Krishna Dammalapati: హీరోగా.. మరో నంది అవార్డ్ చైల్డ్ ఆర్టిస్ట్! సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో 'పదహారు రోజుల పండుగ'
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:16 PM
నంది అవార్డ్ విన్నర్ మాస్టర్ సాయికృష్ణ ఇప్పుడు హీరోగా మారాడు. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో సాయి కృష్ణ హీరోగా 'పదహారు రోజుల పండుగ' అనే సినిమా బుధవారం మొదలు కాబోతోంది.
బాలనటులుగా నంది అవార్డులు అందుకున్న అనేకమంది ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అలీ (Ali) నుండి మొదలు పెడితే... ఆ జాబితా చాలానే ఉంది. హరీశ్ (Hareesh), తరుణ్ (Tharun), బాలాదిత్య (Baladitya), ఆనంద్ వర్థన్ (Anand Vardhan), మహేంద్ర (Mahendra), కౌశిక్ బాబు (Koushik Babu)... వీళ్ళంతా బాలనటులుగా నంది అవార్డు అందుకుని ఆ తర్వాత హీరోలుగా నటించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో నంది అవార్డ్ విన్నర్ చైల్డ్ ఆర్టిస్ట్ సాయికృష్ణ (Saikrishna) చేరుతున్నాడు.

నితిన్ (Nithiin), ప్రియమణి (Priyamani) జంటగా 2008లో వచ్చిన 'ద్రోణ' (Drona) సినిమాలో చక్కని నటన కనబరిచిన సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇతను మరెవరో కాదు... ఆ సినిమా నిర్మాత, నటుడు డి.ఎస్. రావు (DS Rao) తనయుడు. ఇప్పుడు సాయి కృష్ణ హీరోగా సాయి కిరణ్ అడివి (Sai Kiran Adivi) దర్శకత్వంలో ఓ సినిమా బుధవారం మొదలు కాబోతోంది. 'పదహారు రోజుల పండుగ' (Padahaarau Rojula Pandaga) పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ కామెడీ మూవీకి రామ్ లక్ష్మణ్ (Ram Rakshnan) యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కాగా జానీ (Johnny) మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు.
ప్రముఖ నిర్మాత డి.ఎస్. రావు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించడంతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలిలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుంటారు. అలానే పలు చిత్రాలలో ప్రతి నాయకుడు, పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడు ఆయన కుమారుడు సాయి కృష్ణ సైతం తండ్రి అడుగు జాడల్లో నటుడు కావడం విశేషం. ఇక దర్శకుడు సాయి కిరణ్ అడవి... శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ తర్వాత కృష్ణుడు హీరోగా 'వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు' సినిమాలను రూపొందించాడు. సుమంత్ అశ్విన్ తో 'కేరింత', ఆది సాయికుమార్ హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రాలను తెరకెక్కించాడు. దర్శకుడిగా 'పదహారు రోజుల పండుగ' ఆయన ఐదవ ప్రాజెక్ట్.