Eleven Review: నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ 'లెవెన్' ఎలా ఉందంటే
ABN , Publish Date - May 16 , 2025 | 01:00 PM
నవీన్ చంద్ర.. ప్రామిసింగ్ ఆర్టిస్ట్. నటుడిగా మంచి గుర్తింపు ఉంది. వరుస చిత్రాలు చేస్తున్నా సరైన విజయం అందుకోలేకపోతున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఆలోచించే ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ పడి చాలా కాలమైంది. అయన హీరోగా ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన 'లెవెన్' చిత్రం హిట్ అందుకుందా? నవీన్ చంద్ర ఖాతాలో సక్సెస్ పడిందా అన్నది చూద్దాం.
సినిమా రివ్యూ: లెవెన్ (Eleven movie Review )
విడుదల తేది: 16-5-2025
నవీన్ చంద్ర(Naveen Chandra).. ప్రామిసింగ్ ఆర్టిస్ట్. నటుడిగా మంచి గుర్తింపు ఉంది. వరుస చిత్రాలు చేస్తున్నా సరైన విజయం అందుకోలేకపోతున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఆలోచించే ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ పడి చాలా కాలమైంది. అటు సినిమా, ఇటు ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రయత్న లోపం లేకుండా ముందుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'లెవెన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. తమిళ దర్శకుడు లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగెటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ అందుకుందా? నవీన్ చంద్ర ఖాతాలో సక్సెస్ పడిందా అన్నది చూద్దాం. (Reya Hari)
కథ: (Eleven movie Review
అరవింద్ (నవీన్ చంద్ర) విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తుంటాడు. డిపార్ట్‌మెంట్‌లో స్మార్ట్ పోలీస్‌గా గుర్తింపు ఉంటుంది. నగరంలో వరుస హత్యాలు జరుగుతుంటాయి. ఆ కేసుల్ని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దాంతో ఆ డ్యూటీ అరవింద్ తీసుకుంటాడు. అయినా సరే, హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. హంతకుడే కాదు.. హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎక్కడా దొరకవు. ఆరో మరణం దగ్గర ఓ చిన్న ఆధారం దొరుకుతుంది. దానిని బట్టి కేసులో కదలిక వస్తుంది. హత్యకు గురైన వాళ్లు ఎవరో ఒక్కొక్కరుగా తెలుస్తుంటారు. హత్యలు చేసేది ఎవరనేది మాత్రం తెలీదు. మరి అరవింద్ ఆ హంతుకుడిని పట్టుకున్నాడా? అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి? ట్విన్ బర్డ్ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ కథలో బెంజిమన్ పాల్, ఫ్రాన్సిస్ ఎవరు? అన్నది కథ.
విశ్లేషణ: (Naveen Chandra's Eleven movie Review)
వరుసగా ఆరు హత్యలు.. ఎవరు చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. ముసుగు ధరించిన హంతుకుడికి, హత్యకు గురైన వారికి సంబంధం ఏంటి? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ కథ ఏంటి అన్నది సింపుల్‌గా సినిమా ఇతివృత్తం. ఉత్కంఠ రేక్తెతించే క్రైమ్ కథకు కావలసిన అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దానిని తెరపై కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తేనే థ్రిల్లర్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక్కడ అది పూర్తి స్థాయిలో జరగలేదు. సీరియల్ మర్డర్స్, దాని వెనుక మాస్టర్ మైండ్, అతనెవరో పట్టుకోవడానికి పోలీస్ ప్రయత్నాలు.. ఈ తరహా కథలు తెరపై కోకొల్లలుగా వచ్చాయి. మొదటి 20 నిమిషాల కథ, తెరపై చూపించిన విధానం కూడా పాతగానే ఉంటుంది. మెరుపులు ఏమీ కనిపించవు. ఈ కేసు అరవింద్ చేత ఈ కేసు బాధ్యతల్ని అరవింద్ (నవీన్ చంద్ర) చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. హత్యలు