Junior Movie: జూనియర్ మూవీ రివ్యూ

ABN , Publish Date - Jul 18 , 2025 | 02:13 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయం అయిన జూనియర్ మూవీ శుక్రవారం విడుదలైంది. అదెలా ఉందో తెలుసుకుందాం...

Junior Movie Review

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి (Gaali Janardhan Reddy) కొడుకు కిరీటీ (Kireeti) హీరోగా పరిచయమైన సినిమా 'జూనియర్' (Junior). రాధాకృష్ణారెడ్డి (Radha Krishna Reddy) దర్శకత్వంలో సాయి కొర్రపాటి (Sai Korrapati) సమర్పణలో రజని ఈ సినిమా నిర్మించారు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా, జెనీలియా (Genelia) కీలక పాత్ర పోషించిన ఈ మూవీ జూలై 18న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం…


కథ విషయానికి వస్తే.... చిన్నతనం నుంచే తండ్రి కోదండపాణి (రవిచంద్రన్ Ravichandran) అతి ప్రేమ వల్ల తను కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని చూసే యువకుడు అభినవ్ (కిరీటి). అందుకోసం ఫ్రెండ్స్ ను కూడా తనే ఎంపిక చేసుకుని వారితో తన మెమొరీస్ ని పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలా తనకు కాలేజ్ లో తారస పడిన స్ఫూర్తి (శ్రీలీల) ని ఇష్టపడటమే కాదు, ఆమె జాబ్ లో చేరిన చోటే తను కూడా జాబ్ సంపాదిస్తాడు. ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ సౌజన్య (జెనీలియా)తో తొలి భేటీలోనే అభి పట్ల ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. దాంతో ప్రాధాన్యం లేని పోస్ట్ దక్కించుకున్న అభి అక్కడ తన ఉనికిని ఎలా చాటుకున్నాడు? ఆ తర్వాత అభి, విజయ మద్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అసలు అభికి, విజయకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా.

ఈ మూవీ ఫస్ట్ హాఫ్ దాదాపుగా కాలేజీ నేపథ్యంలోనే సాగుతుంది. అయితే గతంలో ఇలాంటి సన్నివేశాలు, సంఘటనలను అనేకానేక చిత్రాలలో చూసి ఉండటం వల్ల ఎక్కడా కొత్తదనం కనిపించదు. సాంగ్స్, ఫైట్స్ బాగున్నా... వాటి కోసం బలవంతంగా సిట్యుయేషన్ క్రియేట్ చేసి పెట్టినట్టుగా ఉంటాయి. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. అది కూడా అంత గొప్పగా అనిపించదు. కిరిటీ, జెనీలియా మధ్య సన్నివేశాలు ఓ మేరకు సెంటిమెంట్ ను పండించినా... అవి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేవు. సహజంగా ఎవరైరా కొత్త హీరోలను పరిచయం చేస్తే... వాళ్ళ కాలిబర్ తెలుసుకుని, అదంతా తెర మీద ప్రెజెంట్ చేయడానికి దర్శక నిర్మాతలు తాపత్రయ పడుతుంటారు. కిరీటి విషయంలోనూ అదే జరిగింది. నిజానికి కిరీటి డాన్స్, ఫైట్స్ బాగా చేయడమే కాదు తొలి సినిమా అయినప్పటికీ చక్కటి నటనను ప్రదర్శించాడనే చెప్పాలి. ఇంట్రో సాంగ్ నుంచి ‘వైరల్ వయ్యారి…’ సాంగ్ వరకూ ఈజ్ తో ఇరగదీశాడు. ఇక శ్రీలీల విషయానికి వస్తే తను ఓ షో పీస్ మాత్రమే... ద్వితీయార్థంలో అయితే కేవలం ఓ డ్రీమ్ సాంగ్ కి మాత్రమే పనికి వస్తుందా పాత్ర. జెనీలియా ఎంట్రీ లేట్ గా జరిగినా తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే కథలోని ఎత్తుగడ లోపం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. రవిచంద్రన్ కి ఈ తరహా పాత్ర కొట్టిన పిండే. మల్టీనేషనల్ కంపెనీ ఎక్కడో చిన్న పల్లెటూరిలో జనాలకు సాయం చేయాలనుకోవడం… అందులో కోట్ల స్కామ్ జరగటం… దాని కోసం కాబోయే సి.ఇ.వో అక్కడే మకాం వేయటం ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. అసలు కథనమే తేలిపోయిందిక్కడే. దర్శకుడు ఈ విషయంలో సరైన వర్క్ చేయలేదనిపిస్తుంది.


సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. అందులో ఒకటి రెండు పాటలు వైరల్ కూడా అయ్యాయి. వాటిని తెర మీద గ్రాండ్ గా చిత్రీకరించారు. సెంథిల్ సినిమాటోగ్రఫీ కూడా అదుర్స్. ప్రతి సీన్ ను బ్యూటిఫుల్ గా, రిచ్ గా కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. నిర్మాణ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి లేదు. కానీ ప్రోపర్ గా కథను రాసుకుని, మరింత కన్విక్షన్ తో దాన్ని తీసి ఉంటే బాగుండేది. కిరిటీ కి ఉన్న నేపథ్యం దృష్ట్యా అతను ఈ సినిమా రిజల్ట్ తో ఆగిపోడు. మరో ప్రయత్నం చేయక మానడు. సో... ప్రోపర్ గా ఉండేలా చూసుకుంటేనే నిలదొక్కుకుంటాడు. లేదంటే... చాలా మంది వారసులు యూ టర్న్ తీసుకున్నట్టే ఇతనూ బిజినెస్ మ్యాన్ గానూ, పొలిటీషియన్ గానూ మారిపోవలసి వస్తుంది. సో బి కేర్ ఫుల్ కిరీటి!

ట్యాగ్ లైన్: జూనియర్ కాదు… సీనియరే.…

రేటింగ్: 2.5/5

Updated Date - Jul 18 , 2025 | 02:13 PM