Bison Review: ధృవ్ విక్రమ్.. స్పోర్ట్స్ డ్రామా 'బైసన్' రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?
ABN, Publish Date - Oct 24 , 2025 | 11:05 AM
కబడ్డీ ఆట, కులం, పగ, ప్రతీకారం ఇతివృత్తంతో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'బైసన్'. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే
సినిమా రివ్యూ: బైసన్ (Bison Review)
విడుదల తేది: 24-10-2025
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో కోలీవుడ్లో హీరోగా పరిచయమయ్యారు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram). ఆ మూవీ పరాజయం పొందింది. ఆ తర్వాత తండ్రితో కలిసి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘మహాన్’లో నటించాడు ధ్రువ్. అది కూడా విజయాన్ని ఇవ్వలేదు. తాజాగా దీపావళి కానుకగా కబడ్డీ నేపథ్యంలో ‘బైసన్’(Bison) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనినే తెలుగులో అదే పేరుతో అనువదించి రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ధ్రువ కి ఆశించిన విజయాన్ని అందించిందేమో చూద్దాం..
కథ: (Bison Review)
తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం అది. అక్కడ ప్రతి ఒక్కరిలోనూ కబడ్డీ ఆట భాగమై ఉంటుంది. కానీ కులాలు, రాజకీయాలు, పగ, ప్రతీకారాలు వంటి కారణాలతో ఆసక్తి ఉన్నా ఆ ఆటవైపు ఎక్కువ దృష్టి సారించరు. వనతి కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్)కు అదే పరిస్థితి ఎదురవుతుంది. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రి వేలుస్వామి (పశుపతి) తనకు ఎదురైన అనుభవాల వల్ల కిట్టయ్యను కబడ్డీకి దూరంగా ఉంచుతారు. తండ్రిని కాదని అక్క సాయంతో కిట్టయ్య ప్రయత్నం చేసినా ఊర్లో తన తండ్రితో విభేదాలు వల్ల కిట్టయ్యను కబడ్డీ కెప్టెన్ ఆటలో చేర్చుకోడు. బయట టీముల్లో ఆడటానికి ఎవరూ ఎంకరేజ్ చేయరు. కిట్టయ్యకి కబడ్డీ మీద ఉన్న ఆసక్తిని గమనించి, అతడిని స్కూల్ టీమ్లోకి తీసుకుంటాడు పీఈటీ మాస్టర్ (మదన్ కుమార్). స్కూల్ స్థాయిలో మొదలైన కిట్టయ్య ఆట జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడానికి కిట్టయ్యకు ఎదురైన ఇబ్బందులు, సవాళ్ళు ఏంటి? వాటిని కిట్టయ్య అలియాస్ బైసన్ ఎలా అధిగమించి లక్ష్యం చేరుకున్నాడన్నదే కథ. (1993లో జపాన్లో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ లో పాకిస్తాన్ పై ఇండియాను గెలిపించిన మనతి పి. గణేశన్ బయోపిక్ ఇది)
విశ్లేషణ: (Bison Review)
కబడ్డీ ఆట ఇతివృత్తంగా సాగే కథ ఇది. ఓ సాధారణ గ్రామీణ ఆటగాడు అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. తను అనుకున్నది ఎలా సాధించాడు.. ఈ జర్నీలో ఆ ఆటగాడిని కులం, పగ, ప్రతీకారం, అధిపత్యం వంటి అంశాలు ఎలా పట్టిపీడించాయనేది ఈ సినిమా ఇతివృత్తం. దర్శకుడు మారి సెల్వరాజ్ సినిమాలన్నీ తన జీవితంలో చూసిన, ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే ఉంటాయి. ‘బైసన్’ కూడా ఆ తరహా చిత్రమే. అయితే ఈసారి కులానికి, కబడ్డీ ఆటను జోడించాడు. ఆయన హీరోగా భావించే కాలమాడన్ (మనతి పి. గణేశన్) అనే కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లాల్, అమీర్ పాత్రల ద్వారా సమాజంలో వివక్ష ఏ కారణం లేకుండా ఎలా మొదలవుతుంది, దాని మూలాలకు ఎందుకని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ప్రశ్నిస్తే ఏమవుతుంది? అనే అంశాలకు కబడ్డీ నీ జోడించి తీసిన సినిమా ఇది. ఇలాంటి కథకు సినిమాటిక్ లిబర్టీ తీసుకోవలసిన అవసరం ఉన్నా దర్శకుడు మారి సెల్వరాజ్ నేచురాలిటీకి దగ్గరగానే వెళ్లడంతో కొన్ని చోట్లు సాగతీతలా అనిపిస్తుంది. కులం, వివక్ష, కిందవారిని తొక్కేయడం వంటి అంశాలు పలుమార్లు రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే ప్రథమార్ధంలో కారణం లేకుండా జరిగే గొడవలు కాస్త విసుగు పుట్టిస్తాయి. