National Awards: ప్రతిభావంతులకు అన్యాయంపై విమర్శ
ABN, Publish Date - Aug 02 , 2025 | 03:59 PM
ప్రతి యేటా నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ప్రకటించిన వెంటనే విమర్శలు గుప్పుమనడం పరిపాటి. షరా మామూలే అన్నట్టు ఈ సారి కూడా కొన్ని అవార్డులపై విమర్శలు వినిపిస్తున్నాయి. అవేంటో మరి...
ఆగస్ట్ 1వ తేదీన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను (71st Nationala Film Awards) ప్రకటించారు. ఎప్పటిలాగే అవార్డ్స్ వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేయగా, ఆశించి నిరాశ చెందిన వారు విమర్శలు సంధించారు. ఉత్తమనటి, ఉత్తమ నటుడు విభాగాల్లోనూ కొందరికి అన్యాయం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే'లో నటించిన రాణీ ముఖర్జీ (Rani Mukerji) కంటే ఎంతో చలాకీగా 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'లో నటించిన అలియా భట్ (Alia Bhatt) కు అన్యాయం జరిగిందని కొందరి మాట. అలాగే 'ట్వల్త్ ఫెయిల్'లో హీరో కంటే బాగా నటించిన నాయిక మేధాకు అవార్డు రాకపోవడం విచారకరమనీ భావిస్తున్నారు. ఇక ఉత్తమ నటుడు విభాగంలో 'అనిమల్' (Animal) హీరో రణబీర్ కపూర్ (Ranabir Kapoor) కు, 'ఆడు జీవితం- గోట్ లైఫ్'తో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కు కూడా న్యాయం జరగలేదని కొందరి వాదన. వీరిద్దిరి కంటే అన్యాయమై పోయింది 'శ్యామ్ బహదూర్' పాత్రలో జీవించిన విక్కీ కౌశల్ (Vicky Kaushal) అని మరికొందరి మాట.
అప్పటి దానికి ఇప్పుడు న్యాయం...
ఉత్తమనటునిగా ఎన్నికైన షారుఖ్ ఖాన్ ను చూసి ఆయన అభిమానులు ఆనందంతో ఏమీ పొంగిపోవడం లేదు. ఎందుకంటే తమ హీరో 'జవాన్'లో ఎంత బాగా నటించినా, 'ట్వల్త్ ఫెయిల్' హీరో విక్రాంత్ మస్సే అనే కొత్తనటుడితో పాటు బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును పంచుకోవడం ఫ్యాన్స్ కు విచారం కలిగిస్తోంది. ఎన్నో చిత్రాలలో షారుఖ్ ఖాన్ ఇంతకంటే బాగా నటించినా, అప్పట్లో ఆయనకు స్టార్ హీరో అన్న కారణంగా అవార్డులు ఇవ్వలేదని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అలాగే 'బ్లాక్' సినిమాలో భలేగా నటించిన రాణీముఖర్జీకి అప్పట్లో అవార్డు లభించక పోగా, ఇప్పుడు 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' ద్వారా ఆ కొరత తీర్చడం గమనార్హమనీ కొందరు నొక్కి వక్కాణిస్తున్నారు.
మరికొందరికి ఇంతకు ముందు అవార్డులు వచ్చిన కారణంగా వారు 2023లో ఎంత బెస్ట్ పెర్ ఫామెన్స్ ఇచ్చినా, వారికి అన్యాయమే జరిగిందనీ కొందరి వాదన. 2018లో 'యురి- ద సర్జికల్ స్ట్రైక్' సినిమాతో విక్కీ కౌశల్ కు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డు దక్కింది. అప్పుడు మరో నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా అదే విభాగంలో అవార్డు అందుకున్నారు. అందువల్లే ఈ సారి కూడా మరో నటునితో కలిపి విక్కీ కౌశల్ కు 'శ్యామ్ బహదూర్' ద్వారా అవార్డు వస్తుందని పలువురు భావించారు. అలాగే 'గంగూబాయ్'తో 2021లో అలియా భట్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. అప్పుడు కూడా మరో నటి కృతి సనన్ తో కలసి ఆ అవార్డును పంచుకోవడం గమనార్హం. అలా విక్కీ, అలియా ఇద్దరికీ ఈ సారి న్యాయం జరగలేదనే అంటున్నారు. ఒకసారి అవార్డులు ఇచ్చిన వారికి మళ్ళీ మళ్ళీ అవార్డులు ఇవ్వకూడదన్న రూల్ ఏమైనా ఉందా అనీ ప్రశ్నిస్తున్నారు. తనకు రాకపోయినా తన భర్త రణబీర్ కపూర్ కు 'అనిమల్' ద్వారా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అలియా ఆశించారట. కానీ, నిరాశే మిగిలింది. పైకి చెప్పడం లేదు కానీ, చాలా విభాగాల్లోనూ ఎందరో అవార్డులు ఆశించి నిరాశ చెందారు. వాళ్ళు మెల్లగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతారేమో. ఏది ఏమైనా జనం ఇచ్చిన రివార్డులు ఈ అవార్డుల కన్నామిన్నయైనవి అని గతంలో ఎందరో చెప్పారు. ఆ మాటలనే అవార్డులు ఆశించి నిరాశ చెందిన వారు మననం చేసుకుంటే మంచిది.
Also Read: They Call Him OG First Single: సుజీత్.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా
Also Read: Sony Liv: దేవ కట్టా 'మయసభ'లో ఏం జరిగిందా...