Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
ABN , Publish Date - May 21 , 2025 | 01:25 PM
స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రభ ఇప్పుడు వెలిగిపోతోంది. భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా కావాలని శ్రద్థ ఇప్పుడు డిమాండ్ చేస్తోందట.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హవా ఇప్పుడు నడుస్తోంది. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు బాగా పోటీ పడుతున్నారు. కొందరైతే ఆమెతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి స్క్రిప్ట్స్ సిద్థం చేస్తున్నారు. ఇంకొందరైతే రెమ్యూనరేషన్ ఎంతైన ఇచ్చి... ఆమెను తమ సినిమాలో నటింప చేయాలని తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే... ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor) కు శ్రద్ధా కపూర్ హ్యాండిచ్చిందని తెలుస్తోంది.
'తుంబాడ్' (Tumbaad) సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న రాహీ అనిల్ బార్వే (Rahi Anil Barve) తో ఏక్తా కపూర్ ఒక సినిమా ప్లాన్ చేసింది. హారర్ థ్రిల్లర్ మూవీ 'తుంబాడ్' మొదటిసారి విడుదలైనప్పుడు పెద్దంత లాభాలు తెచ్చిపెట్టలేదు కానీ రీ-రిలీజ్ ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. దాంతో రాహీ అనిల్ బార్వే దర్శకుడిగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ఏక్తా ఓ మూవీని నిర్మించాలని భావించింది. ఫిల్మ్ మేకర్ రాహీ అంటే అభిమానం ఉన్న శ్రద్థ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 'స్త్రీ -2' (Stree -2) మూవీ ఓవర్ ఆల్ గా రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన నేపథ్యంలో శ్రద్ధా కపూర్ రెమ్యూనరేషన్ అంబరాన్ని తాకుతోంది. దానికి తగ్గట్టుగానే ఏక్తా కపూర్ రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్థపడిందట. అయితే శ్రద్థ ఆ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లోనూ వాటా అడిగే సరికీ ఏక్తా తలతిరిగిపోయిందట. హీరోయిన్ శ్రద్థకే అంత రెమ్యూనరేషన్, లాభాల్లో వాటి ఇస్తే... ఇక మేకింగ్ కు ఎంత ఖర్చుపెట్టాలో కదా! అనే సందేహంలో పడిందట. ఈ గ్యాప్ లో శ్రద్థ తాను ఈ సినిమా చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మేకర్స్ వేరే హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడ్డారని అంటున్నారు.
రెమ్యూనరేషన్ కారణంగా శ్రద్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందనే దావానలంలా వ్యాపించడంతో మేకర్స్ దిద్దుబాటు చర్చలు మొదలు పెట్టారు. శ్రద్ధ ఈ ప్రాజెక్ట్ లో ఉందో? లేదో నిర్థారణ చేయకుండా దర్శకుడు రాహీ అనిల్ బార్వే... 'తొందపడి ఓ నిర్ణయానికి రావద్దని, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవసరం అయినప్పుడు తామే మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇస్తామ'ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. శ్రద్థ నటిస్తోందా? లేదా? ఈ విషయం చెప్పకుండా దర్శకుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడంటే... ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టే కదా! అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా... శ్రద్ధా కపూర్ తనకొచ్చిన పాత్రలకంటే... ఇవ్వబోతున్న రెమ్యూనరేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతోందన్నది అర్థమైపోతోంది.
Also Read: Mohanlal: కన్నప్ప నుంచి.. కిరాత వచ్చేశాడు
Also Read: Theater Movies: ఈ వారం.. దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే సినిమాలివే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి