23 Movie: 23 మూవీ రివ్యూ
ABN , Publish Date - May 16 , 2025 | 02:37 PM
'మల్లేశం', '8 ఎ.ఎం. మెట్రో' చిత్రాల దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా సినిమా 'ఇరవై రెండు'. చిలకలూరి పేట బస్సు దహనం కేసు నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
భార్య, భర్త ఇద్దరూ సమానమే కానీ భర్త కాస్త ఎక్కువ సమానం అని ముళ్ళపూడి వెంకట రమణ (Mullapudi Venkata Ramana) చమత్కరించేవారు. అలానే చట్టం దృష్టిలో అందరూ సమానమే... కానీ కొందరు ఎక్కువ సమానం అని చెప్పుకోనే సంఘటనలు, తీర్పులు కొన్నింటిని మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఉన్నత వర్గాల వారికి సంబంధించిన తీర్పులలో చూపించే ఔదార్యం కోర్టులు అట్టడుగు వర్గాల వారి పట్ల చూపడటం లేదని కొందరు వాదిస్తూ ఉంటారు. అలాంటి వాదనను బలపరిచే విధంగా తెరకెక్కిన సినిమానే '23' (Iravai Moodu). గడిచిన మూడు దశాబ్దాలలో తెలుగు నేలపై జరిగిన మూడు దుర్ఘటనలను కంపేర్ చేస్తూ రాజ్ రాచకొండ ఈ చిత్రాన్ని తీశారు.
గతంలో 'మల్లేశం' (Mallesam) బయోపిక్ ను తెలుగులోనూ, '8 ఎ.ఎం. మెట్రో' (8 A.M. Metro) మూవీని హిందీలోనూ రాజ్ రాచకొండ (Raj Rachakonda) రూపొందించారు. ఇప్పుడు 1993లో చిలకలూరి పేట బస్సు దహనం సంఘటన నేపథ్యంలో '23' సినిమాను రాజ్ దర్శకత్వంలో స్టూడియో 99 సంస్థ నిర్మించింది. దీనికి వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దగ్గుబాటి రానా (Daggubati Rana) కు చెందిన స్పిరిట్ మీడియా ఈ మూవీని పంపిణీ చేసింది.
కథ కమామీషు!
కథ విషయానికి వస్తే... చిలకలూరి పేటలో ఉండే సాగర్ (తేజ) ఉద్యోగపరంగా ఎదురైన చేదు అనుభవంతో ఇక మీదట సొంతంగా ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలని అనుకుంటాడు. గవర్నమెంట్ నుండి ఆర్థిక సాయం కోసం మధ్యవర్తులకు లంచం కూడా ఇస్తాడు. కానీ వాళ్ళు రేపు, ఎల్లుండి అంటూ తిప్పిస్తుంటారు. అదే సమయంలో తమ ఇంటి దగ్గర్లోనే ఉండే సుశీల (తన్మయి)తో అతను ప్రేమలో పడతాడు. తల్లి లేని సుశీలకు సాగర్ అంటే పిచ్చి ప్రేమ. ఎప్పుడెప్పుడు సాగర్ తో కొత్త జీవితం ప్రారంభిద్దామా అని ఎదురు చూస్తుంటుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన సన్నిహిత బంధం కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. పెళ్ళి చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని తెలిసిన సాగర్... తన స్నేహితుడు దాసు (పవన్ రమేశ్) చెప్పిన ఓ సలహాను పాటిస్తాడు. హైదరాబాద్ (Hyderabad) నుండి చిలకలూరి పేట వస్తున్న బస్సు ను అడ్డగించి, అందులో పెట్రోల్ పోసి తగల పెడతామని ప్రయాణీకులను బెదిరించి, వారి నుండి డబ్బులు గుంజుకోవాలని వీరిద్దరు ప్లాన్ చేస్తారు. అయితే వారి పథకం విఫలమై... చివరకు బస్సు తగలబడిపోతుంది. ఆ ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 23 మంది సజీవ దహనం అయిపోతారు. వీరిద్దరూ ప్రాణాలతో బయట పడతారు.
నిజానికి అసలు కథ ఇక్కడ నుండే మొదలవుతుంది. చేసిన తప్పు ఒప్పుకున్న వీరిద్దరికీ ఉరిశిక్ష విధిస్తుంది కోర్టు. పైన కోర్టులు సైతం ఈ తీర్పునే బలపరుస్తాయి. చివరకు రాష్ట్రపతి క్షమాభిక్షకు సైతం వీరు నోచుకోరు. అయితే... కొన్నేళ్ళ తర్వాత తెల్లవారితే వీరిని ఉరితీస్తారనగా... ఓ ఊహించని పరిణామంతో అది కాస్త ఆగిపోతుంది. ఉరిశిక్ష నుండి వీరు జీవిత ఖైదీలుగా మారతారు. అప్పటి నుండి ఏళ్ళ తరబడి జైలులోనే మగ్గుతూ ఉంటారు. ఇక్కడే ఈ చిత్ర రచయిత రంగావఝ్ఝల భరద్వాజ, దర్శకుడు రాజ్ రాచకొండ ఓ కీలకమైన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. చుండూరు (Chunduru) మారణకాండలోనూ, జూబ్లీ హిల్స్ (Jubilee Hills) కారు బాంబు ప్రేలుడు లోనూ నేరస్థులుగా శిక్షను అనుభవించిన వారు... చట్టంలోని లొసుగుల కారణంగానూ, అధికారంలోని వారి మెడలు వంచీ... జైలు నుండి బయటకు వచ్చేశారని, కానీ చిలకలూరి పేట బస్సు దహనం కేసు లోని నేరస్థులు అలా బయటకు రాలేకపోయారని వాపోయారు. అంటే చట్టం దృష్టిలో అందరూ సమానం కాదని, కొందరికి చట్టం చుట్టమని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే... 23 మంది సజీవ దహనానికి కారణమైన ఇద్దరు నేరస్థుల కోణం లోంచి వీరు కథను చూపడంతో ఇదంతా ఏకపక్షంగా సాగిపోయింది. నిజానికి చనిపోయిన ఇరవై మూడు మంది వ్యక్తుల కుటుంబ సభ్యులను కదిలించి, వారి కథలను సినిమాగా తెరకెక్కిస్తే... ఎలా ఉండేదో!?
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇందులో నటీనటులు చాలా మంది కొత్తవారు. అయినా తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. తేజ (Teja), తన్మయి (Tanmayi) చాలా చక్కగా తమ పాత్రలను పోషించారు. పవన్ రమేశ్... దాసు పాత్రలో లీనమైపోయాడు. తాగుబోతు రమేశ్ (Thagubothu Ramesh), ఝాన్సీ (Jhansi), ప్రణీత్, వేదవ్యాస్ వంటి వారు పాత్రోచితంగా చేశారు. పరిమితమైన బడ్జెట్ లో సహజత్వానికి దగ్గరగా సినిమాను తీశారు. మార్క్ కె రాబిన్ (Mark K Robin) స్వరపర్చిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. చంద్రబోస్ (Chandrabose), రెహమాన్, సింధు మార్టిన్ పాటలకు సాహిత్యాన్ని సమకూర్చారు. ఇండస్ మార్టిన్ సంభాషణలు అర్థవంతంగానూ, ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది.
ఎలా ఉందంటే...
ఓ మూడ్ లో సినిమా చూసినప్పుడు కథకుడు, దర్శకుడి వాదనలో నిజం ఉందనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. జైలు జీవితం గడిపే క్రమంలో ఆ ఇద్దరు నేరస్థులలో వచ్చిన మార్పులకు ప్రేక్షకులలో ఓ రకమైన సానుభూతి ఏర్పడుతుంది. ఇలాంటి వారు ఇంకా జైలులో మగ్గిపోవడం సబబు కాదనిపిస్తుంది. కానీ ఇదే తరహా వేరే కేసులలో తెలివిగా నేరస్థులు తప్పించుకున్నారు కాబట్టి ఈ కేసులోని నేరస్థులను సైతం క్షమించమని డిమాండ్ చేయడం ఏ రకంగా సమంజసం కాదు. 23 మంది అమాయక ప్రాణులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం సజీవ దహనం చేసిన వారిని ఏ విధంగా జైలు నుండి తప్పించాలని కోరగలరు!? పైగా జైలు నిబంధనల కారణంగా ఇంకా వారు ఖైదీలుగా ఉన్నారు తప్పితే మరొకటి కాదు. దానికి సామాజిక వర్గాన్ని ముడిపెట్టి చూడటం, కోర్టులు ఆ రకంగానే చూస్తున్నాయని ఆరోపణలు చేయడం సబబుగా అనిపించదు. తెర మీద కనిపించే ఇద్దరు నేరస్థుల పట్ల మనకు సానుభూతి కలుగుతున్నా... మనసు లోపల ఎక్కడో... మరి అమాయకంగా అసువులు బాసిన ఆ 23 మంది సంగతి ఏమిటనే ప్రశ్న తొలిచి వేస్తుంది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: నాణానికి మరో వైపు!
Also Read: Eleven Review: నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ 'లెవెన్' ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి