Action King Arjun: హత్యకు గురైన రచయిత కథతో 'మఫ్టీ పోలీస్'....
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:37 AM
అర్జున్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించిన 'మఫ్టీ పోలీస్' మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఓ రచయిత హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'మఫ్టీ పోలీస్' తెరకెక్కింది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Action King Arjun), యాక్టింగ్ క్వీన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) కీలక పాత్రలు పోషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా 'తీయవర్ కులై నడుంగ'. ఈ సినిమాను తెలుగులో 'మఫ్టీ పోలీస్' (Mufti Police) పేరుతో డబ్ చేస్తున్నారు. రెండు భాషల్లోనూ ఈ సినిమా ఈ నెల 21న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత ఎ.ఎన్. బాలాజీ శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై విడుదల చేయబోతున్నారు.
నిర్మాత బాలాజీ ఈ సినిమా గురించి చెబుతూ, 'ఒక రచయిత హత్య నేపధ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో దర్శకుడు దినేష్ లక్ష్మణన్ చర్చించాడు. ఇటు యాక్షన్ కింగ్ అర్జున్ కు, అటు ఐశ్వర్యా రాజేష్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. దశాబ్దాలుగా అర్జున్ తెలుగువారికి తెలుసు. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్య రాజేశ్ 'భాగ్యం'గా తెలుగువారి గుండెల్లో చోటు దక్కించుకుంది. అందుకే ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేశాం. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి నాకు అవకాశం కల్పించిన జి. అరుల్ కుమార్ కు, దర్శకుడు దినేష్ లక్ష్మణన్ కు కృతజ్ఞతలు' అని అన్నారు. రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శరవణన్ అభిమన్యు ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also Read: Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ
Also Read: SS Rajamouli: రాజమౌళిపై వానరసేన ఫిర్యాదు.. మరోపక్క టైటిల్‌పై రచ్చ..