Hollywood: రిపీట్ రన్స్ తో ఆదాయం పొందుతున్న నటీనటులు
ABN, Publish Date - Sep 27 , 2025 | 04:08 PM
కంపోజర్స్, సింగర్స్, లిరిసిస్ట్స్ కు వారి వర్క్స్ పై ప్రొడ్యూసర్స్ తో పాటు 'రాయల్టీ' వస్తుంది. మరి నటీనటులకు ఆ సదుపాయం ఉంటుందా అంటే. ఉంది - హాలీవుడ్ లో ఆ సిస్టమ్ అమలులోనూ ఉంది. మరి ఇండియాకు ఎప్పుడు వస్తుందన్నదే టాపిక్!
ఓ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధిస్తే - ఆ క్రెడిట్ ను హీరోహీరోయిన్స్, మెయిన్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ సొంతం చేసుకుంటూ ఉంటారు. నిజానికి సినిమా అన్నది 'కలెక్టివ్ వర్క్'. కేవలం ఒకరిద్దరితో అయ్యే పని కాదు- అందువల్ల ఈ సామూహిక కృషిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సక్సెస్ క్రెడిట్ దక్కాలి. అందుకే సినిమా విజయాన్ని 'సమష్టి కృషి' అంటూ ఉంటారు. అలా కలసి కట్టుగా పనిచేసిన సినిమాలను రీ-రిలీజ్ చేసినా, వేరే మాధ్యమంలో ప్రదర్శించినా నిర్మాతలకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో నటీనటులకు, టెక్నీషియన్స్ కు కూడా వాటా ఇవ్వడాన్ని 'రెసిడ్యువల్స్' అంటారు. ఈ విధానం హాలీవుడ్ లో అమలవుతోంది. ఈ మధ్య జేమ్స్ కేమరాన్ తన 'అవతార్-1'ను రీ-రిలీజ్ చేశారు. ఆ సినిమాకు పనిచేసిన వారికి ఆటోమేటిగ్గా 'రెసిడ్యువల్స్' అందుతాయి. ఆ విధానం మన దేశంలోనూ వస్తే బాగుంటుందని సీనియర్ యాక్టర్ మాధవన్ అంటున్నారు.
మన దేశంలో ఒకప్పుడు చాలామంది సినీజనానికి 'రాయల్టీ' అన్నా తెలిసేది కాదు. నిర్మాతలే తమ సినిమాల్లోని ప్రతి అంశంపై తమకే హక్కు ఉందని చాటుకొనేవారు. తద్వారా ఓ సినిమాలోని పాటలు, క్లిప్స్ ఏ రూపంలోనైనా ఉపయోగించుకుంటే సదరు నిర్మాతకు కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. దీనినే 'రాయల్టీ' అన్నారు. ముఖ్యంగా సంగీతసాహిత్యాలపై నిర్మాతలు రాయల్టీ పోగేయడం కొందరు రచయితలు, సంగీతదర్శకులు, గాయకులకు నచ్చలేదు. దాంతో పోరాటం సాగించారు. వీరికి ప్రముఖ బాలీవుడ్ రైటర్ జావేద్ అక్థర్ అండగా నిలిచారు. చివరకు విజయం సాధించారు. తత్ఫలితంగా పాటల ద్వారా నిర్మాతలు మాత్రమే రాయల్టీ పొందడం కాకుండా, గీతరచయితలు, సంగీతదర్శకులు, గాయనీగాయకులు కూడా వాటా అందుకోవడం ఆరంభమయింది. ఇప్పుడు ఇదే తీరున 'రాయల్టీ'లాంటిదే అయిన 'రెసిడ్యువల్స్' రావాలని నటీనటులు ఆశిస్తున్నారు.
నిర్మాతలకు నష్టాలు వాటిల్లిన సినిమాల ద్వారా వచ్చేదేమీ ఉండదు. కాబట్టి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన వారికే 'రెసిడ్యువల్స్' అందుకొనే వీలుంటుందని కొందరు గుర్తు చేస్తున్నారు. నటుడు మాధవన్ కూడా ఈ విషయంలో అవుననే చెబుతున్నారు. తాను నటించిన ఓ నాలుగు బ్లాక్ బస్టర్స్ తో జీవితాన్ని హాయిగా గడపగలననీ మాధవన్ అంటున్నారు. తాను నటించిన 'త్రీ ఇడియట్స్, రంగ్ దే బసంతీ, తను వెడ్స్ మను' సినిమాల ద్వారా 'రెసిడ్యువల్స్' అందుకోవచ్చుననీ గుర్తు చేస్తున్నారు. మరి మన దేశంలో ఈ విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుందో? తద్వారా ఎంతమంది నటీనటుల జీవితాలు బాగుపడతాయో చూద్దాం.
Also Read: Suhas: రెండోసారి తండ్రి అయిన కలర్ ఫోటో హీరో..
Also Read: Sunday Tv Movies: ఆదివారం, Sep28.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే