Asia Cup Final: తిలక్ వర్మపై.. చిరంజీవి ప్రశంసల వర్షం
ABN, Publish Date - Sep 29 , 2025 | 12:31 PM
భారత్ ను విజయతీరాలవైపు నడిపిన తిలక్ వర్మను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం భారత్ టీమ్ ను అభినందించడంతో పాటు తిలక్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆదివారం రాత్రి భారత క్రికెట్ అభిమానులకు డబుల్ థమాకా! ఓ పక్క దసరా పండగను ఘనంగా జరుపుకుంటున్న వారికి... ఆసియా కప్ (Asia Cup) ను భారత్ గెలుచుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. బతుకమ్మ ఆటపాటలతో అలసి సొలసిన తెలంగాణ వాసులు సైతం అర్థరాత్రి పాక్ బౌలర్లను తిలక్ వర్మ చీల్చి చెండటం చూసి... అలపు మరచి ఆనంద హేలలో మునిగిపోయారు. తెలుగు బిడ్డ తిలక్ వర్మ (Thilak Varma) భరతమాత నుదుట తిలకంగా భాసించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాక్ తో భారత్ క్రికెట్ ఆడటాన్ని విమర్శించిన వారు సైతం క్రీడా మైదానంలోనూ పాక్ పై భారత్ అప్రతిహత విజయాన్ని అందుకోవడంతో ఆ విమర్శలను మర్చిపోయి... ఆనందపడ్డారు.
ఇదిలా ఉంటే... మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారత క్రికెట్ టీమ్ ను అభినందించారు. మరీ ముఖ్యంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మెరిసిన తిలక్ వర్మను అభినందించారు. అతనితో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో ఇది మరో సువర్ణ అధ్యాయమని చిరంజీవి పేర్కొన్నారు. పాకిస్థాన్ పై భారత్ క్రికెట్ జట్టు చూపించిన పోరాట స్ఫూర్తిని, ప్రదర్శించిన అత్యుత్తమ ప్రతిభను చిరంజీవి కొనియాడారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణమని చిరంజీవి అన్నారు.
Also Read: OTT MOVIES: ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
Also Read: Jatadhara: పెళ్ళయ్యాక మారిపోయిన సోనాక్షి...