Meenakshi Chaudhary: సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి
ABN , Publish Date - May 26 , 2025 | 06:27 PM
అందాల నాయిక మీనాక్షి చౌదరి నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి కానుకగా జనవరి 14న రాబోతోంది. దీంతో ఇది ఆమెకు వరుసగా మూడో సంక్రాంతి సినిమా!
సినిమా రంగంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అది ఎవరి ఊహకూ అందవు కూడా. సుశాంత్ (Susanth) హీరోగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తెలుగులో పాటు తమిళ చిత్రసీమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటి వరకూ ఎక్కువగా తెలుగు సినిమాల మీదనే కాన్సంట్రేషన్ చేసింది. నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) సినిమా విడుదల తేదీని సోమవారం మేకర్స్ ప్రకటించారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే... ఇది మీనాక్షి చౌదరికి మూడో సంక్రాంతి సినిమా!
మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య... త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నిర్మించిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ కాగా అందులో మీనాక్షి చౌదరి... మహేశ్ బాబు మరదలు పాత్రను చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమాను మీనాక్షి అంగీకరించింది కానీ కారణాలు ఏవైనా... ఆమె పాత్రను బాగా కుదించేశారనే తెలిసింది. అయితే... సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ రకంగా సంక్రాంతి సీజన్ లో మీనాక్షి తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఈ యేడాది 2024 సంక్రాంతికి వచ్చిన వెంకటేశ్ (Venkatesh) 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషించింది. ఇందులో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ అయినా... వెంకటేశ్ ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ గా చలాకీగా నటించి, మంచి మార్కులు కొట్టేసింది మీనాక్షి చౌదరి. ఈ మూవీతో సంక్రాంతి సీజన్ లో మరో విజయాన్ని ఆమె తన కిట్ లో వేసుకుంది.
ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే నిర్మిస్తున్న 'అనగనగా ఒక రాజు' మూవీ 2026 సంక్రాంతికి రాబోతోంది. అంటే 2024, 2025, 2026... వరుసగా మూడు సంవత్సరాలలోనూ సంక్రాంతి సినిమాల్లో మీనాక్షి ప్రెజెన్స్ ఉందన్న మాట. ఇంకో విశేషం ఏమంటే... 'అనగనగా ఒక రాజు' సినిమాలో మొదట శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. 'గుంటూరు కారం'లో శ్రీలీల హీరోయిన్ కాగా అప్రధానమైన పాత్రను మీనాక్షి చేసింది. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'లో శ్రీలీల ప్లేస్ ను మీనాక్షి భర్తీ చేసి, సోలో హీరోయిన్ గా జనం ముందుకు వస్తోంది. 'అనగనగా ఒక రాజు' కూడా హిట్ అయితే... మీనాక్షి చౌదరి ఈ సీజన్ లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టినట్టు అయిపోతుంది.
Also Read: Jyothi Purvaj: కిల్లర్ నుండి జ్యోతి పూర్వజ్ రక్తిక లుక్
Also Read: Naveen Polishetty: సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి