Anupama Parameswaran: శ్రీలీల, భాగ్యశ్రీలకు షాక్.. జెట్ స్పీడ్‌లో అనుపమ
ABN, Publish Date - Oct 16 , 2025 | 11:46 AM
అనుపమా పరమేశ్వరన్ నటించిన ఆరు చిత్రాలు ఈ యేడాది జనం ముందుకు వస్తున్నాయి. తాజాగా దీపావళికి మలయాళ చిత్రం 'ది పెట్ డిటెక్టివ్', తమిళ మూవీ 'బైసన్' విడుదల అవుతున్నాయి.
మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran) ఒక్కసారిగా తన జోరు పెంచింది. గత రెండు మూడేళ్ళుగా సెట్స్ మీద ఉన్న ఆమె సినిమాలన్నీ వరుస పెట్టి విడుదల కావడం మొదలైంది. దాంతో ఈ యేడాది అనుపమా పరమేశ్వరన్ నటించిన సినిమా మొత్తం ఆరు జనం ముందుకు వచ్చినట్టయ్యింది. విశేషం ఏమంటే ఈ ముద్దుగమ్మ నటించిన నాలుగు చిత్రాలు ఇప్పటికే ఈ యేడాది విడుదల కాగా, గురువారం ఓ మలయాళ చిత్రం, శుక్రవారం తమిళ చిత్రం జనం ముందుకు వస్తున్నాయి.
ఈ యేడాది ప్రారంభంలోనే ప్రదీప్ రంగనాథన్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటించిన 'డ్రాగన్' (Dragon) మూవీ విడుదలైంది. ఇది తెలుగులోనూ వచ్చింది. ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్ నటించిన మలయాళ చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (JSK: Janaki V v/s State of Kerala) సినిమా వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంది. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఇది విడుదలైంది. ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యింది కానీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. సురేశ్ గోపీ లాయర్ గా నటించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కోర్టును ఆశ్రయించే బాధితురాలి పాత్రను పోషించింది.
అనుపమా ఎంతో ఇష్టంగా చేసిన సినిమా 'పరదా' (Parada). తెలుగులో 'సినిమా బండి, శుభం' చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ కాడ్రేగుల ఈ సినిమాను రూపొందించాడు. విడుదలకు ముందు ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దంత ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుపమా పరమేశ్వరన్ భావోద్వేగానికి గురి కావడంతో అప్పట్లో సోషల్ మీడియాలో ఆమె గురించి విశేష ప్రచారం జరిగింది. ఇక ఈ యేడాది వచ్చిన అనుపమా పరమేశ్వరన్ నాలుగో చిత్రం 'కిష్కింధపురి' (Kishkindhapuri). బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో గతంలో 'రాక్షసుడు' మూవీలో నటించిన అనుపమా పరమేశ్వరన్. మరోసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన 'కిష్కింధపురి' థియేట్రికల్ గా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయినా... ఓటీటీలో మంచి స్పందనే దీనికి లభించింది.
ఇదిలా ఉంటే... తాజాగా దీపావళి కానుకగా అనుపమా పరమేశ్వరన్ నటించిన 'ది పెట్ డిటెక్టివ్' (The Pet Detective) అనే మలయాళ చిత్రం గురువారం జనం ముందుకు వచ్చింది. నిజానికి ఇది గత యేడాది విడుదల కావాల్సిన సినిమా. రకరకాల కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు విడుదలైంది. ఇక శుక్రవారం ఆమె నటించిన తమిళ చిత్రం 'బైసన్' (Bison) విడుదల కాబోతోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించాడు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 'బైసన్' తెలుగు వర్షన్ ఓ వారం తర్వాత 24న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కాబోతోంది. గతంలో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన 'పరియేరుమ్ పెరుమాళ్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ అప్పుడు దాన్ని ఉపయోగించుకోలేక పోయానని, ఇప్పుడు మరోసారి ఆయన మూవీ 'బైసన్'లో ఛాన్స్ దక్కడం ఆనందాన్ని కలిగించిందని అనుపమా చెబుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏదైనా ఆమెకు మెమొరబుల్ హిట్ ను అందిస్తుందేమో చూడాలి.
Also Read: Rashmika Mandanna: 'మైసా'కు జేక్స్ బిజోయ్ సంగీతం...
Also Read: Peddi Movie: దీపావళికి ‘పెద్ది’ ధమాకా.. దర్శకుడు హింట్..