Association of Malayalam Movie Artists: శ్వేతా మీనన్ పై కేసు...
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:13 PM
ప్రముఖ శృంగార తార శ్వేతా మీనన్ పై నాన్ బెయిలబుల్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. త్వరలో మలయాళ ఆర్టిస్టుల అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు రిజిస్టర్ కావడం చర్చనీయాంశమైంది.
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ (Shwetha Menon) పై నాన్ బెయిలబుల్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. ఆమె శృంగార చిత్రాలలో నటించడంతో పాటు యువతను ప్రేరేపించే విధంగా కండోమ్ ప్రకటనలో నటించిందని, అవి యూ ట్యూబ్స్ లో పోస్ట్ కావడంతో యువత చెడు మార్గంలో ప్రయాణించేలా ఆమె చర్యలు ఉన్నాయని ఆమెపై కేసు పెట్టారు. న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కేరళ రీజన్) జనరల్ సెక్రటరీ మార్టిన్ మేచెర్రీ ఈ కేసును ఫైల్ చేశాడు. దాంతో ఐటీ చట్టంలోని కీలకమైన సెక్షన్లకు సంబంధించిన అంశాలు ఇందులో ముడిపడి ఉంటడంతో నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు రిజిస్టర్ చేశారు.
దీనిపై శ్వేతా మీనన్ వాదన వేరే విధంగా ఉంది. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులను ఆమె వాదిస్తోంది. తాను నటించిన శృంగార చిత్రాలన్నీ చట్టప్రకారంగా సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల అయ్యాయని, తాను ఎలాంటి పోర్న్ యూ ట్యూబ్ ఛానెల్ నూ నిర్వహించడం లేదని శ్వేతా మీనన్ తెలిపింది. తన పరువు ప్రతిష్ఠలను దిగజార్చాలనే ఈ కేసును పెట్టారని ఆమె ఆరోపిస్తోంది. తాను నటించిన 'పలేరి మాణిక్యం' సినిమాకు ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందని ఆమె వాదిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి. మొన్నటి వరకు 'అమ్మ'కు అధ్యక్షులుగా ఉన్న మోహన్ లాల్ (Mohan Lal) ... హేమా కమిటీ రిపోర్ట్, దాని తదనంతర పరిణామాలతో కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇప్పుడు అధ్యక్ష పదవికి తొలుత ఆరుగురు పోటీ పడగా, చివరకు బరిలో శ్వేత మీనన్, దేవన్ మాత్రమే నిలిచారు. ఈ ఎన్నికల నేపథ్యంలో తన ప్రతిష్ఠను దిగజార్చడానికే ఈ కేసు పెట్టారని శ్వేతా మీనన్ ఆరోపిస్తోంది. అంతేకాదు... ఈ కేసు తొలగించాల్సిందిగా కోరుతూ ఆమె కేరళ హైకోర్టు లో క్వాష్ పిటీషన్ వేసింది. మరి ఈ కేసు విషయంలో కేరళ హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ 'అమ్మ' ఎన్నికల్లో శ్వేతా మీనన్ గెలిస్తే మాత్రం... ఆ పదవిని చేపట్టిన తొలి మహిళా అధ్యక్షురాలు ఆమే అవుతుంది. విశేషం ఏమంటే మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన కొత్తలోనే శ్వేతా మీనన్ తెలుగులో భానుచందర్ (Bhanuchander) సరసన 'దేశద్రోహులు' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు భాను చందరే దర్శకుడు, సంగీత దర్శకుడు!
Also Read: Meghalaya murder case: కుటుంబ సభ్యుల అంగీకారంతో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’
Also Read: Allu Arjun: మంచు లక్ష్మీని ఆటపట్టించి అల్లు అర్హ