిపి ఆర్చరీగా రాణిస్తాడు. తన చిరకాల కోరిక అయిన గోల్డ్ మెడల్ ను సాధించే సమయంలో అతని మనసు కల్లోలానికి గురౌతుంది. దూరమైన అక్కకు సంబంధించిన ఆలోచనలు అతన్ని నిలకడగా ఉండనివ్వవు. దాంతో తన సన్నిహితులు చైత్ర (వర్ష బొల్లమ్మ)కు విషయం చెబుతాడు. వీరిద్దరూ కలిసి స్నేహలత జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే... ఆమె ప్రస్తుతం ఝాన్సీ కిరణ్మయి పేరుతో ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా ఉంటుంది. నిజాయితీగా నిలవడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ఆమె ఊహించని చిక్కుల్లో పడుతుంది. మొక్కు తీర్చుకోవడం కోసం అటవీ ప్రాంతం అంబర గొడుగు కు వెళ్ళిన ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అదే సమయంలో అక్కను కలుద్దామని బయలు దేరిన జైకు ఝాన్సీ కుటుంబం తారసపడుతుంది. ఊహించని విధంగా ఎదురైన అక్కను చూసి జై ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇండస్ట్రియలిస్ట్ అజర్వాల్ (సౌరభ్ సచిదేవ) నుండి ఆమెకు వచ్చిన కష్టాన్ని ఎలా తప్పించాడు? అందుకోసం అతను కోల్పోయిందేమిటీ? అనేది ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే...
బేసికల్ గా ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కథే అయినా... దర్శకుడు శ్రీరామ్ వేణు కథనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో అడవిలో చిక్కుకు పోయిన అక్క ఫ్యామిలీ మెంబర్స్ ను ప్రాణాలను పణంగా పెట్టి ఓ తమ్ముడు ఎలా రక్షించాడన్నదే మెయిన్ పాయింట్ గా మారిపోయింది. అంతే కాదు... కథలో అప్పుడప్పుడు ఫైట్స్ రావడం కాకుండా... ఫైట్స్ మధ్యలో అప్పుడప్పుడు కథను చెప్పాడు శ్రీరామ్ వేణు. దాంతో పండాల్సిన సెంటిమెంట్ పండలేదు సరికదా... అంతులేని ఆ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తాయి. ఫ్యామిలీకి జై అక్క దూరం కావడానికి, పేరు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చూపించిన కారణాలు చాలా పేలవంగా ఉన్నాయి. నిజాయితీ పరురాలైన అధికారి లయ పాత్రను, ఆమెకు దన్నుగా నిలిచే తమ్ముడి పాత్రను చూసినప్పుడు ఇదే దర్శకుడు, ఇదే నిర్మాత తీసిన 'ఎంసీఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా గుర్తొస్తుంది. కోర్ పాయింట్ అదే అయినా... 'తమ్ముడు' కథను డైరెక్టర్ డీల్ చేసిన విధానం వేరు. ఇది ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేదు.
నితిన్, వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, స్వాపిక, సౌరభ్ సచిదేవ, బేబీ దిత్య... వీళ్ళందరి పాత్రలను కాస్తంత భిన్నంగా రాసుకున్నారు. కానీ వాటితో కథను రక్తికట్టించడంలో విఫలం అయ్యారు. దాంతో ఏ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోదు. అలానే ఏ పాత్రా ప్రేక్షకుల మెప్పు పొందదు. అడవిలో తప్పిపోయిన లయ కుటుంబం క్షేమంగా బయట పడటం సంగతి ఏమో కానీ... అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించలేక దర్శకుడు ఎక్కడో తప్పిపోయిన భావన కలుగుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత కష్టపడ్డా అది బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది.
'గేమ్ ఛేంజర్' మూవీని పరిమితికి మించిన బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. అక్కడో స్టార్ డైరెక్టర్ ఉన్నాడు, స్టార్ హీరో ఉన్నాడు. కానీ 'తమ్ముడు' సినిమా కోసం ఎందుకు ఇంతలా ఖర్చు చేశారో అర్థమే కాదు! అసలు అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఈ కథకు అవసరమా? అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. దీనికి తోడు ఇంటర్వెల్ మొదలైన దగ్గర నుండి మూడు నాలుగు క్లయిమాక్స్ లు వచ్చి వెళ్ళిన భావన ఏర్పడుతుంది. కొన్ని పోరాట సన్నివేశాలనైతే అనవసరంగా సాగదీశారు. ఉదాహరణకు చైత్ర, గుత్తి మధ్య ఫైట్ నిడివి అంత అవసరమే లేదు! ఇలా చెప్పుకుంటూ పోతే తగ్గించుకోవాల్సినవి చాలానే ఉంటాయి. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో సరిగా ఇన్ వాల్వ్ కాలేదా అనే సందేహం కూడా కలుగుతుంది. దిల్ రాజు కొంత కాలం పాటు ఇతర వ్యాపకాలను పక్కన పెట్టేసి, తాను తీస్తున్న సినిమాల కథల మీద కూర్చుని, వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే బెటర్. ఎందుకంటే... నిర్మాతలను ఆదుకునే 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు లభించవు.
ఈ సినిమా ప్రారంభంలో ఓ సంస్కృత వాక్యం గురించి చెబుతారు. 'అనుగచ్ఛతి ప్రవాహ' అని. అంటే 'ప్రవాహంతో పాటు వెళ్ళు' అని అర్థం. ఈ సినిమాలో హీరో నైజం అదే... కానీ దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం యేటికి ఎదురీదాలని ప్రయత్నించి భంగపడ్డాడు.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: సారీ... తమ్ముడు!