సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Taj Story: తాజ్‌మ‌హాల్ వివాదాల నేప‌థ్యంలో సినిమా.. రిలీజ్‌కు ముందు అడ్డంకులు రిలీజ‌య్యేనా

ABN, Publish Date - Oct 29 , 2025 | 10:36 AM

పరేశ్‌ రావల్ ప్రధాన పాత్ర పోషించిన 'ది తాజ్ స్టోరీ' అక్టోబర్ 31న జనం ముందుకు రావాల్సి ఉంది. అయితే దీని విడుదలను అడ్డుకోవడానికి పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

The Taj Story Movie

ప్రముఖ నటుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పరేశ్‌ రావల్ (Paresh Rawal) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కింది 'ది తాజ్ స్టోరీ' (The Taj Story). తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వంలో సి.ఎ. సురేశ్‌ ఝా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 31న జనం ముందుకు వస్తోంది. సి.బి.ఎఫ్.సి. (CBFC) కమిటీ దీనికి యు/ఎ 13 ప్లస్ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

ప్రపంచం వ్యాప్తంగా ఉండే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఆగ్రాలోని తాజ్ మహాల్ చుట్టుకొంతకాలంగా వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజ్ మహల్ కట్టిన స్థలంలో ఓ శివాలయం ఉండేదని, దాని ఆనవాళ్ళను చెరిపేస్తూ షాజహాన్ తాజ్ మహల్ ను కట్టాడని కొందరు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా చరిత్రకారుడైన పి.ఎన్. ఓక్ ఈ విషయాన్ని తన రచనల్లో పేర్కొన్నాడు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్ళినా... ఆయన వాదనలను కోర్ట్ కొట్టిపడేసింది. కొందరు హిందుత్వ వాదులు పనికట్టుకుని తాజ్ మహల్ పై వివాదాలను సృష్టిస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ వాదనలను బలంగా వినిపిస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. 'ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ' ఈ కోవకు చెందినవే. అదే తరహాలో తాజాగా 'ది తాజ్ స్టోరీ'నీ రూపొందించారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రధాన పాత్రధారి అయిన పరేశ్‌ రావల్ మొదలు పెట్టగానే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేచింది. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ డోమ్ ను తొలగించి చూస్తే అందులో శివుడు ఉన్నట్టు ఉన్నట్టు చూపించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ అండతో ఈ తరహా చిత్రాలు తీస్తూ, చరిత్రను మసి మూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు.


'ది తాజ్ స్టోరీ' పై పలు వివాదాలు ముసురు కోవడంతో దర్శక నిర్మాతలు తమ చిత్రం ఏ మతానికీ వ్యతిరేకం కాదని, ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసులను ఆధారంగా చేసుకుని తాము సినిమాను రూపొందించామని వివరణ ఇచ్చాయి. సెన్సార్ బోర్డ్ సైతం ఈ సినిమా మేకింగ్ కు సంబంధించిన దర్శక నిర్మాతల దగ్గర ఉన్న ఆధారాలను, సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలించి, ఆ పైన సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ హైకోర్ట్ లో ఈ సినిమా విడుదలను ఆపివేయాలని కోరుతూ షకీల్ అబ్బాస్ అనే అడ్వొకేట్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్‌ ను ఢిల్లీ హై కోర్టులో వేశారు.

కొసమెరుపు ఏమిటంటే.. 'ది తాజ్ స్టోరీ' సినిమాను బీజేపీ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయోధ్యకు చెందిన బీజేపీ స్పోక్స్ పర్సన్ రజనీశ్‌ సింగ్ 'ది తాజ్ స్టోరీ' విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలహాబాద్ హై కోర్టులో రజనీశ్‌ సింగ్ 2022 అక్టోబర్ లో ఓ కేసు వేశాడు. తాజ్ మహల్ లో మూసి ఉన్న 22 గదులను తెరవాలని, అప్పుడు ఆ కట్టడం దేవాలయంపై నిర్మించారనే విషయం బయటపడుతుందని వాదించాడు. సర్వే ఆఫ్‌ ఇండియాలో ఓ కమిటీని వేసి, తాజ్ మహల్ విషయంలో నిజానిజాల నిగ్గు తేల్చాలని కోరాడు. అయితే ఇప్పుడీ సినిమాను తను హైకోర్ట్ లో వేసిన కేసు ఆధారంగా తీసేరని తెలుస్తోందని, ఈ సినిమా కారణంగా తన కేసుకు భంగం కలిగే ఆస్కారం ఉందని రజనీశ్‌ సింగ్ వాదిస్తున్నాడు. వెంటనే ఈ సినిమా విడుదదలను నిలిపివేయాలని కోరుతూ సోమవారం సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సర్టిఫికెషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

శుక్రవారం విడుదల కాబోతున్న 'ది తాజ్ స్టోరీ' చిత్రంలో పరేశ్‌ రావల్ టూరిస్ట్ గైడ్ పాత్రను పోషిస్తున్నాడు. తాజ్ మహల్‌ పై చెలరేగుతున్న వివాదాల నేపథ్యంలో కోర్ట్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహా వాగ్, శిశిర్‌ శర్మ, కర్మవీర్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Suriya: ర‌వితేజ గురించి.. నాక‌న్నా ఎక్కువ‌గా జ్యోతిక‌, కార్తీలు మాట్లాడుతారు

Aslo Read: Thursday TV Movies: గురువారం, Oct 30.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Updated Date - Oct 29 , 2025 | 12:53 PM