Kannappa: కంగనా బదులు కాజల్...
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:10 PM
పద్దెనిమిదేళ్ళుగా చిత్రసీమలో ఉన్న కాజల్ అగర్వాల్ కు ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవాలనే కోరిక కలిగిందట. కమర్షియల్ అంశాలతో కూడా ఓ హిందీ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఆమే హీరోయిన్ గా నటించబోతోందట.
స్టార్ హీరోయిన్ కాజల్ అగ్వరాల్ (Kajal Agarwal) చిత్రసీమలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు అయిపోయింది. ఆమె హీరోయిన్ గా పరిచయం అయిన 'లక్ష్మీ కళ్యాణం' (Lakshmi Kalyanam) చిత్ర నిర్మాత కె. మహేంద్ర (K Mahendra) బుధవారం కన్నుమూశారు. ఇదిలా ఉంటే... కాజల్ అగర్వాల్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు తెలుగుతో పాటు వివిధ భాషల్లో నాయికగా నటించి, తన సత్తా చాటుకుంది. నాలుగేళ్ల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టిన కాజల్ కు ఇప్పుడో కొడుకు. అయినా కాజల్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. నాలుగు పదుల వయసుకు చేరువైనా ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వాలే గానీ హీరోయిన్ గా నటించడానికి ఆమె సై అంటోంది. లాస్ట్ ఇయర్ కాజల్ లేడీ ఓరియంటెడ్ మూవీ 'సత్యభామ' (Satyabhama) లో పోలీస్ అధికారిణిగా చేసింది. ఆ మధ్య వచ్చిన సల్మాన్ 'సికిందర్'లో కీ-రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం కాజల్ 'కన్నప్ప' (Kannappa) చిత్రంలో పార్వతీదేవిగా నటిస్తోంది. ఈ సినిమా ఇదే నెల 27న విడుదల కాబోతోంది. నిజానికి పార్వతీ దేవి పాత్రకు కాజల్ కంటే ముందు కంగనా రనౌత్ (Kangana Ranaut) ను తీసుకోవాలని మంచు విష్ణు (Manchu Vishnu) అనుకున్నారట. అనివార్య కారణంగా ఆమె ఈ పాత్రను చేయలేకపోవడంతో, ఆ స్థానంలోకి కాజల్ వచ్చిందట. గతంలో విష్ణు, కాజల్ బ్రదర్ అండ్ సిస్టర్ గా 'మోసగాళ్ళు' చిత్రంలో నటించారు. ఆ అనుబంధం తోనే విష్ణు కోరిక మేరకు కాజల్ 'కన్నప్ప'లో పార్వతీదేవిగా నటించిందట. ఇందులో శివుడి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించాడు. అతని హిందీ సినిమా 'స్పెషల్ 26'లో కాజల్ హీరోయిన్ గా నటించింది. సో... ఈ జంట తెరపైన పార్వతీ పరమేశ్వరులుగా బాగుంటారని 'కన్నప్ప' బృందం భావించిందట.
కంగనా బాటలో కాజల్...
కాజల్ కు మొదటి నుండి చిత్రసీమ మీద విపరీతమైన అభిమానం ఉంది. కాజల్ సోదరి నిషా (Nisha) సైతం తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే... ఇప్పుడు నటిగా అవకాశాలు సన్నగిల్లుతుండటంతో దర్శకత్వం వైపు దృష్టి సారించాలని కాజల్ భావిస్తోందట. తానే హీరోయిన్ గా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలని అనుకుంటోందట. ఇప్పటికీ కాజల్ కు వాణిజ్య ప్రకటనల్లో అవకాశాలు వస్తున్నాయి. అలానే కొన్ని సొంత వ్యాపారాలు ఉన్నాయి. అడపా దడపా సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న 'ఇండియన్ 3'లోనూ కాజల్ నటించింది. వాటితో తృప్తి పడకుండా ఇప్పుడీ ప్రయోగం అవసరమా? అని కొందరు అంటున్నారు. అయితే... బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సైతం తన సొంత చిత్రాలను డైరెక్ట్ చేస్తూ తనే హీరోయిన్ గా నటిస్తోంది. బహుశా... కంగనానే కాజల్ కూ ఆదర్శం అయిఉండొచ్చు అని మరి కొందరు అంటున్నారు.
Also Read: Tollywood: పవన్ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో సినీ పెద్దల మీటింగ్
Also Read: Tollywood: మంచి నిర్మాత మహేంద్ర మరిలేరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి