సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR - SVR: విజయ సంస్థలో ఆస్థాన నటులు

ABN, Publish Date - May 26 , 2025 | 07:11 PM

యన్టీఆర్, ఏయన్నార్ మధ్య పొరపొచ్చాలు వచ్చినా ఒకరిమాటకు ఒకరు విలువనిచ్చేవారు. అదే తీరున యస్వీఆర్ సైతం పరిశ్రమ అభివృద్ధికి యన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలియగానే దానిని బలపరిచేవారు.

తెలుగు తెరపై నిండుగా కనిపించిన కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది - నటరత్న యన్.టి.రామారావు (NT Rama Rao), నటచక్రవర్తి యస్.వి.రంగారావు (SV Ranga Rao) దే అని చెప్పాలి. కథానాయకునిగా యన్టీఆర్, ఆయనకు తగ్గ ప్రతినాయకునిగా యస్వీఆర్ అనేక చిత్రాలలో అలరించారు. అలాగే తండ్రీకొడుకులుగా, మామాఅల్లుళ్ళుగా, బాబాయ్- అబ్బాయ్ గానూ యన్టీఆర్, యస్వీఆర్ సాగారు.

నిజం చెప్పాలంటే వారిద్దరి అనుబంధం తొలి రోజుల నుంచీ పెనవేసుకున్నదే! అంతకు ముందు 1947లోనే 'వరూధిని' సినిమాలో ప్రవరాఖ్యునిగా నటించిన యస్వీఆర్ ఆ సినిమా పరాజయం పాలు కావడంతో సినిమా రంగానికి తాను పనికి రానేమో అనే అనుమానంతో కొట్టుమిట్టాడారు. తరువాత రెండేళ్ళు నాటకాలతోనే సాగారు. ఆ సమయంలోనే యల్వీ ప్రసాద్ (LV Prasad) 'మనదేశం' సినిమా తెరకెక్కిస్తూ అందులో యన్టీఆర్ కు పోలీస్ ఇన్ స్పెక్టర్ గా వేషం ఇచ్చారు. అందులోనే యస్వీఆర్ కూడా చిన్నవేషం ధరించారు. తరువాత అదే యల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందిన విజయావారి తొలి చిత్రం 'షావుకారు'తోనే యన్టీఆర్ మొదటిసారి కథానాయకునిగా జనం ముందు నిలిచారు. ఆ సినిమాలో సున్నం రంగడి పాత్రలో యస్వీఆర్ గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత విడుదలయిన యన్టీఆర్, ఏయన్నార్ తొలి సినిమా 'పల్లెటూరి పిల్ల'లోనూ ముసలితాతగా నటించి ఆకట్టుకున్నారు యస్వీఆర్. యన్టీఆర్, యస్వీఆర్ ఇద్దరూ విజయా సంస్థలో జీతం తీసుకుంటూ వారి ఆస్థాన నటులుగా ఉన్నారు. ఆ సమయంలోనే విజయా సంస్థాధినేతలు 'పాతాళభైరవి' జానపద చిత్రం తీయాలని తలచారు. దర్శకునిగా కేవీ రెడ్డి (KV Reddy)ని ఎంచుకున్నారు. సాంఘిక చిత్రం 'షావుకారు'లో అందాల నటునిగా పేరొందిన యన్టీఆర్, జానపదాలకు పనికి రాడేమో అని నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి భావించారు. దాంతో వారు తోటరాముని పాత్ర కోసం తొలుత రాజారెడ్డి, మాంత్రికుని పాత్రలో గోవిందరాజుల సుబ్బారావును అనుకున్నారు. అయితే విజయా సంస్థ పర్మినెంట్ ఆర్టిస్టులైన యన్టీఆర్, యస్వీఆర్ ఆ జానపద చిత్రంలో తామే నాయక, ప్రతినాయక పాత్రల్లో నటిస్తే బాగుంటుందని ఆశిస్తూండేవారు. యన్టీఆరేమో అమెరికన్ యాక్టర్ డగ్లాస్ ఫెయిర్ బాంక్స్ పోషించిన జానపద గెటప్స్ ను తలచేలా మేకప్ చేసుకొని కనిపించేవారు. అలాగే 'ఇవాన్ ద టెర్రిబుల్'లోని ఇవాన్ గెటప్ వేసుకొని మాంత్రికునిగా తాను బాగుంటానని కేవీ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేసేవారు యస్వీఆర్. తరువాత తోటరామునిగా ఏయన్నార్ ను, మాంత్రికునిగా ముక్కామలను కూడా అనుకున్నారు మేకర్స్. అయితే ఓ రోజున విజయా స్టూడియోస్ లాన్ లో టెన్నిస్ ఆడుతున్న యన్టీఆర్ రాకెట్ పట్టుకొని బాల్ ను మోదే దృశ్యం చూసిన కేవీ రెడ్డికి అతనే తన 'తోటరాముడు' అన్న నిశ్చితాభిప్రాయం కలిగింది. అలాగే నేపాల మాంత్రికుని వేషానికి యస్వీఆరే సరైనవారని కూడా యన్టీఆర్, రేలంగి తదితరులు చెప్పడంతో కేవీ కూడా సరే అన్నారు. యన్టీఆర్, యస్వీఆర్ నే హీరో, విలన్ గా ఎంచుకుని కేవీ రెడ్డి తెరకెక్కించిన 'పాతాళభైరవి' (Pathala Bhairavi)చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయఢంకా మోగించింది. తెలుగునాట తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది. అనేక రికార్డులను నెలకొల్పింది. 'పాతాళభైరవి' సినిమాతో యన్టీఆర్ సూపర్ స్టార్ అయిపోయారు, యస్వీఆర్ నటునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత విజయా సంస్థ నిర్మించిన "పెళ్ళిచేసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ" చిత్రాలలో యన్టీఆర్, యస్వీఆర్ తెలుగువారిని విశేషంగా అలరించారు.


