Mahavatar Narsimha: వంద కోట్ల క్లబ్ లో...
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:44 PM
జూలై 25న జాతీయ స్థాయిలో విడుదలైన 'మహావతార్: నరసింహ' చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన సినిమా 'మహావతార్ : నరసింహ' (Mahavatar Narasimha). జూలై 25న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతుండటంతో నిర్మాతలు స్క్రీనింగ్స్ సంఖ్యను పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఈ సినిమా ఆదివారంతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇంతవరకూ వరల్డ్ వైడ్ రూ. 105 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని నిర్మాతలు తెలిపారు.
అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద (Bhaktha Prahlada) కథనే యానిమేషన్ మూవీగా తెరకెక్కించిన దర్శకుడు అశ్వినీ కుమార్ (Aswini Kumar) విజయాన్ని సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుండి వచ్చే యానిమేషన్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఇది ఉండటంతో పాటు... మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ లో నరసింహ స్వామి అవతారాన్ని, శిరణ్య కశిపుడి వధను రోమాంచితంగా అశ్వినీ కుమార్ టీమ్ తెరపై ప్రెజెంట్ చేసింది. ఇది పేరుకు యానిమేషన్ మూవీనే అయినా... అందులో పాత్రల హావభావాలకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. హిరణ్య కశ్యపుడిని, హిరణ్యాక్షులను ఎంత క్రూరంగా చూపించారో, భక్త ప్రహ్లాదను, విష్ణుమూర్తిని అంతే సున్నితంగా చూపించారు. దాంతో ఆబాలగోపాలం ఈ సినిమాను ఇష్టపడుతోంది.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలోనూ తెలుగులో ఈ సినిమాను పంపిణీ చేసిన అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ, 'ఇది నరసింహుడు ఇచ్చిన విజయం' అని అన్నారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఈ సినిమా గొప్పగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు రావడం తగ్గిపోయిన ఈ రోజుల్లో 'మహావతార్ : నరసింహ'ను ఫ్యామిలీస్ తో ఆడియెన్స్ చూడటం గొప్ప విషయమే. ఈ మూవీ మరికొన్ని రోజులకే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు.
Also Read: Tamannaah Bhatia: ఆ రూమర్స్ ఎలా వస్తాయో.. ఎందుకు క్రియేట్ చేస్తారో..
Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బుడ్డోడి పేరేంటో తెలుసా...