Murugadoss Vs Siva Karthikeyan: దర్శకుడిదో మాట... హీరోది మరో మాట...
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:58 PM
'మదరాసి' సినిమాతో జనం ముందుకు వస్తున్నారు డైరెక్టర్ మురుగదాస్, హీరో శివ కార్తికేయన్. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మురుగదాస్ వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలను శివకార్తికేయన్ చేయడం విశేషం.
ప్రముఖ దర్శకుడు ఎ. ఆర్. మురుగదాస్ (AR Murugadoss) ఇటీవల చేసిన ప్రకటనలు వివాదాలకు దారి తీశాయి. తమిళ దర్శకులను ఆకాశానికి ఎత్తుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామందిని హర్ట్ చేశాయి. వెయ్యి కోట్ల గ్రాస్ ను వసూలు చేసే సినిమాలను పనికి మాలిన వాటిగా మురుగదాస్ చెప్పడాన్ని చాలా మంది తప్పు పట్టారు. తమిళ దర్శకులు తీసే సినిమాలు సమాజానికి మేలు చేసేవని, వాటి ద్వారా ఏదో ఒక సందేశాన్ని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారని మురుగదాస్ తమ వారిని వెనకేసుకు వచ్చారు. వేయి కోట్ల సినిమాల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం లేదన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన అభిప్రాయాన్ని హీరో శివ కార్తికేయన్ వ్యక్తం చేశారు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా మురుగదాస్ 'మదరాసి' (Madarasi) సినిమాను తెరకెక్కించారు. ఇది సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కమర్షియల్ మూవీస్ గురించి మురుగదాస్ మాట్లాడాడు. అదే 'మదరాసి' సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ వేయి కోట్ల సినిమాలను వెనకేసుకు వచ్చారు. కంటెంట్ నచ్చితే నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాలను నిర్మిస్తారని, అందువల్లే ఆ సినిమా రికార్డ్ స్థాయిలో వేయి కోట్ల గ్రాస్ ను వసూలు చేస్తాయని శివ కార్తికేయన్ కితాబిచ్చాడు. అలాంటి నిర్మాతల్లో 'మదరాసి'ని తెలుగువారి ముందుకు తీసుకొస్తున్న ఎన్. వి. ప్రసాద్ (N.V. Prasad) కూడా ఒకరి అన్నారు. కమర్షియల్ సినిమాలు నిర్మించడం కూడా సామాన్య విషయం కాదని, ఎంతో గట్స్ ఉంటే తప్పితే వాటిని తీయలేరని శివ కార్తికేయన్ చెప్పడంతో మురుగదాస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.
నిజానికి సందేశాత్మక చిత్రాలు సమాజానికి ఉపయోగమేమో కానీ సినిమా రంగం సజావుగా సాగాలంటే... కమర్షియల్ సినిమాల వల్లే సాధ్యం అవుతుంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల వల్లే కార్మికుల కడుపులు నిండుతాయి. అలానే చిన్న సినిమాలు సైతం కమర్షియల్ సక్సెస్ అందుకున్నప్పుడే మరికొంతమంది నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొస్తారు. ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి తనకు, తన తోటి తమిళ దర్శకులకు సరైన సక్సెస్ లు లేకపోవడంతో మురుగదాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అందరూ అనుకొంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలను మురుగదాస్ వెనక్కి తీసుకుంటాడేమో చూడాలి.
Also Read: Venkatesh: వెంకటేష్ ఇంట విషాదం..
Also Read: OTT MOVIES: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!