ఇక వేరే సంస్థలు నిర్మించిన సినిమాల్లోనూ యన్టీఆర్, యస్వీఆర్ నటించి అలరించిన వైనాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. యన్టీఆర్ సొంత చిత్రం 'జయసింహ'లో హీరోను చంపాలనుకొనే పినతండ్రి పాత్రలో యస్వీఆర్ నటించారు. ఆ తరువాత యన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, విజయా సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి భాగస్వామ్యంలో స్వస్తిశ్రీ పతాకంపై నిర్మించిన 'రేచుక్క-పగటిచుక్క' చిత్రంలో తండ్రీకొడుకులుగా నటించారు రంగారావు, రామారావు. ఈ సినిమా తమ సొంత చిత్రమే అయినా, యస్వీఆర్ పాత్రకే ఎంతో ప్రాధాన్యముండేలా చూశారు యన్టీఆర్. ఇక యన్టీఆర్ హీరోగా ఏవీయమ్ సంస్థతో కలసి యస్వీఆర్ 'నాదీ ఆడజన్మే' చిత్రం నిర్మించారు. ఆ సినిమా సైతం ఘనవిజయం సాధించింది.

ఇలా యన్టీఆర్, యస్వీఆర్ ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగారు. అయితే 1965 సంక్రాంతి కానుకగా విడుదలైన 'పాండవవనవాసము' చిత్రంలో యన్టీఆర్ భీమునిగా, యస్వీఆర్ దుర్యోధనునిగా నటించారు. అందులో యన్టీఆర్ కథానాయకునిగా నటించినా, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల్లో యస్వీఆర్ పై చేయిగా కనిపిస్తుంది. తరువాత ద్వితీయార్ధంలో ఘోషయాత్ర సన్నివేశంలో రామారావు ఆధిక్యం తెలిసిపోతుంది. అలా పోటాపోటీగా నటించిన తరువాత రామారావుకు కూడా దుర్యోధనుని పాత్ర పోషించాలన్న అభిలాష కలిగింది. స్వీయ దర్శకత్వంలో తానే శ్రీకృష్ణ దుర్యోధన పాత్రల్లో నటిస్తూ 'శ్రీక్రిష్ణపాండవీయం' నిర్మించారు యన్టీఆర్. ఈ సినిమా 1966 సంక్రాంతి సంబరాల్లో విడుదలై విజయఢంకా మోగించింది. 'పాండవవనవాసము'లో రారాజు పాత్రలో మార్కులు సంపాదించిన యస్వీఆర్ తాను కూడా సొంతగా 'రారాజు' అనే పౌరాణిక చిత్రాన్ని తీయాలని ఆశించారు. అందుకు తగ్గ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే యన్టీఆర్ 'శ్రీక్రిష్ణ పాండవీయం'లో దుర్యోధన పాత్రను చూడగానే, తాను 'రారాజు' చిత్రనిర్మాణాన్ని నిలిపేశారు రంగారావు. ఆ తరువాత యన్టీఆర్, యస్వీఆర్ మధ్య దూరం ఏర్పడింది.


