Sobhan Babu: 50 ఏళ్ళ జీవనజ్యోతి
ABN , Publish Date - May 16 , 2025 | 03:05 PM
నటభూషణ శోభన్ బాబు కెరీర్ లో వసూళ్ళ పరంగా తొలి బిగ్ హిట్ మూవీ 'జీవనజ్యోతి'. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'జీవనజ్యోతి' మే 16తో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
నటరత్న యన్టీఆర్ తో ఆరంభమైన డి. వి. యస్. ప్రొడక్షన్స్ (DVS Productions) సంస్థ ఆయనతో వరుసగా "మంగమ్మ శపథం (Mangamma Sapadham), పిడుగు రాముడు (Pidugu Ramudu), తిక్కశంకరయ్య (Thikka Sankarayya), గండికోట రహస్యం (Gandikota Rahasyam), చిన్ననాటి స్నేహితులు (Chinnanaati Snenithulu), ధనమా దైవమా (Dhanama Daivama)" వంటి జనరంజక చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ అధినేత డి.వి.యస్. రాజు (DVS Raju) ముందుగా కె. విశ్వనాథ్ (K Vishwanadh) దర్శకత్వంలో 'చిన్ననాటి స్నేహితులు' (Chinnanati Snehitulu) నిర్మించారు. ఆ తరువాత శోభన్ బాబు (Sobhanbabu), వాణిశ్రీ (Vanisri) జంటగా విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమే 'జీవనజ్యోతి' (Jeevana Jyothi). ఈ చిత్రానికి కె. రామలక్ష్మి (K Ramalaxmi) మూలకథను అందించగా, దానికి కె. విశ్వనాథ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు... 1975 మే 16న విడుదలైన 'జీవనజ్యోతి' అనూహ్య విజయం సాధించింది... శోభన్ బాబు కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచింది 'జీవనజ్యోతి'... 1975 బ్లాక్ బస్టర్ గానూ 'జీవనజ్యోతి' వెలిగింది.
పండిన మదర్ సెంటిమెంట్!
'మదర్ సెంటిమెంట్'తో రూపొందిన చిత్రం 'జీవనజ్యోతి'... తన తోడికోడలు కొడుకును సొంతకొడుకులా లాలిస్తూ సాగిన హీరోయిన్ ఆ బాబు మరణంతో పిచ్చిదవుతుంది... తరువాత ఆమె కన్నకూతురు కొడుకు కూడా అచ్చు ఆ బాబులాగే ఉండడంతో ఆ పిల్లాడిని చూసి మామూలు మనిషి అవుతుంది. తల్లి కోసం కూతురు చేసిన త్యాగంతో 'జీవనజ్యోతి' ముగుస్తుంది. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య, రాజబాబు, సత్యనారాయణ, శుభ, నిర్మలమ్మ తదితరులు నటించారు.. సముద్రాల జూనియర్ మాటలు సమకూర్చిన ఈ సినిమాకు సి.నారాయణరెడ్డి, కొసరాజు పాటలు పలికించారు. కేవీ మహదేవన్ స్వరకల్పన చేసిన పాటలన్నీ విశేషాదరణ చూరగొన్నాయి. 'జీవనజ్యోతి' ఆ యేడాది ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డుకు ఎంపికైంది. అలానే ఉత్తమ కథా రచయిత్రిగా కె. రామలక్ష్మి సైతం నంది అవార్డును అందకున్నారు.
శోభన్ బాబు జైత్రయాత్ర!
శోభన్ బాబు కెరీర్ లో 1975 సంవత్సరం మరచిపోలేని మధురానుభూతిని పంచింది. ఆ యేడాది శోభన్ నటించిన ఎనిమిది సినిమాలు రాగా, అందులో "దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, సోగ్గాడు" డైరెక్ట్ గా శతదినోత్సవాలు చూశాయి. అందులో బిగ్ హిట్ 'జీవనజ్యోతి' 12 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ సినిమా హైదరాబాద్ లో షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఆ యేడాది శోభన్ 'సోగ్గాడు' 19 కేంద్రాలలో వందరోజులు నడచినా, 'జీవనజ్యోతి' స్థాయి వసూళ్ళు చూడలేకపోయింది. అప్పటి దాకా కె. విశ్వనాథ్ కెరీర్ లోనూ 'జీవనజ్యోతి'యే బిగ్ హిట్. తరువాత 'శంకరాభరణం'తో కళాతపస్వి వసూళ్ళ వర్షాల్లో తడిశారు... 'జీవనజ్యోతి' హిట్ తరువాత శోభన్ బాబుతో డి.వి.యస్.రాజు "జీవితనౌక, కాలాంతకులు" వంటి సినిమాలు తీశారు.
Also Read: 23 Movie: 23 మూవీ రివ్యూ
Also Read: Eleven Review: నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ 'లెవెన్' ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి