Akhanda 2 Review: బాలకృష్ణ.. 'అఖండ 2 తాండవం' సినిమా రివ్యూ

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:49 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన నాలుగో చిత్రం 'అఖండ 2 తాండవం'. ఈ సినిమా వారిద్దరి సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిందో లేదో తెలుసుకుందాం.

Nandamuri Balakrishna Akhanda 2 Movie review

నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. 2021లో వచ్చిన ఆ సినిమా తర్వాత 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్' విజయాలతో ముందుకు సాగారు బాలకృష్ణ. 'అఖండ 2 తాండవం'తో బాలకృష్ణ - బోయపాటి సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చూడతాడని, బాలయ్య ఖాతాలో మరో గ్రాండ్ సక్సెస్ జమ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వారం రోజులు ఆలస్యంగా జనం ముందుకు వచ్చింది. పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో విడుదలైన 'అఖండ 2' ఎలా ఉందో చూద్దాం.

'అఖండ' చిత్రంలో 'ప్రకృతిని దోచుకుంటే దైవం చూస్తూ ఊరుకోదు... ఖచ్చితంగా శిక్షిస్తుంద'ని చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను, 'అఖండ -2' సినిమాలో సనాతన హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్ళుగా మన దేశంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం జరుగుతున్న వాటిని ఆధారంగా చేసుకుని ఈ కథను బోయపాటి రాసుకున్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చైనా చేస్తున్న కుట్రలు, టిబెట్ పై ఆ దేశం చేసిన ఆక్రమణ, మన ప్రజలకు దైవం పట్ల ఉన్న నమ్మకాన్ని చెరిపేందుకు చేసే కుట్రలు తదితర అంశాలకు ఇందులో ప్రాధాన్యమిచ్చారు.


కథేమిటంటే...

'అఖండ' సినిమాకు ఎక్కడ శుభం కార్డు పడిందో అక్కడే ఈ కథ మొదలైంది. అరి వర్గాలను హతమార్చిన అఖండ రుద్ర (బాలకృష్ణ) అష్ట లింగ పీఠంలో తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఇక్కడ మురళీకృష్ణ (బాలకృష్ణ Balakrishna) ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తుంటాడు. అతని భార్య శరణ్య కన్నుమూయడంతో కూతురు జనని (హర్షాలీ మల్హోత్ర Harshali Malhotra)ని కంటికి రెప్పలా కాపాడుతూ, సైంటిస్ట్ ను చేస్తాడు. ఈ దేశ హితం కోసం ఆమె టీమ్ హిమాచల్ ప్రదేశ్ లో పని చేస్తుంటుంది. వారంతా ఆర్మీ ఆఫీసర్ అర్చన (సంయుక్త Samyuktha) సంరక్షణలో ఉంటారు. ఇదిలా ఉంటే... పీ.ఎం. పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత అజిత్ ఠాకూర్ (కబీర్ దుహాన్ సింగ్)... చైనా జనరల్ జంగ్లీ (సాంగ్య Sangay Tsheltrim)తో చేతులు కలుపుతాడు. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ప్రజలలో ఉన్న దైవభక్తిని తొలగించాలని, దేవుడు సైతం తమను కాపాడలేడనే భావనకు వారిని లోను చేయాలని అజిత్ ఠాకూర్ ప్రయత్నిస్తాడు. అందుకు మహా కుంభమేళ ను అనువుగా వాడుకుంటాడు. పవిత్ర గంగాజలాన్ని కలుషితం చేసి తద్వారా ప్రజలు వైరస్ బారిన పడేలా పన్నాగం పన్నుతాడు. ప్రతిపక్ష నేత, చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? సనాతన ధర్మాన్ని తుడిచి వేయాలని వారు చేసిన కుతంత్రాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? వైరస్ ను రూపుమాపడం కోసం జనని టీమ్ తయారు చేసిన వాక్సిన్ ను నాశనం చేయాలనుకున్న వారి కుట్రలను ఎలా భగ్నం చేశాడు? అనేది మిగతా కథ.

