King Buddha: హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సత్యారెడ్డి ప్రీ షూటింగ్ ట్రిప్
ABN, Publish Date - Nov 25 , 2025 | 01:39 PM
'కింగ్ బుద్థ' చిత్ర రూపకర్త సత్యారెడ్డి ప్రస్తుతం ప్రపంచ బౌద్ధారామాలను సందర్శిస్తున్నారు. ప్రపంచంలోని 25 దేశాలను సందర్శించి అనంతరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు.
ప్రముఖ నిర్మాత, నట దర్శకుడు సత్యా రెడ్డి (Satyareddy) 'కింగ్ బుద్ధ' (King Buddha) పేరుతో హాలీవుడ్ మూవీ రూపొందించ బోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పనిలో ఆయన ఉన్నారు. హాలీవుడ్ చిత్ర బృందంతో పాటు సత్యారెడ్డి ప్రస్తుతం ప్రపంచంలోని బౌద్ధ దేవాలయాలు, ఆరామాలను సందర్శిస్తున్నారు. అక్కడి నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదే పర్యటనలో సత్యారెడ్డి పుట్టిన రోజు వేడుకలు సైతం జరిగాయి.
బ్యాంకాక్ లో 5,500 కేజీల గోల్డ్ తో చేసిన బుద్థ ప్రతిమను, దేవాలయాన్ని సత్యారెడ్డి టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ, 'బ్యాంకాక్ తో పాటు మరో ఇరవై ఐదు దేశాలను సందర్శించి తమ బృందం పరిశోధన చేయబోతోందని, సమాచారాన్ని క్రోడీకరించి ఫుల్ స్క్రిప్ట్ తో షూటింగ్ ను ప్రారంభిస్తామ'ని ఆయన అన్నారు. అక్టోబర్ లో అమెరికాలోని టెక్సాస్ లో సత్యారెడ్డి 'కింగ్ బుద్ధ' మూవీ పోస్టర్ ను లాంచ్ చేశారు. చిత్రసీమతో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న తాను ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' సినిమాను తెరకెక్కించబోతున్నానని తెలియగానే కాన్సెప్ట్ నచ్చి తన నిర్మాతలు భారీ బడ్జెట్ తో దీనిని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులతో, సాంకేతిక నిపుణులతో తీయడానికి ముందుకొచ్చారని అన్నారు.