చేస్తున్నది, హత్యకు గురవుతున్నది ఎవరో కనిపెట్టడం అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ముందు, ఆ తర్వాత సన్నివేశాలు సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళ్తాయి. ఆరుగురు కవలలు, ఓ స్కూల్, దాని వెనకున్న కథ అంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. డ్రైవ్ కూడా ఎక్కడా విసుగు లేకుండా ఉంటుంది. ట్విస్ట్‌లు, టర్న్‌లు కథ చివరి వరకూ గ్రిప్పింగ్‌గా కొనసాగుతాయి. హంతకుడు వరుస హత్యలు చేయడం వెనుకున్న కథ, ఫ్లాష్‌బ్యాక్ భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ తెలిశాక హంతుకుడు చేసేది కరెక్టే అని భావన కలిగేలా ఉంటుంది. ఆ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. అయితే ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని సన్నివేశాల్లో ఎఫెక్ట్ మిస్ అయింది. ట్విస్ట్‌లను క్యారీ చేసిన దర్శకుడు క్రైమ్ సీన్స్‌లో ప్రేక్షకుడిగా పూర్తిగా లీనం చేయలేకపోయాడు. అయితే వాటిపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే, అవుట్‌పుట్ నెక్ట్స్ లెవల్ అన్నట్లు ఉండేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఎక్కడా లాజిక్ ఉండదు. కానీ ఆ లాజిక్ లేదు అన్న భావన ఎందుకు కలిగిందో చివరకు తెలుస్తుంది. హీరో నవీన్‌కు, హీరోయిన్ రేయాకు మధ్య లవ్ డ్రామా బలవంతంగా పెట్టిన భావన కలుగుతుంది.
ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో నవీన్ చంద్ర సీరియస్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందులోనూ ఎక్కువ పోలీస్ పాత్రలే. అలవాటు అయిన జానర్ కాబట్టి పోలీస్‌గా తన సత్తా చాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తన నటనతో మార్క్ చూపించాడు. అది సినిమాకు ప్లస్‌గా అనుకోవచ్చు. హీరోయిన్‌గా నిర్మాత రియా హరి కనిపించారు. ఆ పాత్ర సోసోగా ఉంది. కొత్త ఆర్టిస్ట్ కావడంతో అంత ప్రభావం చూపించలేదు. కథలో కీలకమైన ఆ పాత్రకు కాస్త నోటిఫై అయిన ఆర్టిస్ట్‌ను తీసుకుంటే బావుండేది. ఇతర పోలీస్ ఆఫీసర్లుగా శశాంక్, దిలీపన్, ఆడుకాలం నరేన్ న్యాయం చేశారు. స్కూల్ ప్రిన్స్‌పాల్‌గా కథకు కీలకమైన పాత్రలో సీనియర్ నటి అభిరామి మెప్పించారు. రవివర్మ, కిరీటి కాసేపు కనిపించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కావలసిన సంగీతం అందించారు సంగీత దర్శకుడు డిఇమ్మాన్. ఆర్‌ఆర్ కూడా గుర్తు పెట్టుకునేలా ఉంది. కార్తిక్ అశోక్ కెమెరా పని తీరు ఆకట్టుకుంది. విజువల్‌గా సినిమా గ్రాండ్‌గా ఉంది. నిర్మాతలు అజ్మల్ ఖాన్, రేయా హరి ఎక్కవ కాంప్రమైజ్ కాలేదు. ఎడిటర్ శ్రీకాంత్ ఎన్‌బి సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫస్టాఫ్‌లో స్ర్కీన్‌ప్లే కన్నా సెకెండాఫ్ గ్రిప్పింగ్‌గా ఉంది. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. కానీ దర్శకుడు తిప్పిన మలుపులు ఆసక్తికరంగా అనిపించింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను దర్శకుడు బాగా రాసుకున్నాడు. అసలు సినిమాపై ఇంట్రెస్ట్ కలగించింది అదే. ఫైనల్‌గా హంతకుడు ఎవరనేది ఓ ఐడియా వచ్చాక కూడా లాస్ట్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం హైలైట్‌గా చెప్పవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే కాస్త లాజిక్ మీద దృష్టి పెట్టి, క్రైమ్ సీన్స్‌ని, ఇన్వెస్టిగేషన్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించి ఉంటే మంచి థ్రిల్లర్‌గా నిలిచేది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే ఆస్వాదించవచ్చు.
ట్యాగ్‌లైన్: రివేంజ్ మర్డర్ మిస్టరీ విత్ ఎమోషన్స్
రేటింగ్: 2.5/5