Kangana Ranaut: రెండు ప్రాజెక్ట్స్ తో రానున్న పొలిటికల్ బ్యూటీ
ABN, Publish Date - Aug 30 , 2025 | 06:36 PM
పొలిటికల్ బ్యూటీ… మరో రెండు సినిమాలతో రాబోతోందా? పాపులారిటీని మరింత పెంచుకునేందుకు తన హిట్ మూవీస్ కే సీక్వెల్స్ చేస్తూ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలని తహతహలాడుతోందా.అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మండి ఎంపీగా రాజకీయ రంగంలో రాణిస్తున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) సినిమాల్లో కూడా తిరిగి తన మార్క్ను చూపించడానికి రెడీ అవుతోంది. కమర్షియల్ రోల్స్కు టాటా చెప్పి, స్ట్రాంగ్ లేడీ-సెంట్రిక్ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆమె, తన కెరీర్లో ఐకానిక్ మూవీస్ గా పేరు తెచ్చుకున్న రెండు ప్రాజెక్టుల సీక్వెల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.
2014లో బ్లాక్బస్టర్ హిట్ అయిన 'క్వీన్' (Queen) కంగనా కెరీర్లో గేమ్ చేంజర్. దీని సీక్వెల్ కోసం స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు అమ్మడి టీమ్ చెబుతోంది. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేస్తున్నారట. డైరెక్టర్ వికాస్ బహల్ (Vikas Bahl) ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్ దశలో భాగంగా లొకేషన్ ఎంపిక, ఇతర సన్నాహాలపై దృష్టి పెట్టాడట. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక కూడా త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాను... కంగనా ఎంపీ బాధ్యతల కారణంగా 40-50 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
'తను వెడ్స్ మను' (Tanu Weds Manu) సిరీస్ కూడా కంగనా కెరీర్లో కీలకమైనది. 2011లో విడుదలైన మొదటి భాగం, 2016లో వచ్చిన 'తను వెడ్స్ మను రిటర్న్స్' (Tanu Weds Manu Returns) రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో భాగం కోసం కూడా ఆమె సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా సంస్థతో మాట్లాడుతూ, 'క్వీన్, తను వెడ్స్ మను చిత్రాలను తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైనవిగా పేర్కొంది కంగన. ఈ సిరీస్లో ఎన్ని సీక్వెల్స్ అయినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంది. 'తను వెడ్స్ మను 3' కూడా త్వరలో పట్టాలెక్కబోతోందట. ఎంపీగా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్న కంగనా, సినిమాలకు లిమిటెడ్ టైమ్ మాత్రమే ఇవ్వగలదు. అందుకే ముందుగా 'క్వీన్ 2'తో స్టార్ట్ చేసి, తర్వాత 'తను వెడ్స్ మను 3'ని కూడా స్మార్ట్గా, షార్ట్ టైమ్లో కంప్లీట్ చేసే ప్లాన్లో ఉందట కంగన టీమ్. చూడాలి మరి ఏం జరుగుతుందో…
Read Also: Priyanka Chopra: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29'.. ప్రియాంక ఏం చేస్తుందంటే..
Read Also: Allu Kanakaratnam: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన మనవళ్లు