Tollywood: సినీ కార్మికుల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:08 PM

సినీ కార్మికులు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించకపోయినా... కొంతకాలం క్రితం సమ్మెను విరమించి షూటింగ్స్ లో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికై ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ శుక్రవారం సమావేశమైంది.

Film Workers Strike

సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగింది. అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో జరిగిన చర్చలలో తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతల తరఫున యార్లగడ్డ సుప్రియ, ఫెడరేషన్ నుండి వల్లభనేని అనిల్ కుమార్, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం గంగాధర్ మాట్లాడుతూ, 'సినిమా రంగంలోని కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశాన్ని జరిపాం. కొన్ని అంశాలపై కూలంకషంగా చర్చించాం. సినిమా కార్మికుల ఓ అగ్రిమెంట్ కు లోబడి రెండు నెలలుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వాటి అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే దానిపై చర్చించాం. త్వరలోనే ఓ రిపోర్ట్ ను రూపొందించి ముఖ్యమంత్రికి సబ్ మిట్ చేస్తాం' అని అన్నారు.


దిల్ రాజు ఇదే విషయం గురించి చెబుతూ, 'కార్మికుల సమస్యలపై లేబర్ కమీషనర్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులు జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి త్వరలోనే వస్తాం. మరో రెండు మూడు వారాల్లో ఈ సమస్యలన్నింటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.

Also Read: Vicky Kaushal: ఆలస్యంగా పరశురాముడి ఆగమనం...

Also Read: Srikanth Vissa: నందమూరి కళ్యాణ్‌ రామ్ సినిమాతో దర్శకుడిగా...

Updated Date - Oct 24 , 2025 | 03:17 PM