Karishma Kapoor: దివంగత తండ్రి ఆస్తి హక్కుల కోసం...
ABN, Publish Date - Sep 10 , 2025 | 10:20 AM
ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఈ యేడాది జూన్ లో హఠాన్మరణానికి గురయ్యాడు. అతని ఆస్తిలో వాటా కోసం కరిష్మా పిల్లలు తాజాగా ఢిల్లీ హైకోర్టు కెక్కారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించిన 'అ...ఆ' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. 'డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుసు!?' అని. బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ (Karisma Kapoor) విషయంలో అది నిజమే అనిపిస్తోంది. ఆమె పిల్లలు ఇద్దరూ ఇప్పుడు దివంగత తండ్రి ఆస్తిలో తమ హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు.
ప్రముఖ నటి కరిష్మా కపూర్ వివాహం వ్యాపారవేత్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) తో 2003లో జరిగింది. అతనికి ఇది రెండో పెళ్ళి. వారికి ఇద్దరు పిల్లలు. అయితే 2014లో సంజయ్ కపూర్ తో కరిష్మా తెగదెంపులు చేసుకుంది. 2016లో వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంజయ్ కపూర్... ప్రియా సచ్ దేవ్ (Priya Sachidev) ను వివాహం చేసుకున్నాడు. భర్త నుండి విడిపోయిన తర్వాత లండన్ నుండి ఇండియా వచ్చేసిన కరిష్మా... పిల్లలతో ఇక్కడే ఉంటోంది. ఊహించని విధంగా ఈ యేడాది జూన్ 12వ తేదీ లండన్ లో సంజయ్ కపూర్ పోలో ఆట ఆడుతూ, గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందాడు. అక్కడ ఉన్న తేనెటీగ అతని గొంతులోకి వెళ్ళిందని, అందువల్లే అతను మరణించి ఉంటాడని ప్రాధామిక విచారణలో తేలింది. ఈ వార్త తెలిసిన వెంటనే పిల్లలను తీసుకుని కరిష్మాకపూర్ లండన్ వెళ్ళింది. సంజయ్ కపూర్ అంత్యక్రియలలో పాల్గొంది.
ఆ సమయంలో సంజయ్ కపూర్ ఎలాంటి వీలునామా రాయలేదని, అతనికి సంబంధించిన ఆస్తులన్నీ ఆర్. కె. ఫ్యామిలీ ట్రస్ట్ లోనే ఉన్నాయని సంజయ్ కపూర్ భార్య ప్రియా... కరిష్మా కపూర్ కు తెలిపిందట. కానీ ఇప్పుడు సంజయ్ కపూర్ కు చెందిన దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తి, ఆమెకు మరో ఇద్దరికి కట్టబెట్టినట్టుగా వీలునామాను వారు సృష్టించారని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తమ తండ్రి ఆస్తిలో తమకూ వాటా ఇవ్వాలని, తమ చదువులకోసం, భవిష్యత్తుకోసం కొన్ని వ్యాపారాలను ప్రారంభించబోతున్నానని ఆయన తమతో చెప్పారని, తరచూ తమతో సంభాషించే వాడని వారు కోర్టుకు పెట్టిన అర్జీలో పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై హామీ ఇచ్చిన కొద్ది వారాల్లోనే ఆయన హఠాన్మరణానికి గురయ్యారని వారు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా దొంగ వీలునామాను సృష్టించి, ప్రియా తమ తండ్రి ఆస్తులను పొందాలని చూస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కేసు తేలేంతవరకూ ఆస్తులను అమ్ముకోవడం, ఇతరుల పేర మార్చడం వంటివి చేయకుండా చర్చలు తీసుకోవాలని వారు కోర్టును కోరారు.
సంజయ్ కపూర్ తో వివాహ బంధానికి కరిష్మా స్వస్తి పలికినా... ఆయనకు సంబంధించిన ఆస్తులలో హక్కులు తన పిల్లలకు దక్కాల్సిందేనని గట్టిగా వాదిస్తోంది. సంజయ్ కపూర్ వారికి చేదోడు వాదోడుగా ఉంటానని మాట ఇచ్చారని, కానీ అవి కార్యరూపం దాల్చకుండానే ఆయన చనిపోయారని, ఇప్పుడు ఆయన వారసులుగా చెప్పుకుంటున్నవారు తమను మోసం చేస్తున్నారని ఆమె వాపోతోంది. మరి కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి. బిలియనీర్ అయిన సంజయ్ కపూర్ ఆస్తుల గొడవ, కోర్టు కేసు ఇప్పుడు వ్యాపార వర్గాలలోనూ, బాలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారింది.
Also Read: Wednesday Tv Movies: బుధవారం, Sep10.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Also Read: Rakul Preet Singh: మార్పు మంచిదే...