'అఖండ'లో తన తమ్ముడి కూతురు ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి వచ్చిన అఖండ రుద్ర... ఇందులో ఈ దేశ కార్యంలో నిమగ్నమైన అదే అమ్మాయికి శత్రువుల నుండి ప్రమాదం సంభవించినప్పుడు రంగంలోకి దిగుతాడు. వాక్సిన్ ప్రభుత్వానికి చేరకుండా అడ్డుకున్న నేత్ర (ఆది పినిశెట్టి Aadi Pinisetti) అనే తాంత్రికుడు చేసే పన్నాగాన్ని భగ్నం చేయడమే కాకుండా... శత్రుదేశ సైనికులనూ దునుమాడి, ధర్మరక్షణ ఆవశ్యకతను జనాలకు బోధిస్తాడు.

Grand Release Teaser - Still.jpg


ఎలా ఉందంటే...

ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలను మిళితం చేసి బోయపాటి రాసుకున్న ఈ కథ బాలకృష్ణ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దేశంలో వీస్తున్న హిందుత్వ భావాలను బలపరిచే విధంగా సనాతన ధర్మ బోధ చేయడం కూడా కలిసొచ్చే అంశమే. అయితే ఫస్ట్ హాఫ్ లోని ట్విస్ట్స్ అండ్ టర్న్స్... సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. కేవలం అఖండ రుద్ర... జనని ని కాపాడం, శత్రువులను ఎదుర్కోవడం మీదే ద్వితీయార్ధం సాగింది. మధ్యలో మదర్ సెంటిమెంట్ సీన్స్ పెట్టినా... అది అంతగా హృదయాన్ని కట్టిపడేసేలా లేదు. అయితే... తల్లి మరణానంతర సన్నివేశాలు కాస్తంత థ్రిల్ కు గురిచేస్తాయి. 'అఖండ'లో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ ట్రాక్ అద్భుతంగా పండింది. అది ఇందులో మిస్ అయ్యింది. సంయుక్త పాత్ర ఓ మాస్ సాంగ్, యాక్షన్ ఎపిసోడ్ కే పరిమితం కావడం కాస్తంత నిరాశకు గురిచేసే విషయం.

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్...

నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశాడు. ఎమ్మెల్యే మురళీకృష్ణ గా ఆకట్టుకున్న బాలకృష్ణ, అఖండ రుద్రగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ రెండు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్... ఆడియెన్స్ తో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. ఇందులో 'బజరంగీ భాయీజాన్' ఫేమ్ హర్షాలి... కీలకమైన జనని పాత్రను పోషించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఆమెను ఓన్ చేసుకుంటారేమో చూడాలి. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలోనే ఎంట్రీ ఇస్తుంది. అతనిపై చిత్రీకరించిన రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో మొదటిది బాగుంది, రెండోది పూర్తిగా గ్రాఫిక్స్ మయం. మెయిన్ విలన్స్ గా సాంగ్య, కబీర్ దుహాన్ సింగ్, 'కల్కి' ఫేమ్ శాశ్వత్ ఛటర్జీ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ, అనీశ్‌ కురువిల్లా, సర్వదమన్ బెనర్జీ, రవివర్మ, విజీ చంద్రశేఖర్, వై జి మహేంద్ర, శరత్ లోహితస్య తదితరులు పోషించారు. వీరంతా పాత్రల పరిధి మేరకు నటించారు తప్పితే... తమదైన ముద్రను వేయడంలో విఫలమయ్యారు. బోయపాటి శ్రీను చిన్న కొడుకు వర్షిత్ ఇందులో భక్త ప్రహ్లాదుడి పాత్రలో కనిపిస్తాడు.

సాంకేతిక నిపుణుల పనితనం...

ఈ చిత్రానికి బోయపాటి రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టేలా ఉంది. 'జాజికాయ' పాట మాస్ కోసం పెట్టింది తప్పితే... కథకు ఉపయోగపడేది కాదు. మిగిలిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ డివోషనల్ టచ్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని గొప్పగానే ఉన్నాయి. కానీ ద్వితీయార్థంలో కథ మొత్తం ఒకేచోట తిరగడం, సనాతన ధర్మ ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం సగటు ప్రేక్షకుడిని మెప్పించకపోవచ్చు. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ కు, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి 'అఖండ-2' నచ్చుతుంది. అలానే ద్వితీయార్థంతో ఉత్తరాది వారు కనెక్ట్ అయితే... 'అఖండ' తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోగలదు.

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: ధర్మ ప్రభోదం!

Updated Date - Dec 12 , 2025 | 07:11 AM