సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: మరో సినీ రచయిత మృతి...

ABN, Publish Date - Oct 03 , 2025 | 02:52 PM

ప్రముఖ రచయిత లల్లాదేవి కన్నుమూశారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. 'కదలివచ్చిన కనకదుర్గ', 'శ్వేతనాగు' చిత్రాలు లల్లాదేవి నవల ఆధారంగానే రూపుదిద్దుకున్నాయి.

Writer Lalladevi

'లల్లాదేవి' (Lalladevi) పేరుతో పలు కథలు, నవలలు రాసిన పరుచూరి నారాయణాచార్యులు (Paruchuri Narayanacharyulu) అక్టోబర్ 3వ తేదీ తెల్లవారు ఝామున కన్నుమూశారు. ఆయనకు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1980 దశకంలో తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధులైన రచయితల్లో లల్లాదేవి కూడా ఒకరు. ఆయన రాసిన పలు నవలలు ముందు సీరియల్స్ గా వచ్చాయి. చారిత్రక, జానపద, సాంఘిక రచనలు చేయడంతో ఆయన దిట్ట. పాములపై పరిశోధన చేసిన ఏకైక రచయితగా ఆయనకు పేరు. పలు తెలుగు సినిమాలకు కూడా రచయితగా ఆయన పనిచేశారు.


బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'కరుణించిన కనకదుర్గ' (Karuninchina Kanaka Durga) కు లల్లాదేవి కథను అందించారు. కృష్ణా పుష్కరాల దృష్టిలో పెట్టుకుని జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రంగా విఠలాచార్య (B. Vithalacharya) దీన్ని మలిచారు. కె. ఆర్. విజయ (K.R. Vijaya) ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించగా, శ్రీనివాస వర్మ (Srivivasa Varma), యమున (Yamuna) జంటగా నటించారు. 1992లో వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ (Satyanand) సంభాషణలు రాశారు. బి. విఠలాచార్య చిత్రానికి సత్యానంద్ మాటలు రాసిన ఏకైక చిత్రమిదే. ఈ సినిమాను చలసాని వెంకటేశ్వరరావు నిర్మించారు. అలానే లల్లాదేవి రాసిన ప్రముఖ నవల 'శ్వేతనాగు' (Swethanagu) ఆధారంగా సి.వి. రెడ్డి (CV Reddy)... సంజీవ దర్శకత్వంలో 'శ్వేతనాగు' పేరుతోనే సినిమా నిర్మించారు. ఇది సౌందర్య (Soundarya) నటించిన 100వ చిత్రం. ఇందులో అబ్బాస్ (Abbas) హీరోగా నటించాడు. లల్లాదేవి 'శ్వేతనాగు' నవల సినిమాగా రూపుదిద్దుకున్నప్పుడు తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NT Ramarao) కి పరుచూరి నారాయణాచార్యులు అత్యంత సన్నిహితులు. కొంతకాలం ఆయన దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 'లల్లాదేవి' మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశారు. 'లల్లాదేవి' స్వగ్రామం గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డవారిపాలెం. ఆయన కొన్ని వందల కథలు, నవలలు, నాటికలు, నాటకాలు రాశారు.

Also Read: New OTT Movies: వారం మ‌ధ్య‌లో.. కొత్తగా ఓటీటీకి వ‌చ్చిన సినిమాల జాబితా

Also Read: Tom Cruise Ana de Armas: ముచ్చ‌ట‌గా.. టామ్ క్రూజ్‌ నాలుగో పెళ్లి! లేటు వ‌య‌సులో.. 'ఘాటు' భామ‌తో ప్రేమ‌

Updated Date - Oct 03 , 2025 | 02:52 PM