Rana Daggubati: రూట్ మార్చిన దుగ్గబాటి హీరో...
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:36 PM
తేజ సజ్జా 'మిరాయ్' సినిమాలో రానా గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడనే వార్త కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో అశోకుడి పాత్రను రానా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.
ప్రముఖ నటుడు, నిర్మాత, ఎంటర్ ప్రెన్యూర్ రానా దగ్గుబాటి కారణం ఏదైనా... ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటించడం లేదు. పూర్తి భారాన్ని తన భుజానికి ఎత్తుకోకుండా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. దానికంటే ముందు సినిమా నిర్మాతగా తనకు నచ్చిన సినిమాను తీసుకుని, దానిని ప్రమోట్ చేసి, విడుదల చేసే పని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. హీరోగా నటించడం లేదన్న మాటే కానీ రానా నటనకు దూరం కాలేదు సరికదా... భిన్నమైన పాత్రలను చూస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన రజనీకాంత్ 'వేట్టయాన్'లో నటించిన రానా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న శివ కార్తికేయన్ 'పరాశక్తి'లోనూ నటిస్తున్నాడు. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన షెడ్యూల్ లో రానా కూడా పాల్గొన్నడని తెలుస్తోంది. అంతేకాదు... ఈ మధ్య ఓ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ లో హీరో శివ కార్తికేయన్ స్వయంగా 'పరాశక్తి'లో రానా కూడా తన తో స్క్రీన్ షేర్ చేసుకున్నారనే విషయాన్ని తెలిపాడు. ఇదిలా ఉంటే... ఈ నెల 12న విడుదల కాబోతున్న తేజ సజ్జా 'మిరాయ్'లోనూ రానా నటిస్తున్నట్టు సమాచారం.
'మిరాయ్'లో రానా నటిస్తున్నాడనే వార్త కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీలో అశోక చక్రవర్తిగా రానా కనిపిస్తాడనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇందులో రానా నటించింది అశోక చక్రవర్తిగా కాదని తెలుస్తోంది. 'మిరాయ్' సినిమా విజయం సాధిస్తే... తప్పకుండా సీక్వెల్ ఉంటుందని ఇటీవలే మేకర్స్ చెప్పారు. అందుకు అనుగుణంగా 'మిరాయ్' సీక్వెల్ కు లీడ్ ఇస్తూ మూవీ చివరిలో ఓ సన్నివేశాన్ని పెట్టారట. 'మిరాయ్'లో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటించగా, 'మిరాయ్' సీక్వెల్ లో రానా విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సీక్వెల్ కు 'మిరాయ్ : జైత్రయ' అనే పేరు ఖరారు చేశారట. ఇలా వివిధ భాషల్లో రానా గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తూ అభిమానులను ఏదో ఒక స్థాయిలో సంతృప్తి పరుస్తున్నాడు.
Also Read: Mega Heroes: ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- అబ్బాయ్ తో అల్లు అర్జున్...
Also Read: Mirai: శ్రియాకు అచ్చివచ్చిన సెప్టెంబర్...