Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్...
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:46 PM
ప్రముఖ నటుడు, రాజకీయ పార్టీ నేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా ఓ పక్క సినిమాలు చేస్తూనే, రాజకీయ నేతగానూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ అధికారిక డి.ఎం.కె.తో పొత్తు పెట్టుకోబోతోంది.
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మొత్తానికీ పార్లమెంట్ లో అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డి.ఎం.కె. (DMK) పార్టీకి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం (Makkal Needhi Maiam MNM) సపోర్ట్ చేసింది. దాంతో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపుతామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా జూన్ 12న తమిళనాడు నుండి కమల్ హాసన్ పేరును రాజ్యసభ సభకు నామినేట్ చేయడంతో ఆయన తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పటి నుండీ ఆయన అభిమానులకు కమల్ హాసన్ కేవలం నటుడు, రాజకీయ పార్టీ నేత మాత్రమే కాదు... పార్లమెంటేరియన్ కూడా. ప్రమాణ స్వీకారం సందర్భంగా 'ఢిల్లీలో తన పేరును రిజిస్టర్ చేసుకుంటున్నానని, పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఓ భారతీయుడిగా తన గౌరవ బాధ్యతలను నిర్వర్తిస్తాన'ని కమల్ తెలిపారు. కమల్ హాసన్ తమిళంలో ప్రమాణస్వీకారం చేసినప్పుడు తోటి తమిళ సభ్యులు హర్షద్వానాలు చేశారు.
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ, 'నా మీద అంచనాలు ఉంటాయని తెలుసు. వాటిని అందుకోవడానికి కృషి చేస్తాను. తమిళనాడు కోసం, భారత దేశం కోసం నా వాణిని వినిపిస్తాను' అని అన్నారు. 2017లో పొలిటికల్ పార్టీ పెట్టిన కమల్ హాసన్ కు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్లు లభించాయి. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, అధికారిక డీఎంకే కు మద్దత్తు ఇచ్చింది. అయితే వచ్చే యేడాది తమిళనాడులో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ డీఎంకే తో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
Also Read: Vijay Sethupathi: పూరి సేతుపతి సెట్‌లో.. సర్ మేడమ్‌సెలబ్రేషన్స్
Also Read: Kingdom: ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మరో వైపు కొత్త ఆర్కిటెక్ట్