Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం
ABN , Publish Date - May 21 , 2025 | 03:10 PM
ప్రముఖ సినీ గీత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి 70వ జయంతి అనకాపల్లిగా ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా సిరివెన్నెల స్మారక పురస్కారాన్ని ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రికి అందచేశారు.
ప్రముఖ గీత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్గీయ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sasrty) 70వ జయంతి మే 20న అనకాపల్లిలోని సత్యాస్ లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మాజీ మంత్రి, శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రాప్రగడ రామకృష్ణ, సత్యారావు మాస్టర్, సీతారామశాస్త్రి సోదరులు శ్రీరామశాస్త్రి, సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సీతారామశాస్త్రి చిన్న తమ్ముడు వెంకట శాస్త్రి సభకు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో చెంబోలు శ్రీరామశాస్త్రి తన సోదరుడు సీతారామశాస్త్రిలోని తాత్త్వికతను తెలియచేస్తూ రాసిన 'మనిషికి మరమ్మతు' పుస్తకాన్ని కొణతాల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సీతారామశాస్త్రి గొప్ప గీత రచయిత మాత్రమే కాదని, దేశభక్తి కలిగిన వ్యక్తి' అని కొనియాడారు. ఆయన తన రచనల ద్వారా సమాజాన్ని తట్టి లేపేవారని, అలాంటి గొప్ప వ్యక్తి అనకాపల్లిలో పుట్టడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని అన్నారు. వచ్చే యేడాది నాటికి తానా సభ్యులతో కలిసి సిరివెన్నెల కళాపీఠం తరఫున అనకాపల్లిలో సీతారామశాస్త్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం వక్తలు సీతారామశాస్త్రి రచనల గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి తెలిపారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ని 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమానికి ముందు, సీతారామశాస్త్రి 'పౌర్ణమి' సినిమా కోసం రాసిన 'భరత వేదమున...' పాటకు సురేశ్ మాస్టర్ సారధ్యంలో చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు.
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
Also Read: Mohanlal: కన్నప్ప నుంచి.. కిరాత వచ్చేశాడు
Also Read: Theater Movies: ఈ వారం.. దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే సినిమాలివే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి