NTR: ఐదు దశాబ్దాల అన్నదమ్ముల అనుబంధం

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:36 PM

నటరత్న ఎన్టీఆర్ నటించిన 'అన్నదమ్ముల అనుబంధం' జులై 4వ తేదీతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. బాలకృష్ణ నటించిన మూడో చిత్రం ఇది

నటరత్న యన్టీఆర్ (NTR) హీరోగా అంతకు ముందు అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. తన తరువాతి తరం హిందీ హీరోల రీమేక్స్ లోనూ యన్టీఆర్ నటించి మెప్పించడం అన్నది 1974లో వచ్చిన 'నిప్పులాంటి మనిషి'తో ఊపందుకుంది. హిందీలో అమితాబ్ బచ్చన్ ను స్టార్ గా నిలిపిన 'జంజీర్' ఆధారంగా 'నిప్పులాంటి మనిషి' తెరకెక్కింది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. దాంతో యన్టీఆర్ హిందీ రీమేక్స్ కు తెలుగునాట విశేష ఆదరణ లభించసాగింది. యన్టీఆర్ ను చూసి ఇతర హీరోలు కూడా హిందీ రీమేక్స్ పై మనసు పడేలా చేసింది 'నిప్పులాంటి మనిషి' ఘనవిజయం. ఆ మరుసటి యేడాది అంటే 1975 జూలై 4న అలాంటి హిందీ రీమేక్ గా 'అన్నదమ్ముల అనుబంధం' (Annadammula Anubandham) విడుదలయింది. హిందీలో ఘనవిజయం సాధించిన ధర్మేంద్ర 'యాదోంకీ బారాత్' (Yaadonki Baaraat) ఈ సినిమాకు ఆధారం. యన్టీఆర్ క్రేజ్ కారణంగా మొదటి నుంచీ 'అన్నదమ్ముల అనుబంధం'పై అందరిలోనూ ఆసక్తి ఉండేది. ఇందులో యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ (Balakrishna) ఆయనకు తమ్మునిగా నటించడం ఆ రోజుల్లో ఆసక్తికర అంశంగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఘనవిజయం సాధించి, ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ చిత్రంలో యన్టీఆర్ తమ్ముళ్ళుగా మురళీమోహన్, బాలకృష్ణ నటించారు. బాలకృష్ణ, మురళీమోహన్ ఇద్దరికీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీగా 'అన్నదమ్ముల అనుబంధం' నిలచింది.


బాలకృష్ణకు నటునిగా 'అన్నదమ్ముల అనుబంధం' మూడో చిత్రం. ఈ సినిమా సమయంలో బాలయ్య వయసు కేవలం 15 సంవత్సరాలు. అంత పిన్నవయసులో హిందీలో తారిక్ పోషించిన పాత్రను బాలయ్యతో చేయించాలని నిర్మాత పీతాంబరం, దర్శకుడు యస్.డి.లాల్ భావించడం విశేషం!. బాలయ్య చేస్తేనే ఈ పాత్రకు ఓ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావించారు. యన్టీఆర్ ను ఒప్పించి మరీ ఇందులో బాలయ్యను నటింప చేశారు. మొదట ఆ పాత్రకు చంద్రమోహన్ ను ఎంచుకొని తరువాత ఆయనను తమిళ వర్షన్ 'నాళై నమదే'లో అదే రోల్ పోషించేలా చేశారు. అలా మూడో చిత్రంలోనే తండ్రి యన్టీఆర్ కు తమ్మునిగా నటించారు బాలకృష్ణ. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా జయమాలిని(Jayamalini) కనిపించారు. అలా బాలయ్య తొలి హీరోయిన్ గా జయమాలిని నిలచిపోయారు.

'అన్నదమ్ముల అనుబంధం'లో యన్టీఆర్ కు పాటలు లేవు. పాటలన్నీ మురళీమోహన్, బాలకృష్ణకే ఉన్నాయి. ఈ సినిమాకు చక్రవర్తి సంగీత దర్శకుడు. ఒరిజినల్ ఆర్డీ బర్మన్ ట్యూన్స్ నే అనుసరించినా, అక్కడక్కడా తన బాణీ పలికించే ప్రయత్నం చేశారు చక్రవర్తి. ఇందులో యన్టీఆర్ కు జోడీగా కాంచన కనిపించగా, మురళీమోహన్ జంటగా లత నటించారు. హిందీలో లేని కామెడీ ట్రాక్ ను తెలుగులో రాజబాబుతో చొప్పించారు. ప్రభాకర్ రెడ్డి విలన్ గా నటించిన ఈ సినిమాలో గిరిబాబు, ఏవీయమ్ రాజన్, రాజనాల, రావి కొండలరావు, త్యాగరాజు, రామదాసు, భీమరాజు, సుజాత ఇతర పాత్రల్లో కనిపించారు. సి.నారాయణ రెడ్డి, దాశరథి పాటలు పలికించిన ఈ చిత్రంలోని అన్ని పాటలూ ఆదరణ పొందాయి. "ఆ నాటి హృదయాల ఆనందగీతం..." అంటూ సాగే పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. తరువాతి కాలంలో నటునిగా ఎంతో పేరు సంపాదించిన గొల్లపూడి ఈ సినిమాకు రచన చేశారు. యన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని గొల్లపూడి రాసిన సంభాషణలు ఈ నాటికీ ఫ్యాన్స్ మదిలో నిలచే ఉండడం విశేషం!


'యాదోంకీ బారాత్' రీమేక్ రైట్స్ ను యన్టీఆర్, ఎమ్జీఆర్ కు పర్సనల్ మేకప్ మేన్ గా ఉన్న పీతాంబరం కొనుగోలు చేశారు. తెలుగులో యన్టీఆర్ హీరోగా 'అన్నదమ్ముల అనుబంధం'ను పీతాంబరం నిర్మించగా, తమిళంలో ఇదే కథను యమ్జీఆర్ తో 'నాళై నమదే' (Naalai Namadhe) గా ఆయన మిత్రుడు కె.యస్.ఆర్. మూర్తి నిర్మించారు. తమిళంలో సినిమా క్రేజ్ కోసం యమ్జీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించగా, వారి చిన్నతమ్ముని పాత్రలో చంద్రమోహన్ కనిపించారు. ఆ చిత్రానికి ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడు చాలావరకు సొంత బాణీలే వినిపించారు. ఇటు తెలుగులో అటు తమిళంలో రెండు సినిమాలు ఒకే రోజున అంటే 1975 జూలై 4న విడుదలయ్యాయి. తెలుగునాట 'అన్నదమ్ముల అనుబంధం' 9 కేంద్రాలలో వందరోజులు చూసింది. తరువాత రజతోత్సవమూ జరుపుకుంది. ఈ స్థాయిలో 'నాళై నమదే' విజయం సాధించలేదు.

bala.jpg

భవిష్యత్ లో ఏం జరగనుందో !?

మరో విశేషమేంటంటే 'అన్నదమ్ముల అనుబంధం' శతదినోత్సవానికి యమ్జీఆర్ ఛీఫ్ గెస్ట్. ఆయన చేతుల మీదుగానే ఈ చిత్ర బృందం హండ్రెడ్ డేస్ షీల్డ్స్ అందుకున్నారు. బాలకృష్ణ, మురళీమోహన్ ఇద్దరికీ ఈ సినిమాయే తొలి షీల్డ్ అందించడం విశేషం! ఇది యాభై ఏళ్ళ క్రితం నాటి ముచ్చట. అప్పట్లో ఎమ్జీఆర్ స్టార్ హీరోనే కాదు డి.ఎమ్.కె. ఎమ్మెల్యేగానూ ఉన్నారు. అంతేకాదు డి.ఎమ్.కె. పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించేవారు ఎమ్జీఆర్. యాభై ఏళ్ళ తరువాత బాలకృష్ణ కూడా ఇప్పుడు స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగానూ రాణిస్తున్నారు. తన తండ్రి నెలకొల్పిన తెలుగు దేశం పార్టీ విజయం కోసం బాలకృష్ణ సైతం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఈ ఫోటో చూస్తోంటే భవిష్యత్ లో బాలకృష్ణ కూడా రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తారేమో అనిపిస్తోంది.


నందమూరి - పీతాంబర బంధం

'అన్నదమ్ముల అనుబంధం' కథనే కొన్ని మార్పులూ చేర్పులూ చేసి కృష్ణతో 'రక్త సంబంధాలు' అనే ఫ్రీమేక్ తెరకెక్కింది. 1975 ఆగస్టు 29న విడుదలైన ఆ సినిమా పరాజయం పాలయింది. 'అన్నదమ్ముల అనుబంధం' తరువాత యన్టీఆర్ తో పీతాంబరం మరో హిందీ రీమేక్ 'యుగంధర్' నిర్మించారు. ఆ సినిమా దీనికంటే మిన్నగా వసూళ్ళు చూసింది. బాలకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం 'సాహసమే జీవితం' కు కూడా పీతాంబరం భాగస్వామి కావడం విశేషం! పీతాంబరం తనయుడు పి.వాసు 'సాహసమే జీవితం' దర్శకద్వయం భారతీవాసులో ఒకరు. 'అన్నదమ్ముల అనుబంధం'లో తండ్రి యన్టీఆర్ కు తమ్మునిగా నటించిన బాలకృష్ణ తరువాత 1980లో 'రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు'లోనూ నాన్నకు తమ్మునిగా అభినయించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏది ఏమైనా యాభై ఏళ్ళ క్రితం 'అన్నదమ్ముల అనుబంధం' అభిమానులను ఎంతగానో అలరించింది.

Also Read: Thammudu: తమ్ముడు సినిమా రివ్యూ

Updated Date - Jul 05 , 2025 | 04:38 PM