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి లోను చేస్తుంది. ఇక సెకెండాఫ్ నుంచి సినిమా ట్రాక్ లోకి వస్తుంది. కబడ్డీ ప్లేయర్ కు ఉండే కష్టాలు కట్టిపడేస్తాయి. ఆట ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికర అంశమే. ఇందులో కూడా ఫైనల్ ఆట అదే ఫీలింగ్ కలగజేస్తుంది. అయితే కబడ్డీ ఆట, కుల వివక్ష రెండిటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయంలో దర్శకుడు తడ పడ్డట్టు అనిపిస్తుంది. ‘ఒక్కోసారి మనోడు కాదు అనుకునే మనిషి కంటే.. మనవాడు అనుకున్నవాడే ప్రమాదకరం’ వంటి డైలాగ్స్ డైరెక్టర్ గా మారి మార్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ఒక పాత్ర రియలిస్టిక్ గా ఉండాలంటే దానిపై ఎంతో కసరత్తులు చేయాలి. కబడ్డీ ప్లేయర్గా కనిపించడానికి, ఎంతో స్టడీ చేసి తన బాడీ లాంగ్వేజ్ ని ఓన్ చేసుకోవాలి. టెక్నిక్ నేర్చుకోవాలి. ఈ సినిమాలో బైసన్ గా నటించడానికి ధ్రువ్ విక్రమ్ వారాలు కాదు.. నెలలు కాదు.. రెండున్నరేళ్ల పాటు ఒక ఊర్లో ఉండి కబడ్డీ ఆటగాళ్ల తీరు, వ్యవహారశైలిని ఓన్ చేసుకుని పాత్ర పోషించాడని విన్నప్పడు తనకు తండ్రి విక్రమ్ పట్టుదలే వచ్చిందనిపించక మానదు. మారుమూల గ్రామవాసిగా, కబడ్డీని విపరీతంగా ప్రేమించే వ్యక్తిగా, దేశం కోసం ఆడి గెలవాలనే తపన ఉన్న వ్యక్తిగా చక్కని నటన కనబర్చాడు. ఇక హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ పాత్ర చిన్నదే అయినా పర్వాలేదనిపించింది. పక్కా విలేజ్ గాళ్ గా మెప్పించింది. రజీషా విజయన్ కిట్టయ్యకు అక్కగా చక్కని నటన కనబర్చింది. పశుపతికి మంచి రోల్ పడింది. కొడుకుని కాపాడుకోవడం కోసం తాపత్రయపడే తండ్రిగా మెస్మరైజ్ చేశారు. సీరియస్, ఎమోషన్ ఇలా సన్నివేశం ఏదైనా సరికొత్త కోణంలో మెప్పించారు. కోచ్ మదన్ కుమార్ పాత్ర సినిమాకు కీలకం. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కులం, గౌరవం కోసం నిలబడే వ్యక్తిగా లాల్ (కందస్వామి), కులం, మనుషులు మధ్య అంతరాలు తొలగిపోవాలని ఆశించే వ్యక్తిగా అమీర్ (పాండిరాజా) ఇద్దరూ చక్కగా నటించారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ ఎళిల్ అరసు పల్లె అందాలను చక్కగా క్యాప్చర్ చేశారు. 1993 రోజుల నేటివిటీని అద్భుతంగా చూపించారు. ఆర్ట్ వర్క్ కూడా బావుంది. నివాస కె.ప్రసన్న సంగీతం అక్కడక్కడ హెవీ అనిపించింది. ఎడిటర్ శక్తితిరు తన కత్తెరకు కొంచెం పని పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఫీల్ గుడ్ మూవీ ఇది. ఆసాంతం తమిళ నేటివిటి తో సాగే ఈ సినిమాను తెలుగువారు ఎంత వరకూ ఓన్ చేసుకుంటారో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం ఇందులో నటించిన పలువురు నటీనటులను అవార్డ్స్ వెతుక్కుంటూ రావడం ఖాయం.
ట్యాగ్ లైన్: 'బైసన్' కూత ఘనమే..
రేటింగ్: 2.75/5
Vicky Kaushal: ఆలస్యంగా పరశురాముడి ఆగమనం...
Tollywood: సినీ కార్మికుల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం