Hero Vijay: ఇళయ దళపతిని ఇరుకున పెట్టే ప్రయత్నం
ABN, Publish Date - Aug 29 , 2025 | 04:15 PM
తమిళనాట స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో చిత్ర విచిత్ర వ్యూహాలు సాగుతున్నాయి. విజయ్ ని ఓడించే ప్రయత్నంలో అధికార డీయమ్కే పార్టీ పలు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఇంతకూ ఏం జరుగుతోంది...
'తెరమీది తారలే పరిపాలనకు వచ్చి అధికారమును చెలాయించేరయా...' అని బ్రహ్మం తాత ఏ నాడో సెలవిచ్చారు. దానిని ముందుగా నిజం చేసింది తమిళ సినీజనమే అని చెప్పాలి... అంతకు ముందు సినిమా రచయితలుగా రాజ్యమేలిన అన్నాదొరై (C. N. Annadurai), కరుణానిధి (M. Karunanidhi) ఇద్దరూ డి.యమ్.కె. (DMK) పార్టీ తరపున ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. వారి నీడనే రాజకీయంలో అడుగు పెట్టిన నాటి స్టార్ ఎమ్.జి. రామచంద్రన్ (M.G. Ramachandran) తరువాత 'అన్నా డియమ్.కె' పార్టీ పెట్టి 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అలా తెరమీద తారగా వెలిగిన రామచంద్రన్ అధికారం చెలాయించారు. తరువాత 1981లో అమెరికా అధ్యక్షునిగా రోనాల్డ్ రీగన్, ఆ పై 1983లో తెలుగునాట యన్టీఆర్ (NTR) రాజ్యమేలి బ్రహ్మం తాత పలుకులు నిజం చేశారు... రామారావు తరువాత ఎందరో సినీతారలు రాజకీయాల్లో రాణించాలని తపించారు. కానీ, ఎవ్వరూ సక్సెస్ సాధించలేక పోయారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ లాంటి స్టార్ హీరో రాజకీయాల్లో అడుగు పెట్టడంతో అందరిచూపు ఆయనవైపు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ని ఎలాగైనా పాలిటిక్స్ లో సక్సెస్ కాకుండాచేయడానికి అధికార డి.యమ్.కె. పార్టీ పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
డి.యమ్.కె. పార్టీ మూలాలు కూడా సినిమారంగంలోనే ఉన్నాయి. పైగా తమిళనాట అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న క్రెడిట్ ను దక్కించుకున్నారు కరుణానిధి. ఆయన తనయుడు స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి - స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కొన్నాళ్ళు హీరోగానూ సాగారు. పైగా వారికి సినిమారంగంలో పలు శాఖలతో అనుబంధం ఉంది. అందువల్ల విజయ్ (Vijay) ని భ్రష్టు పట్టించడానికి అన్నట్టు కొన్ని వ్యూహాలు పన్నినట్టు తెలుస్తోంది. విజయ్ తో ఎప్పుడో పదేళ్ళ క్రితం 'పులి' సినిమా తీసిన నిర్మాత సెల్వ కుమార్ ను బయటకు తీసుకు వచ్చి అతనితో విజయ్ అలాంటోడు, ఇలాంటోడు అని చెప్పిస్తున్నారు. ఇన్నాళ్ళు బయటకు రాని ఆ నిర్మాత ఇప్పుడే వచ్చి విజయ్ పై ఆరోపణలు చేయడం చూస్తే ఎవరు చేయిస్తున్నారో ఇట్టే అర్థమై పోతుంది. పైగా ఎవరితోనూ పొత్తు లేకుండా సోలోగానే ఎన్నికలకు వెళతానని విజయ్ ప్రకటించడంతోనే ఇన్ని ఎత్తులు సాగుతున్నాయని టాక్ ! అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కొందరు స్టార్స్ ను అప్పుడే లైన్ లో పెడుతున్నారట డి.యమ్.కే. పెద్దలు. తమ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ను ఎరవేసి డి.యమ్.కే. వారు ఇప్పటికే ఓ బిగ్ స్టార్ ను తమ బుట్టలో వేసుకున్నారట. ఇవన్నీ విజయ్ ఎఫెక్ట్ అని పరిశీలకులు చెబుతున్నారు.
సినిమా తారలు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు వారిపై అవాకులు చవాకులూ పేలడం సహజమే. యన్టీఆర్ పాలిటిక్స్ లో అడుగుపెట్టగానే, ఆయన టవల్స్, కిరీటాలు ఎత్తుకు పోయేవారని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. నిర్మాతలకు నష్టం వస్తే పట్టించుకోరనీ టముకు వేశారు. అన్నిటినీ తోసిరాజని ప్రజలు యన్టీఆర్ కు పట్టం కట్టారు. అలా రాజకీయాల్లో అడుగుపెట్టిన స్టార్స్ ను చూసి అధికార పార్టీలు భయపడడం కొత్తేమీ కాదు. విజయ్ ని జనాల్లో పలచన చేసేందుకు డి.యమ్.కె. పార్టీ వేస్తున్న ఎత్తుగడలు చూస్తోంటే, నిజంగానే విజయ్ కి రాజకీయాల్లోనూ రాణించే ఛాన్స్ ఉందేమో అని కొందరు అంటున్నారు. కమల్ హాసన్ సొంత పార్టీ పెట్టి ఒక్క సీటూ గెలచుకోలేక పోయారు. రజనీకాంత్ సొంత పార్టీ అని ఊరించి, తరువాత చాప చుట్టేశారు. వారిద్దరి కంటే విజయ్ పోటుగాడా అని డీయమ్కే జనం అంటున్నారు. విజయ్ కి అంత స్టార్ డమ్ లేకపోతే ఈ ఎత్తుగడలు ఎందుకనీ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో? విజయ్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
Also Read: Nagarjuna Akkineni: భక్తిరసం కురిపించిన నాగార్జున
Also Read: Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా మెప్పించిందా...