యన్టీఆర్ మాత్రం ఎప్పటిలాగే తన సొంత చిత్రాల్లో యస్వీఆర్ ను నటింప చేయాలని ఆశించారు. కానీ, రంగారావు ఎందువల్లో అంగీకరించలేదు. అలా "ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం" చిత్రాల్లో ప్రధాన భూమికలు యస్వీఆర్ కే ఇవ్వాలని రామారావు భావించినా, రంగారావు డేట్స్ లేవన్నారు. దాంతో ఆ పాత్రల్లో నాగభూషణంను నటింప చేశారు రామారావు. అలా పలు చిత్రాల్లో నాగభూషణంను ప్రోత్సహిస్తూ సాగారు యన్టీఆర్. దాంతో నాగభూషణం కేరెక్టర్ యాక్టర్స్ లో స్టార్ అయిపోయారు. రంగారావు కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకొనే స్థాయికి ఎదిగారు. 1969లో యన్టీఆర్ 11 చిత్రాలలో, 1970లో 10 సినిమాల్లో అభినయించినా ఒక్క సినిమాలోనూ యస్వీఆర్ కనిపించక పోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యన్టీఆర్ సొంత చిత్రం 'శ్రీకృష్ణ సత్య'లో గురువుగారి కోసం అన్నట్టు యస్వీఆర్ మైరావణ, దుర్యోధన పాత్రల్లో కనిపించారు. అలాగే యన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన 'శ్రీకృష్ణవిజయము'లోనూ మహోదర, కాలయవన పాత్రల్లో యస్వీఆర్ నటించారు. ఈ రెండు సినిమాల తరువాతే మళ్ళీ యన్టీఆర్, యస్వీఆర్ మధ్య సయోధ్య కుదిరింది. దాంతో "శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, డబ్బుకు లోకం దాసోహం, దేవుడు చేసిన మనుషులు, పల్లెటూరి చిన్నోడు" వంటి చిత్రాలలో యన్టీఆర్, యస్వీఆర్ కలసి నటించారు.

యన్టీఆర్, ఏయన్నార్ మధ్య పొరపొచ్చాలు వచ్చినా ఒకరిమాటకు ఒకరు విలువనిచ్చేవారు. అదే తీరున యస్వీఆర్ సైతం పరిశ్రమ అభివృద్ధికి యన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలియగానే దానిని బలపరిచేవారు. అలా టీ కప్పులో తుఫానులా మధ్యలో పొరపొచ్చాలు తలెత్తినా యన్టీఆర్, యస్వీఆర్ అనుబంధం మాత్రం చెక్కుచెదరకుండా ఒకరంటే ఒకరు గౌరవించుకుంటూనే ఉండేవారు.

Also Read: Meenakshi Chaudhary: సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి

Also Read: Jyothi Purvaj: కిల్లర్ నుండి జ్యోతి పూర్వజ్ రక్తిక లుక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 26 , 2025 | 07:12 PM