Mohal Lal: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
ABN, Publish Date - Sep 20 , 2025 | 06:43 PM
సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం 2023కి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
మలయాళ చిత్రసీమకు చెందిన సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాలలో నటించిన 'కంప్లీట్ యాక్టర్' మోహన్ లాల్ ను ఈ అవార్డు కు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 23న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్ లాల్ ను సైతం భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పురస్కారంతో సత్కరించబోతోంది.
నటుడిగా, నిర్మాతగా, పంపిణీ దారుడిగా మలయాళ చిత్రసీమలో తనదైన ముద్రను వేసిన మోహన్ లాల్ గత యేడాది 'బారోజ్' మూవీతో దర్శకుడిగా మారారు. దీనిని త్రీడీలో ఆయన రూపొందించారు. అయితే 'బారోజ్' ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఆరున్నర పదుల వయసులోనూ మోహన్ లాల్ నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నారు. 'ఎంపురాన్' లాంటి భారీ యాక్షన్ సినిమాలనే కాకుండా... 'తుడరుమ్' లాంటి మీడియం బడ్జెట్ చిత్రంలోనూ ఆయన నటించారు. ఇటీవల విడుదలైన 'కన్నప్ప'లోనూ మోహన్ లాల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ 'వృషభ' టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా దీపావళికి జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కానుంది. అలానే 'పేట్రియాట్' మూవీ సెట్స్ పై ఉండగా, 'దృశ్యం -3' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది.
Also Read: Actress Hema: మీ అక్కను బాడీ షేమింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావ్ మంచు విష్ణు
Also Read: Sunday Tv Movies: ఆదివారం, Sep21.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే