The Odyssey Movie: క్రిస్టఫర్ నోలాన్ క్రేజ్....
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:56 PM
ఆ మధ్య అమెరికా సినీఫ్యాన్స్ నిర్వహించిన ఓ సర్వేలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ నంబర్ వన్ గా నిలిచారు. క్రిస్టఫర్ కు అంత క్రేజ్ ఉందా అని కొందరు నోరెళ్ళ బెట్టారు. క్రిస్టఫర్ కున్న క్రేజ్ ఏ పాటిదో ఆయన తాజా చిత్రం 'ఒడిస్సీ' చాటుతోంది. ఆ విశేషమేంటో చూద్దాం.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హాలీవుడ్ డైరెక్టర్ ఎవరంటే క్రిస్టఫర్ నోలాన్ (Christopher Nolan) పేరే వినిపిస్తుంది. ఆయన కంటే సీనియర్స్ అయిన జేమ్స్ కేమరాన్, స్టీవెన్ స్పీల్ బెర్గ్ వంటి టాప్ హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం క్రిస్టఫర్ నోలాన్ సినిమాలను ప్రశంసిస్తూ ఉన్నారంటే నోలాన్ క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. క్రిస్టఫర్ నోలాన్ తాజా చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) 2026 జూలై 17న విడుదల కానుంది. అంటే మరో సంవత్సరం ఉంది. అయితే ఈ నెల జూలై 17 నుంచే క్రిస్టఫర్ 'ఒడిస్సీ'కి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమయింది. ఎంత క్రేజ్ ఉన్న సినిమాకైనా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ వారం, లేదా పదిరోజులు. మరీ అంటే నెల, లేదా రెండు నెలలు ముందు ఆరంభమవుతాయి. కానీ, క్రిస్టఫర్ 'ఒడిస్సీ'కి అమెరికా, యూకే, కెనడా దేశాల్లోని 70 ఎమ్.ఎమ్., ఐమాక్స్ థియేటర్స్ లో ఏడాది ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టడం విశేషంగా మారింది.
'ఒడిస్సీ'కి ఏడాది ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టడంపై సినీఫ్యాన్స్ విస్తు పోతున్నారు. క్రిస్టఫర్ క్రేజ్ అలాంటిదనీ కొనియాడుతున్నారు. తొలి సినిమా 'ఫాలోయింగ్'తోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న క్రిస్టఫర్ నోలాన్ 'మెమెంటో'తో ఇంటర్నేషనల్ మూవీ బఫ్స్ ను ఆకట్టుకున్నారు. ఇక 'బ్యాట్ మేన్ బిగిన్స్, ద డార్క్ నైట్'తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.. 'ఇన్ సెప్షన్'తో సంచలన విజయం సాధించిన క్రిస్టఫర్ తరువాత "ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, టెనెట్"తోనూ వైవిధ్యం ప్రదర్శించి మురిపించారు. ఇక 'ఒపెన్ హైమర్'తో ఆస్కార్ బరిలోనూ అదరహో అనిపించారు క్రిస్టఫర్. అప్పటి నుంచీ క్రిస్టఫర్ తరువాతి సినిమా ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలచిన హోమర్ 'ఒడిస్సీ', 'ఇలియడ్' ఇప్పటికే పలుమార్లు సినిమాలుగా రూపొందాయి. ఇప్పుడు క్రిస్టఫర్ సైతం 'ఒడిస్సీ'ని తనదైన శైలిలో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దాంతో 'ఒడిస్సీ'ని క్రిస్టఫర్ ఏ పర్సెప్షన్ లో చూస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దానిని దృష్టిలో పెట్టుకొనే వార్నర్ బ్రదర్స్ సంస్థ అమెరికా, కెనడా, యూకేలోని 70 ఎమ్.ఎమ్, ఐమాక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారు..
హాలీవుడ్ మూవీస్ కు మన దేశంలోనూ విశేషాదరణ లభిస్తోంది. ఇక క్రిస్టఫర్ నోలాన్ కు కూడా ఇండియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ 'ఒడిస్సీ'కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయా అన్న సందేహం కూడా కలుగుతోంది. అయితే ఇంకా మన దేశంలో 'ఒడిస్సీ' బజ్ స్టార్ట్ కాలేదు. ఆ దేశాల్లో అంటే క్రీస్తు పూర్వం నుంచీ హోమర్ రాసిన 'ఒడిస్సీ', 'ఇలియడ్' అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ గ్రీక్ క్లాసిక్స్ ను పాశ్చాత్య భాషల్లోకి ఎవరికి వారు తమదైన పంథాలో అనువదిస్తూనే ఉన్నారు. అందువల్ల అక్కడ 'ఒడిస్సీ'కి ఉన్న క్రేజ్ మన దగ్గర ఉండక పోవచ్చు. అయినా క్రిస్టఫర్ నోలాన్ రూపొందిస్తున్న హోమర్ వర్క్ కాబట్టి తప్పకుండా సినీఫ్యాన్స్ ను ఆకర్షిస్తుంది 'ఒడిస్సీ'. మరి మన దేశంలో ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయో?. ఇక వచ్చే యేడాది జూలై 17న రాబోతున్న 'ఒడిస్సీ' ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ చూరగొంటుందో చూడాలి.
Also Read: Monica Song: ఏం సాంగ్ రా బాబు పోవడం లేదు మైండ్ లో నుంచి..
Also Read: Junior Movie: జూనియర్ మూవీ రివ్యూ
Also Read: Kottapallilo Okappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