సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni: నాన్న తమిళ చిత్రం... కొడుకు తమిళ డైరెక్టర్ తో చిత్రం...

ABN, Publish Date - Oct 08 , 2025 | 04:07 PM

అక్కినేని నాగేశ్వరరావు తన నూరవ చిత్రాన్ని తమిళంలో చేశారు. 'మనిదన్ మారవిల్లై' అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు 'గుండమ్మ కథ'కు రీమేక్. ఇక ఆయన కుమారుడు నాగార్జున తన నూరవ చిత్రాన్ని తమిళ దర్శకుడుతో చేస్తున్నాడు.

Akkineni - Nagarjuna

తండ్రి బాటలోనే తనయులు పయనించడం సర్వసాధారణం. మహానటుడు నటసమ్రాట్ ఏయన్నార్ చూపిన దారిలోనే ఆయన నటవారసుడు కింగ్ నాగార్జున పయనిస్తూ ఉంటారు. నాగ్ నూరవ చిత్రం విషయంలోనూ తండ్రి పంథాను అనుసరిస్తున్నారని చెప్పవచ్చు.

నాగార్జున నూరవ చిత్రం పూజాకార్యక్రమం ఈ మధ్యే మొదలయింది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. ప్రతిభకు పట్టం కట్టడంలో ఏయన్నార్ ఎప్పుడూ ముందుండేవారు. అదే బాటలో నాగార్జున సైతం పయనిస్తుంటారు. ఆ పయనంలోనే ఇప్పుడు తన నూరవ చిత్రానికి తమిళ డైరెక్టర్ రా కార్తిక్ ను నాగ్ ఎంచుకున్నారని తెలుస్తోంది. అప్పట్లో ఏయన్నార్ తమ అన్నపూర్ణ సంస్థ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులకు సినిమా అవకాశాలు కల్పించారు. తండ్రి బాటలోనే పయనిస్తూ నాగార్జున కూడా పలువురికి చిత్రసీమలో గుర్తింపు లభించేలా చేశారు. 2022లో తమిళ చిత్రం 'నిదమ్ ఒరు వానమ్' సినిమాతో తనదైన బాణీ పలికించారు రా కార్తిక్. అతని ప్రతిభను గుర్తించిన నాగ్, ఇప్పుడు తన నూరవ సినిమాకు కార్తిక్ ను డైరెక్టర్ గా ఎంచుకోవడం విశేషంగా మారింది.


నాగార్జున వందో సినిమాకు, ఏయన్నార్ నూరవ చిత్రానికి చిన్న పోలిక ఉంది. నాగార్జున సెంచరీ మూవీకి రా కార్తిక్ డైరెక్టర్ -ఈయన తమిళుడు. ఇక ఏయన్నార్ వందో చిత్రం 'మనిదన్ మారవిల్లై' తమిళ సినిమా. ఏయన్నార్ 'మనిదన్ మారవిల్లై'కు విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి దర్శకత్వం వహించారు. చక్రపాణికి దర్శకునిగా అదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా తెలుగు వర్షన్ 'గుండమ్మ కథ'కు కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. తెలుగులో తాము పోషించిన పాత్రలే ఏయన్నార్, జమున తమిళ 'మనిదన్ మారవిల్లై'లోనూ ధరించారు. తెలుగులో 'గుండమ్మకథ' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. అయితే తమిళ వర్షన్ 'మనిదన్ మారవిల్లై' పరాజయం పాలయింది. కానీ, చక్రపాణి దర్శకత్వంలో నటించే ఛాన్స్ మిస్ చేసుకోకూడదనే 'మనిదన్ మారవిల్లై'లో నటించానని ఏయన్నార్ చెప్పేవారు. అలా ప్రతిభకే పట్టం కట్టేవారు ఏయన్నార్.


అప్పట్లో తండ్రి ఏయన్నార్ తన నూరవ చిత్రంగా తమిళ సినిమాలో నటిస్తే, ఇప్పుడు తనయుడు నాగార్జున తన వందో సినిమాను తమిళ డైరెక్టర్ తో రూపొందిస్తూండడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుండి మొదలయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన నాగార్జున ఈ మధ్య తమిళ చిత్రాల్లోనూ నటించి అలరించారు. అందువల్ల ఆయన నూరవ సినిమా తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి దాకా తెలుగు టాప్ స్టార్స్ తమ నూరవ మైలురాయిని ఏదో ఒక భాషలోనే నటించి అలరించారు. ఒక వేళ నాగార్జున తన వందో సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినా, అదో ప్రత్యేక అంశంగా నిలవనుంది. ఏమవుతుందో చూద్దాం.

Also Read: War 2: అఫీషియల్.. వార్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే

Also Read: Rashmika Mandanna: ఆ వివాదంపైఎవరు ఏమనుకున్నా పట్టించుకోను..

Updated Date - Oct 08 , 2025 | 04:07 PM