సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karunanidhi: కరుణానిధి పెద్దకొడుకు, నటుడు ముత్తు ఇకలేరు

ABN, Publish Date - Jul 19 , 2025 | 10:48 AM

మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన స్వర్గీయ ఎం. కరుణానిధి తొలి వారసుడు తనువు చాలించాడు.

మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన స్వర్గీయ ఎం. కరుణానిధి (M Karunanidhi) తొలి వారసుడు తనువు చాలించాడు. కరుణానిధి మొదటి భార్య పద్మావతి కొడుకు అయిన ఎం.కె. ముత్తు (MK Muthu) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు 77 సంవత్సరాలు.

డీఎంకే అధినేత కరుణానిధి ముద్దుల కొడుకైన ఎం.కె. ముత్తు ఆయన బాటలోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ అక్కడా ఇక్కడా ఆయనకు చేదు అనుభవమే మిగిలింది. ముత్తును నటుడిని చేయాలని కరుణానిధి మొదట్లో ఎంతో తపించారు. ముత్తు నటించిన కొన్ని సినిమాలకు ఆయన స్క్రిప్ట్ కూడా సమకూర్చారు. ముత్తు (పుకారి, దమయ విల్లుక్కు, పిళ్ళై ఓ పిళ్ళై, శైలకారన్' వంటి చిత్రాలలో నటించారు. అలానే కొన్ని సినిమాలలో పాటలూ పాడారు.


అయితే సినిమా, రాజకీయ రంగాల్లో విఫలమైన తర్వాత ఎ. కె. ముత్తు తండ్రికే పక్కలో బల్లెంలా మారారు. ఎం.జి. రామచంద్రన్ (MGR) డీఎంకే (DMK)
పార్టీ నుండి విడిపోయి అన్నా డీఎంకే పార్టీ (AIADMK) పెట్టిన తర్వాత ముత్తు ఆయన వైపు మొగ్గు చూపారు. ఎంజీఆర్ తరహా వేషధారణతో డీఎంకే సమావేశాలకు హాజరయ్యే వారు. తండ్రి తన మాట పట్టించుకోవడం లేదనే అక్కసుతో ఒకానొక సమయంలో అన్నా డీఏంకే పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. జయలలిత (Jayalalitha) కూడా ముత్తుకు ఆర్థిక సాయంచేసి తండ్రి కరుణానిధికి వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించేదని తమిళ రాజకీయ వర్గాలు చెబుతుంటాయి.

చిత్రం ఏమంటే తండ్రి కరుణానిధితోనే కాదు ముత్తుకు కొడుకు అరువునిధితోనూ పడేది కాదు. ముత్తు అతని భార్య జె శివగామి సుందరి ఇద్దరూ కలిసి తన కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు తమని బెదిరిస్తున్నారంటూ వాపోయేవారు. అయితే కరుణానిధి చివరి రోజుల్లో ముత్తు తన మనసు మార్చుకుని తండ్రికి దగ్గరయ్యారు. కరుణానిధి సైతం ఆయన్ని ఆదరించాడు. ఆ రకంగా తండ్రీ కొడుకులు ఇద్దరూ తిరిగి కలిశారు. ఇదిలా ఉంటే... ప్రముఖ తమిళనటుడు విక్రమ్ (Vikram) కుమార్తె అక్షిత ఆ మధ్య కరుణానిధి ముని మనవడు మను రంజిత్ ను వివాహం చేసుకుంది. అతను మరెవరో కాదు ఎం.కె. ముత్తు మనవడే.

చెన్నైలోని ఈంజంబాక్కంలో ఉన్న నివాసంలో ముత్తు పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

Also Read: AR Rahman - Hans Zimmer: నేనే కాదు.. ఎవరూ ఊహించి ఉండరు

Also Read: Sautarday Tv Movies: శ‌నివారం, జూలై 19.. తెలుగు టెలివిజన్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Updated Date - Jul 19 , 2025 | 11:09 AM